మార్కులతో పాఠశాలల పనితీరును నిర్ణయిస్తే వాస్తవాలు వెలుగులోకి రావు

పదోతరగతి పరీక్షల మార్కుల ఆధారంగా పాఠశాలల పనితీరును నిర్ణయించే విధానం అసంబద్ధమైనదని, దీంతో వాస్తవాలు తెలియవని సామాజికవేత్త గుంటుపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు.

Published : 23 May 2024 04:20 IST

ఇంగ్లాండ్‌ వదిలేసిన పద్ధతిని ఇప్పుడు అమలు చేస్తారా?
సమజాన్ని తప్పుదోవ పట్టించేందుకే మార్కులతో పోలిక
ప్రవీణ్‌ ప్రకాష్‌కు సామాజికవేత్త గుంటుపల్లి శ్రీనివాస్‌ బహిరంగ లేఖ

ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్షల మార్కుల ఆధారంగా పాఠశాలల పనితీరును నిర్ణయించే విధానం అసంబద్ధమైనదని, దీంతో వాస్తవాలు తెలియవని సామాజికవేత్త గుంటుపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మంగళవారం నిర్వహించిన ‘ఫ్రమ్‌ ద డెస్క్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ కార్యక్రమంలో ఆయన వెల్లడించిన అంశాలను ప్రస్తావిస్తూ.. శ్రీనివాస్‌ బహిరంగ లేఖ రాశారు. ‘పబ్లిక్‌ పరీక్షల మార్కుల ఆధారంగా పాఠశాలల పనితీరును నిర్ణయించే విధానాన్ని ఇంగ్లాండ్‌లో 1880లోనే వదిలేశారు. ఈ విధానం వల్ల విద్యార్థుల సమగ్రాభివృద్ధి పరిశీలించడానికి పబ్లిక్‌ పరీక్షల్లో మార్కులు ఒక్కటే కొలమానం కాదని వారు నిర్ణయించారు. ఇంగ్లాండ్‌ వదిలేసిన విధానాన్ని ఇప్పుడు మన ప్రభుత్వం శిరోధార్యంగా భావిస్తోంది. మన రాష్ట్రంలో పది పబ్లిక్‌ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలు విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరీక్షించేలా లేవు. జవాబు పత్రాల మూల్యాంకన నియమాలు అసంబద్ధంగా ఉన్నాయి. మార్కులు ఇష్టారాజ్యంగా వేసేస్తున్నారు. ఇలాంటి నిబంధనలు పెట్టి సమాజాన్ని, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఇంతటి అవకతవకలున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల మార్కులను ఆధారంగా చేసుకొని.. బడుల పనితీరు, విద్యార్థుల చదువులలో నాణ్యతను పరీక్షించడం అసంబద్ధమైన అనాలోచిత చర్య’ అని పేర్కొన్నారు. ‘అమెరికా, ఆస్ట్రేలియాలలో ప్రభుత్వ బడుల్లో జవాబుదారీతనం ఉంది. ప్రతి నెలా పాఠశాలలను తనిఖీ చేస్తారు. తరగతి గదిలో పాఠాలు ఎలా చెబుతున్నారో స్కూల్‌ ఇన్స్‌పెక్టర్‌.. పీరియడ్‌ అంతా కూర్చొని పాఠాలు వింటారు. తనిఖీ నివేదిక రాస్తారు. అక్కడ పరీక్షల్లో చూచిరాతలు ఉండవు. దీంతో తల్లిదండ్రులకు, సమాజానికి విద్యార్థుల వాస్తవ సామర్థ్యాలు తెలుస్తాయి. ఇలాంటప్పుడు ఉపాధ్యాయులు.. విద్యార్థుల ఇళ్లకు వెళ్లడం వల్ల వారి కుటుంబ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చు. ఎన్నో పర్యాయాలు పాఠశాలలను పరిశీలించిన మీరు.. ఒక్క తరగతిలో అయినా పూర్తిగా కూర్చొని పాఠాలు ఎలా చెబుతున్నారో విన్నారా?’ అని ప్రవీణ్‌ ప్రకాష్‌ను గుంటుపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని