‘హౌసింగ్‌’లో అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు

నెల్లూరు జిల్లాలో ఆప్షన్‌-3 కింద (ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇచ్చే పద్ధతి) ఓ గుత్తేదారు సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ఫిర్యాదు అందినట్లు తెలిసింది.

Published : 28 May 2024 04:42 IST

నెల్లూరు జిల్లాలో నాసిరకం ఇళ్ల నిర్మాణాలపై ఆరోపణల వెల్లువ 
వైఎస్సార్, అన్నమయ్య,  పశ్చిమగోదావరి అధికారులపై కూడా 

ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లాలో ఆప్షన్‌-3 కింద (ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇచ్చే పద్ధతి) ఓ గుత్తేదారు సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ఫిర్యాదు అందినట్లు తెలిసింది. లబ్ధిదారుల పేరు మీద సిమెంటు, ఇనుమును తీసుకున్న ఆ సంస్థ వాటిని వినియోగించకుండా పక్కదారి పట్టించి పేదలకు అత్యంత నాసిరకంగా ఇళ్లను నిర్మిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 90 బస్తాల సిమెంటును ఇస్తే అందులో 40 బస్తాలు మాత్రమే వినియోగిస్తున్నట్లు మేస్త్రీలే చెబుతుండటం గమనార్హం. గతంలో గృహనిర్మాణానికి వాడాల్సిన సిమెంటు బస్తాలను నెల్లూరు, సంగం తదితర చోట్ల బయటి ఇళ్ల నిర్మాణాలకు వినియోగిస్తుండగా పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. ఇనుము వినియోగం కూడా తగు పరిమాణంలో లేదని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ గుత్తేదారు సంస్థతో జిల్లా అధికారులు కుమ్మక్కైనట్లు ఆరోపణలున్నాయి. ఆ అధికారుల తీరుపైనే ఏసీబీకి అందిన ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నట్లు తెలిసింది. 

చర్యలు తీసుకోకుండా ఆపారు 

నెల్లూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై ఇటీవల రెండు సార్లు శాఖాపరమైన విజిలెన్స్‌ విచారణ జరిగింది. నాసిరకం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు విచారణలో తేలింది. అందులో అక్కడి అధికారుల ప్రమేయం ఉందని తేల్చి ఆ మేరకు గృహనిర్మాణ సంస్థకు నివేదిక ఇచ్చారు. అయినా చర్యలు తీసుకోకుండా దాన్ని తొక్కిపెట్టారని సమాచారం. దీనికి గృహనిర్మాణ కార్పొరేషన్‌లోని ఓ అధికారి చక్రం తిప్పారని తెలిసింది. ఆయన ఇటీవల కార్పొరేషన్‌ నుంచి బదిలీపై వెళ్లారు. 

నగదు డిమాండ్‌పై.. 

వైఎస్సార్, అన్నమయ్య జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని హౌసింగ్‌ అధికారులు తమ కింది స్థాయి అధికారుల నుంచి నగదు డిమాండ్‌ చేస్తున్నట్లు కూడా ఏసీబీకి ఫిర్యాదు అందింది.  ప్రభుత్వం సరఫరా చేసిన ఇనుము, సిమెంటును పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. 


ఇళ్లు కడతారా.. డబ్బు వెనక్కి ఇస్తారా?

షియర్‌వాల్‌ సాంకేతికతతో ఇళ్లు నిర్మిస్తామని ముందుకు వచ్చిన మరో గుత్తేదారు సంస్థ...మధ్యలోనే నిర్మాణాలు నిలిపేసింది. లబ్ధిదారుల పేరు మీద ఒక్కో ఇంటికి మొదటివిడతగా అందే రూ.70 వేలు, బ్యాంకుల నుంచి రుణం రూ.35 వేలు తీసుకుని బేస్‌మెంట్‌ వరకు కట్టి వదిలేసింది. ఆ సంస్థకు ఇప్పటికే ప్రభుత్వం   రూ.2 కోట్లు అదనంగా చెల్లించింది. తదుపరి నిర్మాణాలు ప్రారంభించాలని లేదా రూ.2 కోట్లు వెనక్కి ఇవ్వాలని అధికారులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ సంస్థకు 20 వేల ఇళ్లను అప్పగించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని