గులకరాయి కేసులో నిందితుడికి బెయిల్‌ ఇవ్వొద్దు

ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయితో దాడి చేసిన కేసు విచారణ  కీలక దశలో ఉందని, ఇంకా పలువురు సాక్షులను విచారించాల్సి ఉందని.. ఈ దశలో నిందితుడు సతీష్‌ కుమార్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది కోరారు.

Updated : 24 May 2024 06:09 IST

బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ కౌంటర్‌ వేసిన ప్రభుత్వం
వాదనల నిమిత్తం ఈ నెల 27కి వాయిదా వేసిన కోర్టు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై గులకరాయితో దాడి చేసిన కేసు విచారణ  కీలక దశలో ఉందని, ఇంకా పలువురు సాక్షులను విచారించాల్సి ఉందని.. ఈ దశలో నిందితుడు సతీష్‌ కుమార్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది కోరారు. ఈ మేరకు గురువారం విజయవాడలోని 12వ ఏడీజే కోర్టులో పోలీసుల తరఫున ఏపీపీ కల్యాణి కౌంటర్‌ దాఖలు చేశారు. రెండువారాల క్రితం నిందితుడి తరఫున న్యాయవాది సలీం.. బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రాసిక్యూషన్‌ కౌంటర్‌ దాఖలు చేసింది. కేసుదర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని... డిజిటల్, శాస్త్రీయ ఆధారాలను సేకరించాల్సి ఉందన్నారు. నిందితుడి వాంగ్మూలం ఇంకా కోర్టులో నమోదు చేయాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో సతీష్‌కు బెయిల్‌ ఇస్తే.. సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కౌంటర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందున, బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చాలని అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనల నిమిత్తం న్యాయాధికారి భాస్కరరావు.. కేసును ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని