ఓట్ల లెక్కింపు వరకూ ఉండలేం

‘వైకాపా అభ్యర్థులు, ఆ పార్టీ నేతల వేధింపులను భరించలేకపోతున్నాం.. తక్షణమే మెడికల్‌ లీవ్‌లు ఇప్పించండి’ అంటూ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులే (ఆర్‌ఓలు) మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగుతింటోంది.

Published : 23 May 2024 06:40 IST

మెడికల్‌ లీవ్‌ ఇప్పించండి..
వైకాపా అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్నాం
ఎన్నికల సంఘానికి ఆర్‌ఓల మొర
రాయలసీమ జిల్లాల నుంచే సుమారు 15 మంది వినతులు
ఇది దేశంలోనే   అసాధారణ పరిస్థితి

ఈనాడు, అమరావతి: ‘వైకాపా అభ్యర్థులు, ఆ పార్టీ నేతల వేధింపులను భరించలేకపోతున్నాం.. తక్షణమే మెడికల్‌ లీవ్‌లు ఇప్పించండి’ అంటూ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులే (ఆర్‌ఓలు) మొరపెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగుతింటోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పనిచేసే సుమారు 15 మంది ఆర్‌ఓలు.. తమకు గంటకో యుగంలా గడుస్తోందంటూ తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక ఎన్నికల సంఘం (ఈసీ) తల పట్టుకుంటోంది. ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వారు చెబుతుండటంతో పరిష్కారం ఏమిటనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి ఇది. పోలింగ్‌ నాటి నుంచే తమను తప్పించాలంటూ   ఆర్‌ఓలు కోరుతున్నా.. ఇప్పుడు మరింత మంది నుంచి వినతులు వస్తున్నాయని  ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

అసభ్యకరమైన మాటలు.. తీవ్ర ఒత్తిళ్లు 

ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అధికారులు నిష్పాక్షికంగా పనిచేయాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల ఆర్‌ఓలు పోలింగ్‌ ముందు నుంచే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అధికారంలో ఉన్నది తమ పార్టీ అని.. తాము ఏం చెబితే అదే జరగాలని వైకాపా అభ్యర్థులు అక్కడి ఆర్‌ఓలను హెచ్చరిస్తున్నారు. తమ మాటలు వినకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు. ఏదైనా ఒక పనిచేయకపోతే.. దూషిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పనిచేసే ఒక ఆర్‌ఓను.. అక్కడి వైకాపా అభ్యర్థి పలుసార్లు హెచ్చరించారు. రాయలసీమలోని పలుచోట్ల కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో కొందరు రిటర్నింగ్‌ అధికారులు ఏం చేయాలో తెలియక.. కలెక్టర్‌ స్థాయిలో ఉన్న వారైనా తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారన్న ఆశతో జిల్లా ఎన్నికల అధికారులను కలిసి తమపై అధికారపార్టీ ఒత్తిళ్లు లేకుండా చూడాలని కోరుతున్నారు. అయితే అక్కడా వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. జిల్లా అధికారులు కూడా మౌనంగా తమ పని తాము చేసుకుపోతున్నారు.

ఓట్ల లెక్కింపు.. వైకాపా నేతల బెదిరింపులు

పల్నాడులో ఈవీఎం ధ్వంసం, తాడిపత్రి, తిరుపతి తదితర ఘటనల నేపథ్యంలో.. ఆర్‌ఓల్లో భయాందోళనలు మొదలయ్యాయి. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అనే ఆందోళన వారిలో నెలకొంది. ఇప్పటి నుంచే వైకాపా అభ్యర్థుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల పోలింగ్‌ ఏజెంట్ల నియమాకం నుంచి.. టేబుళ్ల ఏర్పాట్లు సహా వివిధ అంశాలపై తాము చెప్పినట్లు వినాలంటూ కొందరు వైకాపా అభ్యర్థులు చెబుతున్నారు. కొన్నిచోట్ల వారు చెబుతున్నట్లే ఆర్‌ఓలు వింటున్నా.. మరికొందరు మాత్రం ఎన్నికల సంఘం నిబంధనలను వివరిస్తున్నారు. అలా చేయలేమని స్పష్టం చేస్తుండటంతో వైకాపా నేతలు ఆగ్రహంతో నోటికొచ్చినట్లు నిందలేస్తున్నారనే ఆవేదన కొందరు ఆర్‌ఓల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఆర్‌ఓలు తమను తప్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు