కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ల ఎంపిక ప్రక్రియ.. కోడ్‌ ఉల్లంఘనే

అయినవారికి కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదా కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు.

Updated : 25 May 2024 06:10 IST

యూపీఎస్సీ ఛైర్మన్‌కు చంద్రబాబు లేఖ 

ఈనాడు డిజిటల్, అమరావతి: అయినవారికి కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదా కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ కోసం జూన్‌ 4లోపు ఇంటర్వ్యూలు నిర్వహించాలని సీఎస్‌ చూడటం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ యూపీఎస్సీ ఛైర్మన్‌కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో నాన్‌ రెవెన్యూ ఐఏఎస్‌ పోస్టులు రెండు ఖాళీలున్నాయి. ఈ రెండింటిలో తమ వారినే నియమించుకోవాలని ఇద్దరు అధికారులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియలో ప్రస్తుత ప్యానెల్‌ బంధుప్రీతితో వ్యవహరించింది. జాబితా రూపకల్పనలో ఉల్లంఘనలు జరిగాయి. ఈ వ్యవహారంలో అర్హత కలిగిన అధికారులకు అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించాలన్న ఆలోచనను యూపీఎస్సీ వాయిదా వేయాలి’’ అని చంద్రబాబు కోరారు. లేఖ ప్రతుల్ని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపారు.

జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు 

అమెరికాలోని కాలిఫోర్నియాలో మహిళా న్యాయమూర్తిగా ఎంపికైన విజయవాడకు చెందిన జయ బాడిగకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఆమె పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలని ఎక్స్‌ వేదికగా అభిలషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని