మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు.

Updated : 28 May 2024 06:25 IST

కలిదిండి, కైకలూరు, ముదినేపల్లి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం గురజలో 1950లో ఆమె జన్మించారు. కలిదిండి మండలం కొండూరుకు చెందిన నాగేంద్రనాథ్‌తో వివాహమైంది. రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడిగా భర్త ఓ వైపు ఉద్యమాలు చేస్తుంటే.. సీతాదేవి ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయ ప్రవేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముదినేపల్లి శాసనసభ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1983లో తెదేపా తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పిన్నమనేని కోటేశ్వరరావుపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తిరిగి 1985లో తెదేపా తరఫున మరోసారి బరిలోకి దిగి విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా 1988లో పనిచేశారు. అనంతరం 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మరో రెండుసార్లు తెదేపా తరఫున పోటీచేసి (1999, 2004) ఓటమి పాలయ్యారు. తెదేపాలో సుదీర్ఘకాలం పని చేసిన సీతాదేవి 2013లో భాజపాలో చేరారు. 2019లో తిరిగి తెదేపా గూటికి చేరారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విజయ మిల్క్‌ డెయిరీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సీతాదేవి పార్థివదేహాన్ని హైదరాబాద్‌ నుంచి కొండూరుకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త నాగేంద్రనాథ్‌ గతేడాది సెప్టెంబరు 28న అస్వస్థతతో మరణించారు. సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని