సంక్షిప్తవార్తలు(11)

పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల్లో  శాశ్వతంగా పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు డిమాండు చేశారు.

Updated : 23 May 2024 05:56 IST

పిన్నెల్లిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయనీయవద్దు
ఏపీ ప్రొఫెషనల్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు

ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల్లో  శాశ్వతంగా పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు డిమాండు చేశారు. పోలింగ్‌ సరళిని పరిశీలించడానికే ఎన్నికల సంఘం అభ్యర్థులకు నేరుగా వెళ్లే అవకాశం కల్పించిందన్నది వారు గుర్తుంచుకోవాలని బుధవారం ప్రకటనలో సూచించారు. 


ఈవీఎం ధ్వంసం ఘటనలో సీఈవో వివరణ సంతృప్తికరంగా లేదు
ఏపీ ఎలక్షన్‌ వాచ్‌ కన్వీనర్‌ నిమ్మగడ్డ

ఈనాడు-అమరావతి: ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఏపీ ఎలక్షన్‌ వాచ్‌ కన్వీనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఓ ప్రకటనలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) కోరారు. పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన వారిపై సీఈవో తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన ఘటన జరిగిన వెంటనే పోలీసులను అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత సీఈవో ఏకపక్షంగా ప్రకటించడం భావ్యం కాదు. పల్నాడు జిల్లాలో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడిన ఘటనలు వెలుగులోకి రాకపోవడానికి అదే కారణం. ఈ చర్యలు పోలింగ్‌ రోజే తీసుకుంటే బాగుండేది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై సీఈవో కార్యాలయం ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


168 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్‌ సెర్చ్‌
డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

ఈనాడు డిజిటల్, అమరావతి: కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేసి 14 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘అన్ని జిల్లాల పరిధిలోని అనుమానిత ప్రాంతాల్లో ఈనెల 21 నుంచి 22 వరకు ఎస్పీల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాం. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 803 వాహనాలు జప్తు చేశాం. 310 లీటర్ల అక్రమ మద్యం, 130 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా స్థానిక పోలీసులకు లేదా 112 లేదా 100 నంబర్లను సంప్రదించాలి’ అని డీజీపీ సూచించారు.


ఈవీఎంను ధ్వంసం చేసింది ఎమ్మెల్యేనే

ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు
సీఈసీకి నివేదించిన డీజీపీ

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని గుర్తించామని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. వీడియోలో ఉన్నది ఎమ్మెల్యే అయితే ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో.. డీజీపీ బుధవారం సాయంత్రం సీఈఓ ద్వారా నివేదిక పంపారు. ‘13వ తేదీ మధ్యాహ్నం ఈవీఎం ధ్వంసం జరిగింది. 15న పీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులని కేసు నమోదైంది. సిట్‌ రంగంలోకి దిగాక.. వెబ్‌క్యాస్టింగ్‌ను పరిశీలించే సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసినట్లు గుర్తించాం. కేసులో ఆయన్ను ఏ1గా చేర్చాం. ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు’ అని నివేదికలో వివరించారు.


ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కర్ణాటకలో అమలవుతున్న చట్టం తరహాలో దీనిని తీసుకురానున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి సూచనలు, సలహాలను ప్రభుత్వం ఆహ్వానించింది. వాటిని ఈ నెల 28లోపు పాఠశాల విద్యాశాఖ జేడీకి పంపించాలని సూచించింది. ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీ ఉంటుంది. ఆ బదిలీలను కచ్చితంగా వేసవి సెలవుల్లోనే నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడు కేటగిరీ-1లో ఒక్కసారి మాత్రమే పని చేయాలనే నిబంధననూ తీసుకురానున్నారు. దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు అన్ని కేటగిరిల్లోనూ పని చేయాల్సి ఉంటుంది. పట్టణం నుంచి మారుమూల పల్లెలోని బడికి వరకు బదిలీల్లో వెళ్లాల్సి వస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పైరవీ, సిఫార్సు బదిలీలకు ఆస్కారం లేకుండా అన్నీ కౌన్సెలింగ్‌ బదిలీలే జరిగేలా చట్టంలో నిబంధన పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కీలక మంత్రి, ఆయన పీఏ, కొందరు అధికారులు కలిసి భారీగా పైరవీ బదిలీలు నిర్వహించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, డబ్బులు ఉన్నవారు బదిలీలు చేయించుకోగలిగారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు.


ఏపీ ఆర్‌సెట్‌ ఫలితాలు విడుదల
త్వరలోనే ఇంటర్వ్యూ షెడ్యూల్‌

ఫలితాలు విడుదల చేస్తున్న వీసీ ఆచార్య శ్రీకాంత్‌రెడ్డి, సెట్‌ కన్వీనర్‌ ఆచార్య దేవప్రసాద్‌రాజు తదితరులు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఆర్‌సెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను సెట్‌ కన్వీనర్‌ ఆచార్య దేవప్రసాద్‌రాజుతో కలిసి వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.శ్రీకాంత్‌ రెడ్డి తిరుపతిలో విడుదల చేశారు. అన్ని విభాగాలకు కలిపి 8,651 మంది పరీక్షకు హాజరుకాగా 4,352 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఫలితాలను https://cets.apsche.ap.gov.inలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల్లోని 2,728 పీహెచ్‌డీ సీట్లలో ప్రవేశాలు కల్పించేందుకు ముఖాముఖిలు నిర్వహిస్తామన్నారు. జూన్‌ 10 తర్వాత షెడ్యూల్‌ ప్రకటిస్తామని.. ఆ తర్వాత ర్యాంకులు విడుదల చేస్తామని వీసీ వివరించారు. ఆచార్యులు కిశోర్, కుమారస్వామి, కుసుమహరినాథ్‌ పాల్గొన్నారు.


పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాల అందించాలి: సీఎస్‌ 

ఈనాడు, అమరావతి: పాఠశాలలు తెరిచే జూన్‌ 12 నాటికి విద్యార్థులకు పుస్తకాలతోపాటు ఏకరూపదుస్తులు, బ్యాగులువంటివన్నీ అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సరం సన్నాహక ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘మండల స్థాయి నిల్వ కేంద్రాల ద్వారా పాఠశాలలకు పుస్తకాలు తదితర వస్తువులను అందించాలి. వీటి సరఫరాపై నిత్యం ప్రత్యేకంగా పర్యవేక్షించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో 36,54,539మంది విద్యార్థులు ఉన్నారని, జూన్‌ 10లోగా విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పాఠ్యపుస్తకాల ముద్రణ 82శాతం పూర్తయిందని, 1-10 తరగతి వరకు ద్విభాష పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. 


సీపెట్‌ దరఖాస్తులకు 31 వరకు గడువు

ఈనాడు, అమరావతి: ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 వరకు అవకాశం కల్పించినట్లు కేంద్ర పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థ (సీపెట్‌) సంయుక్త సంచాలకులు సీహెచ్‌ శేఖర్‌ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మూడేళ్ల ప్లాస్టిక్‌ టెక్నాలజీ (డీపీటీ), ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. బీఎస్సీ విద్యార్థులకు రెండేళ్ల పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌-టెస్టింగ్‌ (పీజీడీ-పీపీటీ) కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థులకు హాస్టల్‌ వసతి, అర్హులైన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం ఉందని వెల్లడించారు. జూన్‌ 9న విజయవాడ, అనంతపురంలో సీపెట్‌ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 150 సీట్లను భర్తీ చేస్తామని.. సందేహాల నివృత్తికి 6300147965 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు.


ఏపీ ఈఏపీసెట్‌కు 93.87 శాతం హాజరు

గాంధీనగర్, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూకే కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్‌-2024కు.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్‌లో 93.87 శాతం మంది హాజరైనట్లు సెట్‌ ఛైర్మన్, వీసీ జీవీఆర్‌.ప్రసాదరాజు తెలిపారు. ఉదయం సెషన్‌కు 30,173 మందికి 28,203 మంది.. మధ్యాహ్నం సెషన్‌కు 30,533 మందికి 28,784 మంది హాజరయ్యారన్నారు.


రాష్ట్రస్థాయి శాంక్షనింగ్‌ కమిటీ సమావేశం
వ్యవసాయ అనుబంధ పథకాలపై చర్చ

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రీయ కృషి వికాస, కృషోన్నతి పథకం కింద 2024-25 వార్షిక కార్యాచరణలో భాగంగా.. రూ.1,193 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లోని పథకాలను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి శాంక్షనింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. వ్యవసాయ రంగంలో రూ.134కోట్ల వ్యయంతో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లలో డ్రోన్లు అందుబాటులోకి తేవడం లాంటి పలు అంశాలపై చర్చించారు. కృషోన్నతి యోజన కార్యాచరణ ప్రణాళిక అమలుపైనా సమీక్షించారు.


కిర్గిజ్‌స్థాన్‌లోని పరిస్థితిని విద్యార్థులకు చేరవేస్తున్నాం
ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌

ఈనాడు, అమరావతి: కిర్గిజ్‌స్థాన్‌లో ప్రస్తుతం.. పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు విదేశీ వ్యవహారాలశాఖ తెలియజేసిందని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) పేర్కొంది. అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని, విదేశాంగశాఖ ఇస్తున్న సలహాలను సకాలంలో తెలుగు విద్యార్థులకు చేరవేస్తున్నట్లు వెల్లడించింది. అక్కడున్న విద్యార్థులు దేశానికి తిరిగి రావాలనుకుంటే ఈనెల 23 నుంచి కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌ నుంచి దిల్లీకి.. ప్రతి రోజూ రెండు విమానాలు నడుస్తాయని విదేశాంగశాఖ తెలిపినట్లు వివరించింది. వైద్య విద్యార్థులు తిరిగి రావడానికి ముందు.. జాతీయ వైద్య కమిషన్‌ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించింది. కాగా ఆ దేశంలో ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు