కమీషన్లు వచ్చే పెద్ద బిల్లులకే చెల్లింపులు

జలజీవన్‌ మిషన్‌ పనుల్లో భారీగా కమీషన్లు వచ్చే బడా గుత్తేదారులకే బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.

Updated : 24 May 2024 06:06 IST

జేజేఎం పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో చిన్న గుత్తేదారులకు ఝలక్‌
4 నెలల క్రితం అప్‌లోడ్‌ చేసిన బిల్లులు ఇప్పుడు తిరస్కరణ
పెద్ద గుత్తేదారుల సంస్థలకు రూ.700 కోట్లు చెల్లించేలా ఏర్పాట్లు

ఈనాడు, అమరావతి: జలజీవన్‌ మిషన్‌ పనుల్లో భారీగా కమీషన్లు వచ్చే బడా గుత్తేదారులకే బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. చిన్న గుత్తేదారులను గాలికొదిలేసి దాదాపు రూ.700 కోట్ల బిల్లులను బడా సంస్థలకు చెల్లించనుంది. కొత్త ప్రభుత్వం వచ్చేలోపే ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించి సొమ్ములు దండుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం చిన్న గుత్తేదారులు ఇప్పటికే అప్‌లోడ్‌ చేసిన బిల్లులను తిరస్కరిస్తున్నారు. పొడిగించిన ఒప్పంద సమయం దాటాక బిల్లులు పెట్టారన్న కారణం చూపించి వెనక్కి పంపుతున్నారు. దీంతో అప్పులు తెచ్చి పనులు చేసిన చిన్న గుత్తేదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడలో గురువారం సమావేశమైన వీరంతా ప్రభుత్వ తీరుకు నిరసనగా పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు అమర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.15,300 కోట్లతో చేపట్టిన జేజేఎం పనులు రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం ప్రారంభమయ్యీయి. గుత్తేదారులకు అప్పగించిన రూ.10,200 కోట్ల పనుల్లో రూ.4,200 కోట్ల మేర పూర్తయ్యాయి. రూ.3వేల కోట్లు చెల్లించారు. 2023-24 సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వ వాటా కింద రూ.700 కోట్లు విడుదల చేసే అవకాశం ఉందన్న సమాచారంతో బడా గుత్తేదారు సంస్థల ప్రతినిధులు రంగంలో దిగారు. ప్రభుత్వ పెద్దల ద్వారా తమ బిల్లులు చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులూ సహకరిస్తున్నారు.

అప్పుడే ఎందుకు తిరస్కరించలేదు?

చిన్న గుత్తేదారుల బిల్లులను తిరస్కరిస్తున్న గ్రామీణ తాగునీటిసరఫరా విభాగం ఇంజినీర్లు.. వీటిని తాము అప్‌లోడ్‌ చేసినప్పుడు సమయం దాటినట్లు ఎందుకు చెప్పలేదని చిన్న గుత్తేదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట అప్‌లోడ్‌ చేసినవాటికే తొలుత బిల్లులు చెల్లించే (ఫిఫో) విధానం జేజేఎం పనుల విషయంలో అమలులో ఉంది. ఆ ప్రకారం చూస్తే నాలుగు నెలల క్రితం బిల్లులు అప్‌లోడ్‌ చేసిన చిన్న గుత్తేదారులకు తొలుత చెల్లించాలి. వీటిని తిరస్కరించి, బడా గుత్తేదారు సంస్థలకు పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశంగా కనిపిస్తోంది.

పనులు నిలిపివేయాలని నిర్ణయం

బిల్లులు తిరస్కరించడాన్ని నిరసిస్తూ జేజేఎం పనులు నిలిపివేయాలని చిన్న గుత్తేదారులు నిర్ణయించారు. విజయవాడలో గురువారం సమావేశమైన వీరు బడా గుత్తేదారులకు మేలు చేసేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు చేసి పనులు చేస్తే చెల్లింపుల దశలో బిల్లులు తిరస్కరించడంపై నిరసన  వ్యక్తం చేశారు. బిల్లులు అప్‌లోడ్‌ చేసిన ప్రకారం చెల్లించాలని గుత్తేదారులు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని