Hepatitis: కర్నూలు, కోనసీమల్లో హెపటైటిస్‌ ముప్పు

శరీరంలో నిద్రాణంగా దాగి ఉన్న హెపటైటిస్‌ వైరస్‌లు కాలేయానికి పెనుముప్పు తెస్తున్నాయి. రక్త మార్పిడి, లైంగిక సంపర్కం, సిరంజ్‌ల వినియోగంలో సురక్షిత విధానాలు అవలంబించకపోవటం వంటివి ఈ వైరస్‌ల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.

Updated : 28 May 2024 07:50 IST

విశాఖ, గుంటూరు జిల్లాల్లోనూ కేసులు  
బాధితుల్లో తెలంగాణ ప్రజలు కూడా..
నిద్రాణంగా ఉండి కాటేస్తున్న వైరస్‌లు 
కాలేయానికి పెనుప్రమాదం అంటున్న వైద్యులు 

ఈనాడు, అమరావతి: శరీరంలో నిద్రాణంగా దాగి ఉన్న హెపటైటిస్‌ వైరస్‌లు కాలేయానికి పెనుముప్పు తెస్తున్నాయి. రక్త మార్పిడి, లైంగిక సంపర్కం, సిరంజ్‌ల వినియోగంలో సురక్షిత విధానాలు అవలంబించకపోవటం వంటివి ఈ వైరస్‌ల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. రాష్ట్రంలోని కర్నూలు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోని 16 బోధనాసుపత్రుల్లో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చినవారికి పరీక్షలు చేసినప్పుడు హెపటైటిస్‌- బి కేసులు 205, హెపటైటిస్‌- సి కేసులు 61 బయటపడ్డాయి. ఇందులో గుంటూరు జీజీహెహెచ్‌లో 30, విజయవాడలో 17, శ్రీకాకుళంలో 12 హెపటైటిస్‌- బి కేసులు బయటపడ్డాయి. విశాఖపట్నం కేజీహెచ్‌లో 15, కర్నూలు జీజీహెచ్‌లో 17 చొప్పున కేసులు రికార్డయ్యాయి. ఫిబ్రవరి 12 నుంచి.. 18 మధ్య హెపటైటిస్‌- బి కేసులు 15 గుర్తించారు. హెపటైటిస్‌- సి కేసులు విశాఖలో 14, కర్నూలులో 17 కేసుల చొప్పున తేలాయి. పాలిచ్చే తల్లుల్లోనూ ఈ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కర్నూలులో రెండేళ్లలో 3,200 కేసులు 

కర్నూలు ప్రభుత్వాసుపత్రికి గత రెండేళ్ల కాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన 18,460 మంది రోగులకు హెపటైటిస్‌-బి నిర్ధారణ పరీక్షలు చేయగా ఏకంగా 2,536 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 742 మంది మందులు వాడుతున్నారు. ఇప్పటికే పలువురు చనిపోయారు. 491 మందికి చికిత్స అందిస్తున్నారు. 1,884 మందికి హెపటైటిస్‌-సి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా 1,199 మందిలో ఆ వ్యాధి మూలాలు ఉన్నట్లు వెల్లడైంది. తదుపరి మళ్లీ పరీక్షలు చేసి, 692 మందికి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో అత్యధికులు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల, ఐజ, అలంపూర్‌ ప్రాంతాలవారు, ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలానికి చెందినవారు ఉన్నారని కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగ అసోసియేట్‌ ఆచార్యులు డాక్టర్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.

కోనసీమ జిల్లాలో 600 కేసులు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో గడిచిన ఏడాది కాలంలో సుమారు 600 హెపటైటిస్‌ కేసులు నమోదయ్యాయి. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఈ మధ్యకాలంలో హెపటైటిస్‌-బి కేసులు 39, సి కేసులు 146 రికార్డయ్యాయి. ఇక్కడ నెలకు సుమారు 20-23 హెపటైటిస్‌-సి పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో హెపటైటిస్‌-బి కేసులు భారీగా వస్తున్నాయి. కొత్తపేట సీహెచ్‌సీలో హెపటైటిస్‌-సి కేసులు 48 వచ్చాయి. ఈ ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో కనిపిస్తున్నాయి. 

కాలేయ వైఫల్యం, క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం

హెపటైటిస్‌ బి, సి వైరస్‌ల బారిన పడినవారికి తరచూ కాళ్ల వాపులు, నీరసం వస్తుంటాయి. పచ్చకామెర్లు, రక్తపువాంతులు అవుతుంటాయి. క్రమంగా పనిచేసుకోలేని స్థితికి చేరుకుంటారు. ఈ వైరస్‌లు దేహంలో దీర్ఘకాలంపాటు తిష్ఠవేసి, కాలేయ వైఫల్యానికి, క్యాన్సర్లకు దారితీస్తున్నాయి. ‘లివర్‌ సిరోసిస్‌’ అనే వ్యాధి బారినపడతారు. మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయి. జైళ్లల్లోనూ ఈ కేసులు ఉంటున్నాయి.


బ్లేడ్లు, సిరంజిల వాడకంతో వ్యాప్తికి అవకాశం

- డాక్టర్‌ జగన్‌మోహన్, హెచ్‌ఓడీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, విజయవాడ బోధనాసుపత్రి

క్షౌరశాలల్లో ఒకరికి వినియోగించిన బ్లేడ్లు, షేవింగ్‌ కిట్లను మరొకరికి వాడితే హెపటైటిస్‌ వైరస్‌లు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు డిస్పోజబుల్‌ సిరంజ్‌లు అందుబాటులోకి రాకముందు ఒకే సిరంజిని, సూదిని సైతం పలువురికి వినియోగించే సంస్కృతి చాలాచోట్ల కొనసాగింది. కొన్నిచోట్ల ఇప్పటికీ సిరంజ్‌లు బయటపడేస్తున్నారు. కిడ్నీలు దెబ్బ తింటే.. కనీసం డయాలసిస్‌ సౌకర్యం ఉంది. లివర్‌ దెబ్బతింటే అటువంటి సౌకర్యం లేదు. మందుల ద్వారానే జాగ్రత్తపడాలి. హెపటైటిస్‌-బి వైరస్‌ నియంత్రణకు మాత్రమే ప్రస్తుతం టీకా అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని