తెలుగు భాషాభివృద్ధి రాజకీయ పదవులతోనే సాధ్యం: బుద్ధప్రసాద్‌

తెలుగు భాషాభివృద్ధి రాజకీయ పదవులతోనే సాధ్యమవుతుందని మాజీ ఉప సభాపతి, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Published : 27 May 2024 04:19 IST

వ్యాస రమణీయం గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న బుద్ధప్రసాద్, గజల్‌ శ్రీనివాస్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పూర్ణచంద్‌ తదితరులు

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు భాషాభివృద్ధి రాజకీయ పదవులతోనే సాధ్యమవుతుందని మాజీ ఉప సభాపతి, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం, దివి సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదివారం అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో బుద్ధప్రసాద్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉంటూ సాహిత్యం, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించినట్లు గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ జ్ఞాపకాలే కొనసాగేలా చేశాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు తనకు అండగా నిలిచారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగు భాష వ్యాప్తికి, పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. గజల్‌ కళాకారుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాలను ఎరిగిన యోగి పుంగవుడు మండలి బుద్ధప్రసాద్‌ అని కొనియాడారు. ఈ సందర్భంగా సాహితీవేత్త, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివంగత శ్రీరమణ రచించిన ‘వ్యాస రమణీయం’ గ్రంథాన్ని ఆవిష్కరించి బుద్ధప్రసాద్‌కు అంకితమిచ్చారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పూర్ణచంద్, సాహితీవేత్త పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌తోపాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని