వేసవి క్రీడా శిక్షణకు ఎసరు

గత అయిదేళ్ల నుంచి ఫక్తు వ్యాపార సంస్థగా మారిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణలోనూ అదే ధోరణి కనబరుస్తోంది.

Updated : 24 May 2024 05:30 IST

నిధులివ్వని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ
గతంలో 1,300 శిబిరాల నిర్వహణ
ఈ ఏడాది 225 మాత్రమే

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వాలీబాల్‌లో విద్యార్థులకు శిక్షణ

ఈనాడు, అమరావతి: గత అయిదేళ్ల నుంచి ఫక్తు వ్యాపార సంస్థగా మారిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణలోనూ అదే ధోరణి కనబరుస్తోంది. వీటి నిర్వహణకు జిల్లాకు రూ.3.50 లక్షల చొప్పున గత సంవత్సరం వరకు కేటాయించి ఈ ఏడాది నిధులు ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. స్పాన్సర్ల ద్వారా శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా అధికారులకు సూచించింది. గత ఏడాది వరకు జిల్లాకు 50 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,300 శిబిరాలు నిర్వహించింది. ఈ ఏడాది ‘శాప్‌’ కోచ్‌లు ఉన్న చోటే శిబిరాల నిర్వహణకు అనుమతులిచ్చింది. దీంతో జిల్లాల్లో ఇప్పటివరకు 225 శిబిరాలే ప్రారంభమయ్యాయి. జిల్లాకు పది కూడా ఏర్పాటు కాలేదు. స్పాన్సర్లు ఉన్న చోట విద్యార్థులకు తాగునీరు, పాలు, పండ్లు వంటివి అందిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కూడా లేదు.

విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు వేసవిలో శాప్‌ ఆధ్వర్యంలో ఏటా క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజులపాటు వీటిని నిర్వహించేది. శాప్‌ కోచ్‌లు అందుబాటులో లేని చోట క్రీడా సంఘాలు, సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏర్పాటుకు అనుమతిచ్చేది. ఒక్కో శిబిరం నిర్వహణకు రూ.7 వేలు చొప్పున అందజేసేది. ఇందులో రూ.1,500 శిక్షకులకు గౌరవ వేతనం, మరో రూ.500 ఇతర ఖర్చులకు వినియోగించేవారు. రూ.5 వేలు క్రీడా సామగ్రి కొనుగోలుకు వెచ్చిస్తుంటారు. జిల్లాకు రూ.3.50 లక్షలు చొప్పున రూ.91 లక్షలు శాప్‌ కేటాయించేది. ‘ప్లేఅండ్‌పే’ విధానంలో క్రీడా మైదానంలో ప్రాక్టీస్‌కు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేయడంలో, మైదానాలు ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకి ఇవ్వడంలో ముందుండే శాప్‌కి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు రూ.కోటి ఇవ్వడానికి చేతులు రాలేదు. శాప్‌ కోచ్‌లు ఉన్న చోటే ఈ ఏడాది శిబిరాలు నిర్వహిస్తోంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వద్ద అందుబాటులో ఉన్న క్రీడా సామగ్రిని వినియోగించుకోవాలన్న ఆదేశాలతో శిక్షకులు మమ అనిపిస్తున్నారు. గతంలో నెల రోజులపాటు నిర్వహించే శిబిరాలను ఈసారి 15 రోజులకే పరిమితం చేశారు. ఈ నెల 15న ప్రారంభమైన శిబిరాలు 30వ తేదీతో ముగియనున్నాయి.


శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు పాలు పంపిణీ చేస్తున్న దాతలు

దాతల్లారా.. రారండి!

శిక్షణ శిబిరాల నిర్వహణకు శాప్‌ నిధులు కేటాయించని కారణంగా కోచ్‌లు దాతలను వెతుక్కోవలసి వస్తోంది. ఉదయం, సాయంత్రం గంట నుంచి గంటన్నర వరకు శిక్షణకు హాజరయ్యే చిన్నారులకు తాగునీరు, పాలు, పండ్లు అందించాలంటే రోజుకు కనీసం రూ.1,000 అవసరం. 15 రోజులకు ఒక్కో శిబిరానికి రూ.15 వేలు కావాలి. అంతేకాక క్రీడా సామగ్రికి కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేలు అవసరం. ఇందుకోసం కోచ్‌లు సేవా సంస్థలు, దాతల ద్వారా సాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల స్పందన బాగున్నా...మిగిలిన  చోట్ల విద్యార్థులు ఇళ్ల నుంచే సీసాలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. శాప్‌ కోచ్‌లు.. ఇప్పటికే వినియోగిస్తున్న పాత క్రీడా సామగ్రితో నెట్టుకొస్తున్నారు. పొరుగు సేవల కోచ్‌లకు మూడు నెలలుగా జీతాలు లేవు. ఇప్పుడు వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ బాధ్యత కూడా అప్పగించడంతో వారంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు శాప్‌లో కీలకమైన మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా పెట్టడంతో పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకునే వీల్లేకపోతోంది. అనేక ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. గత నెల రోజులుగా ఎండీ పోస్టు ఖాళీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని