నరసరావుపేటలో సిట్‌ దర్యాప్తు

పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలింగ్‌ రోజు, అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. సిట్‌ సభ్యురాలు, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత గురువారం మరోసారి పట్టణంలోని టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకొని విచారణ చేశారు.

Published : 24 May 2024 04:09 IST

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలింగ్‌ రోజు, అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. సిట్‌ సభ్యురాలు, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత గురువారం మరోసారి పట్టణంలోని టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకొని విచారణ చేశారు. తమపై అక్రమంగా కేసులు బనాయించారని అటు తెదేపా, ఇటు వైకాపా వర్గాల వారు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. నిందితులను గుర్తించడంలో టూటౌన్‌ పోలీసులు సరిగా వ్యవహరించలేదని, అందుకే సంబంధం లేనివారిని అరెస్టులు చేస్తున్నారని ఇరు పార్టీల వారు పేర్కొంటున్నారు. దీంతో ఏఎస్పీ అప్పటి వీడియోలను పరిశీలించి, ఎవరెవరిని అరెస్టు చేయాలో తాజాగా పోలీసులకు సూచనలు చేశారు. పోలింగ్‌ రోజు నరసరావుపేట టూటౌన్‌ పరిధిలోనే ఎక్కువగా అల్లర్లు జరిగాయి. పోలింగ్‌ ముగిశాక రాత్రి తన నివాసం వద్ద వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కారు ఎక్కి మీసం మెలేస్తూ వీరంగం సృష్టించారు. తెదేపా కార్యకర్తలు కొందరు గోపిరెడ్డి నివాసంపై దాడికి యత్నించారు. మల్లమ్మసెంటర్‌ వద్ద తెదేపా సానుభూతిపరుడి కారును వైకాపా అల్లరిమూక తగలబెట్టింది. మున్సిపల్‌ హైస్కూలు వద్ద ఓటేయడానికి వచ్చిన గోపిరెడ్డి తన అనుచరులతో తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. నిందితులను గుర్తించి కేసులు పెట్టడంలో టూటౌన్‌ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ముఖ్యంగా వైకాపా వారిని వదిలేశారు. ప్రస్తుతం సిట్‌ ఆయా వీడియోలు పరిశీలించి ప్రధాన నిందితులను గుర్తించింది. వారిని అరెస్టు చేయాలంటూ ఏఎస్పీ పోలీసులకు సూచించింది. మరోవైపు పోలింగ్‌ రోజు జరిగిన అల్లర్లకు సంబంధించి గురజాల నియోజకవర్గం దాచేపల్లికి చెందిన 22 మంది వైకాపా వర్గీయులు, తంగెడకు చెందిన 11 మంది తెదేపా వర్గీయులను పోలీసులు అరెస్టు చేసి గురువారం నరసరావుపేట జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని