సంక్షిప్తవార్తలు(9)

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Updated : 28 May 2024 06:02 IST

‘ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించండి’

ఈనాడు డిజిటల్, అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఓ ప్రకటనలో కోరారు.  


వ్యవసాయ విస్తరణ సేవలకే వీఏఏల నియామకం 

ఈనాడు, అమరావతి: గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ సేవలు అందించడానికే వ్యవసాయంలో పట్టభద్రులైన వారిని సహాయకులు(వీఏఏ)గా నియమించామని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. వీఏఏలు ఎటువంటి ఒత్తిడి లేకుండా సంవత్సరం పొడవునా పనులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ‘రైతు సేవకు దూరంగా ఆర్‌బీకేలు’ శీర్షికన ఆదివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్ని ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్‌ నుంచి తెప్పించి ఇస్తున్నామని చెప్పారు.  


ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు మనవడి మృతి 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రకేసరిగా పేరొందిన స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ(65) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్రకాశం పంతులు రెండో కుమారుడైన హనుమంతరావు కుమారుడే గోపాలకృష్ణ. ఆయన వాణిజ్య పన్నుల శాఖ విభాగంలో రికార్డు సహాయకుడిగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తుదిశ్వాస విడిచారు.


మండల కేంద్రాలకు బ్యాగ్‌లు చేర్చేందుకు చర్యలు

-ప్రవీణ్‌ప్రకాశ్‌ 

ఈనాడు, అమరావతి: విద్యాకానుకలో భాగంగా ఇచ్చే బ్యాగ్‌లను సకాలంలో మండల కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ తెలిపారు. పరిశ్రమల నుంచి 250 ట్రక్కుల్లో బ్యాగ్‌లు రాష్ట్రానికి వస్తున్నాయని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున రవాణాకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు అండర్‌ టేకింగ్‌ ఇచ్చామన్నారు.


జూన్‌ పింఛన్లను ఇంటి వద్దే ఇవ్వాలి

సీఎస్‌ను డిమాండ్‌ చేసిన మాజీమంత్రి దేవినేని ఉమా

ఈనాడు డిజిటల్, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు జూన్‌ ఒకటి నుంచి ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ‘ఎన్నికలు ముగిశాయి..ఇకనైనా కుట్రలు, కుతంత్రాలు ఆపండి’ అని హితవు పలికారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో సీఎం జగన్‌కు లబ్ధి చేకూర్చాలనే కుట్రతో జవహర్‌రెడ్డి, సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి..పింఛన్‌దారులను ఇబ్బందిపెట్టారు. వారి సొమ్మును దారి మళ్లించారు. ఈ ఏడాది మార్చి చివరి వారంలో సుమారు రూ.13 వేల కోట్లను జగన్‌ తన తాబేదారులకు, ఏప్రిల్‌లో రూ.3 వేల కోట్లను వైకాపా అనుకూల కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. తద్వారా తెదేపాపై బురద జల్లాలని చూశారు. వీరి కుట్రలకు సుమారు 60 మంది పింఛన్‌దారులు చనిపోయారు. వచ్చే నెలైనా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు అందజేయాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీ వివరాల్ని బయటపెట్టాలి’ అని దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు.


పదో తరగతి రీవెరిఫికేషన్‌ జవాబుపత్రాల విడుదల 

ఈనాడు, అమరావతి: పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ జవాబుపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో భాగంగా 55,966 జవాబు పత్రాలకు దరఖాస్తు చేయగా.. అందులో 43,714 జవాబుపత్రాలను ఇటీవల అందించామని, తాజాగా మరో 10,542 పత్రాలను సోమవారం వెబ్‌సైట్‌లో ఉంచామని పేర్కొన్నారు. మిగతా 1,710 జవాబు పత్రాలను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.


నితిన్‌గడ్కరీకి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు 

ఈనాడు డిజిటల్, అమరావతి: భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని సోమవారం ఎక్స్‌ వేదికగా ఆకాంక్షించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా నితిన్‌గడ్కరీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


రహదారి ప్రమాద మృతుల కుటుంబాల్ని ఆదుకోవాలి

-చంద్రబాబు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో పది మంది మృతి చెందడంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద, కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో, కాకినాడ జిల్లా రామవరం వద్ద జరిగిన రహదారి ప్రమాదాలపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల్ని ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. 


యెర్నేని సీతాదేవి మృతిపై గవర్నర్, చంద్రబాబు విచారం 

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతిపై గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, విద్యా శాఖ మంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని