చదివేది ఒకటి.. చెప్పాల్సింది మరొకటి

పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్టును, పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను తెచ్చారు.. కానీ, వీటిని బోధించే వారిని తయారు చేసే బీఈడీ, డీఈడీ సిలబస్‌లను మాత్రం ప్రభుత్వం మార్పు చేయలేదు. వీరికి రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగానే కోర్సును అందిస్తున్నారు.

Published : 25 May 2024 05:36 IST

వేగంగా మారిపోతున్న పాఠశాల సిలబస్‌
గత కొన్నేళ్లుగా మారని బీఈడీ పాఠ్యప్రణాళిక 
టీచర్ల నైపుణ్యాలకు, విద్యార్థుల అవసరాలకు కుదరని లంకె

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్టును, పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను తెచ్చారు.. కానీ, వీటిని బోధించే వారిని తయారు చేసే బీఈడీ, డీఈడీ సిలబస్‌లను మాత్రం ప్రభుత్వం మార్పు చేయలేదు. వీరికి రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగానే కోర్సును అందిస్తున్నారు. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సిలబస్, మార్కెట్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా బీఈడీ, డీఈడీ పాఠ్యప్రణాళికను మార్చకపోవడంతో ఉపాధ్యాయ విద్య చదివినా బోధన నైపుణ్యాలపై వారికి అవగాహన ఉండటం లేదు. దీంతో వారు చదివేది ఒకటి.. ఉద్యోగంలో చేరాక విద్యార్థులకు చెప్పాల్సింది మరొకటిగా తయారైంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) ఈ సిలబస్‌లో మార్పు చేయమని సూచించినా అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈసీ)-2020 అమలు చేస్తున్నామని చెబుతున్న విద్యాశాఖ అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను తయారు చేయడం లేదు. రాష్ట్రంలో బీఈడీ సిలబస్‌ను 2015 తర్వాత మార్పు చేయలేదు. గతంలో బీఈడీ కోర్సు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉండగా.. గత ఏడాది దీన్ని పూర్తిగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడింది. 

మొక్కుబడిగా ప్రాక్టికల్‌ పరీక్షలు 

ఈ ఏడాది నుంచి పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు కానుంది. 6, 7 తరగతుల్లోనూ కొన్ని సబ్జెక్టులు సీబీఎస్‌ఈవే ఉన్నాయి. మరోపక్క ఎన్‌సీటీఈ నాలుగేళ్ల బీఈడీ-డిగ్రీని తీసుకొచ్చింది. ఈ సమీకృత కోర్సుకు కేంద్రమే సిలబస్‌ ఇచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోనూ మార్పు చేయాల్సి ఉండగా ఆ ప్రయత్నమే చేయడం లేదు. బీఈడీ కళాశాలల అనుమతులు, ప్రవేశాలు, ఫీజుల వసూళ్లపైనే దృష్టిపెడుతున్న ఉన్నత విద్యాశాఖ వీటిల్లో ప్రమాణాలను పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా బీఈడీ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణ గాడి తప్పిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో బీఈడీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి బోధన చేసేవారు. ఈ ప్రాక్టికల్‌ పరీక్షలు అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను సాన పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడేవి. ఇప్పుడు దీన్ని అటకెక్కించారు. ఆయా కళాశాలల్లోనే ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించినట్లు రికార్డులు రూపొందించి మార్కులు వేసేస్తున్నారు. ఈ ఉల్లంఘనకు వంతపాడేందుకు వర్సిటీల పరిధిలో కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో బీఈడీ విద్యలో నాణ్యత లేకపోతే నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ విద్యలో పాఠాలు మార్చకుండా బడిలో సిలబస్‌లను మార్చడం వల్ల విద్యార్థులకు ఏం ప్రయోజనం లభిస్తుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని