ఫీజు చెల్లించలేదని తల్లులకు నోటీసులు

విద్యాదీవెన కింద తమ ఖాతాల్లో జమచేసిన మొత్తాన్ని కళాశాలలకు ఫీజుగా చెల్లించలేదని తల్లులకు నోటీసులు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 24 May 2024 06:11 IST

ఖాతాల్లో జమచేసిన వారంలోగా  చెల్లించాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: విద్యాదీవెన కింద తమ ఖాతాల్లో జమచేసిన మొత్తాన్ని కళాశాలలకు ఫీజుగా చెల్లించలేదని తల్లులకు నోటీసులు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీచేసింది. కళాశాలలకు నేరుగా ప్రభుత్వమే ఫీజు జమచేసే విధానాన్ని కాదని,  తన ప్రచారయావ కోసం తల్లుల ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించి, ఇన్నాళ్లూ అలా విడుదల చేసింది సీఎం జగనే. ఇప్పుడు ఫీజులు కట్టలేదంటూ నోటీసులు ఇప్పిస్తున్నదీ ఆయనే. పోనీ ఆయనేమైనా సక్రమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేశారా అంటే.. అదీ లేదు. త్రైమాసికాల వారీగా విడుదల చేస్తామంటూ ప్రచారం చేసుకోవడమే తప్ప... ఎప్పుడూ జమచేయలేదు. ఇప్పటికీ మూడు విడతల చెల్లింపులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

తప్పుడు సమాచారమిస్తే చర్యలు

విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని ఖాతాల్లోకి జమచేసిన వారంలోగా కళాశాలకు ఆ మొత్తాన్ని చెల్లించాలని.. అలా జమచేయని వారికి నోటీసులు ఇస్తోంది. తల్లులు ఇళ్లవద్ద ఉంటే వారికి నోటీసులు ఇచ్చి రసీదు తీసుకోవాలని ఆదేశించింది. వారి నుంచి సంతకం తీసుకుని ఆ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. అందుబాటులో లేని వారి ఇళ్లకు నోటీసులు అతికిస్తారు. నిర్దేశిత గడువులోగా ఫీజు చెల్లించనివారికి.. తదుపరి విడతను నేరుగా కళాశాలకే జమచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కళాశాలకు ఫీజు కట్టకపోయినా చెల్లించినట్టు తప్పుడు సమాచారమిస్తే తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని