అమరావతి నుంచి విశాఖ జిల్లాకు.. అనుమతుల్లేకుండానే తరలింపు

పోలింగ్‌ ప్రక్రియ పూర్తయి.. ఫలితాల కోసం అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఎవరి పర్యవేక్షణా ఉండదనే ధీమాతో అధికార వైకాపా అస్మదీయ గుత్త సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ రాజధాని అమరావతి నుంచి సామగ్రిని ఇష్టారీతిన తరలిస్తోంది.

Updated : 26 May 2024 09:56 IST

మొన్న తాగునీటి పైపులు.. నేడు విద్యుత్తు కేబుళ్లు
అస్మదీయ గుత్త ఏజెన్సీ మేఘా ఇష్టారాజ్యం

విద్యుత్తు కేబుల్‌ డ్రమ్ముల లోడ్‌తో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై భారీ వాహనాలు 

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే- తుళ్లూరు: పోలింగ్‌ ప్రక్రియ పూర్తయి.. ఫలితాల కోసం అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఎవరి పర్యవేక్షణా ఉండదనే ధీమాతో అధికార వైకాపా అస్మదీయ గుత్త సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ రాజధాని అమరావతి నుంచి సామగ్రిని ఇష్టారీతిన తరలిస్తోంది. సీఆర్డీఏ నుంచి అనుమతులు లేకుండానే ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని బరితెగించింది. రాజధాని అమరావతిలో భూగర్భంలో వేసేందుకు నిల్వ ఉంచిన విద్యుత్తు కేబుళ్లను విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురానికి తరలిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ తరలింపు వ్యవహారం బయటకు వచ్చింది. నాలుగు నెలల కిందట ఇలాగే అనుమతులు లేకుండానే ఆర్థికమంత్రి బుగ్గన చెప్పారంటూ.. అమరావతి నుంచి నంద్యాల జిల్లా డోన్‌కు రూ.20 కోట్ల విలువైన తాగునీటి పైపులను తరలించేసింది.

రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించేందుకు గత తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా విశాలమైన రహదారులు, భూగర్భ విధానంలో విద్యుత్తు నెట్‌వర్క్, తాగునీరు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అండర్‌గ్రౌండ్‌ డక్ట్‌లను నిర్మించింది. వీటిలో విద్యుత్తు తీగలను ఏర్పాటుచేయాలి. ఈ పనుల్లో ఓ ప్యాకేజీని ఆరేళ్ల కిందట మేఘా సంస్థ దక్కించుకుంది. పనులు ప్రారంభమై, పురోగతిలో ఉన్న సమయంలో ప్రభుత్వం మారింది. జగన్‌ ప్రభుత్వం రాకతో రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. భారీ విద్యుత్తు తీగలు ఉన్న డ్రమ్ములను మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ రాయపూడి, లింగాయపాలెం గ్రామాల మధ్య కృష్ణా కరకట్ట పక్కన రేకుల షెడ్డు నిర్మించి, నిల్వ చేసింది.

విద్యుత్తు కేబుల్‌ డ్రమ్ములు

సీఆర్డీఏ అనుమతులు లేకుండానే!!

అమరావతిలో నిల్వ చేసిన విద్యుత్తు కేబుల్‌ డ్రమ్ములను విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురానికి తరలిస్తున్నారు. అక్కడ ఈ సంస్థ చేపట్టిన పనుల నిమిత్తం వీటిని తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కటి సుమారు 500 మీటర్ల నిడివి కలిగిన 220 కేవీ తీగలున్న డ్రమ్ములను భారీ వాహనాల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు. రవాణా వాహనాల వద్ద ఉన్న కాగితాలను పరిశీలిస్తే.. వాటిపై డ్రమ్ములు అమ్మడానికి కాదు... కేవలం ఒక సైట్‌ నుంచి మరో సైట్‌కు తరలించటానికే అని రాసి ఉంది. సత్యసాయి ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ బిల్లుతో భారీ వాహనాల్లో డ్రమ్ములను తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు దాదాపు 18 డ్రమ్ములు తరలించినట్లు సమాచారం. లింగాయపాలెం నుంచి మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్, అచ్యుతాపురం, విశాఖపట్నం అని ట్రాన్స్‌పోర్ట్‌ బిల్లులో ఉంది. ఇక్కడి సామగ్రిని మరో ప్రాంతానికి తరలించాలంటే సీఆర్డీఏ అనుమతివ్వాలి. దీనికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. డ్రమ్ములను తరలిస్తున్న వాహనాల వద్దకు పోలీసులు శనివారం వచ్చి పరిశీలించి.. వివరాలు నమోదు చేసుకుని వదిలేశారు. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ఉద్దేశించిన సామగ్రిని వేరే ప్రాంతాలకు తరలించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని