కర్నూలుకు ఏపీఈఆర్సీ కార్యాలయం

Published : 23 May 2024 03:26 IST

నేడు ప్రారంభోత్సవ పూజ

కర్నూలులో నిర్మించిన ఏపీఈఆర్సీ కార్యాలయం

ఈనాడు, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు రానుంది. ఆ కార్యాలయం కోసం కర్నూలు శివారు దిన్నెదేవరపాడులో రెండు ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు పూర్తికావడంతో గురువారం ప్రారంభోత్సవ పూజను నిర్వహించనున్నారు. వారం రోజుల వ్యవధిలో సంస్థ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో జరిగేలా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ రెండో తేదీతో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ఆ తేదీ లోపు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్నూలుకు వెళ్లాలని నిర్ణయించారు. 

ఉద్యోగుల్లో ఆందోళన: ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని గత ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి భవనాన్ని కూడా కేటాయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్నూలును న్యాయ రాజధానిగా చేసే క్రమంలో భాగంగా ఇప్పటికే లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర వక్ఫ్‌ ట్రైబ్యునల్‌లను ఏర్పాటు చేశారు. రాజధానిలో ఉండాల్సిన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయడంపై ఇప్పటికే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర కార్యాలయాలను రాజధాని నుంచి తరలించవద్దని హైకోర్టు కూడా సూచించింది. అయినప్పటికీ ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని కర్నూలు తీసుకు వస్తుండటంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తాము మళ్లీ కర్నూలు నుంచి అమరావతికి వెళ్లాల్సి వస్తుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కీలక తరుణంలో తరలింపు: ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఎన్నికలకోడ్‌ అమల్లో ఉంది. కొన్ని రోజులు నిరీక్షిస్తే మార్పు చేర్పులకు అవకాశం లేని, గందరగోళానికి తావులేని విధంగా శాశ్వత ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని హడావుడిగా కర్నూలు తరలిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని