రాజకీయ ప్రయోజనాలకే గులకరాయి డ్రామా

‘కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గులకరాయి డ్రామా ఆడారు. సానుభూతి పొందడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందేందుకే ఈ  ఎత్తుగడ వేశారు. సీఎం జగన్‌కు అయిన గాయం హత్యాయత్నానికి దారి తీసేది కాదు.

Published : 28 May 2024 04:43 IST

ఆ గాయం హత్యకు దారి తీసేంత తీవ్రమైనది కాదు
బెయిల్‌ పిటిషన్‌పై నిందితుడి తరఫు న్యాయవాదుల వాదనలు
తీర్పు నేటికి వాయిదా 

ఈనాడు, అమరావతి: ‘కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే గులకరాయి డ్రామా ఆడారు. సానుభూతి పొందడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందేందుకే ఈ  ఎత్తుగడ వేశారు. సీఎం జగన్‌కు అయిన గాయం హత్యాయత్నానికి దారి తీసేది కాదు. పూలదండలోని తీగ కారణంగా అయింది. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రాయి విసిరితే గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది కింద పడుతుంది. అంతేకానీ ఆయన పక్కనున్న మాజీ మంత్రి వెలంపల్లికి కూడా తగలదు. ఇది కట్టుకథ..’ అని నిందితుడు సతీష్‌కుమార్‌ తరఫు న్యాయవాదులు సలీం, రాజశేఖర్‌లు వాదించారు. సతీష్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు సోమవారం విజయవాడలోని 8వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో జరిగాయి. బాధితుడైన జగన్‌మోహన్‌రెడ్డి నుంచి 161 సీఆర్పీసీ స్టేట్‌మెంటును ఇంకా పోలీసులు రికార్డు చేయలేదని సతీష్‌కుమార్‌ తరఫు న్యాయవాదులు గుర్తు చేశారు. పోలీసులు కావాలనే కేసును సాగదీస్తున్నారని వివరించారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా లబ్ధి కోసం కోడికత్తి డ్రామా నడిపారని తెలిపారు. నిందితుడికి బెయిల్‌ ఇస్తే స్వేచ్ఛగా తన వాంగ్మూలాన్ని కోర్టులో చెప్పే అవకాశముందని వాదించారు. ఈ సంఘటన వెనుక కుట్రకోణం లేదని, ఎక్కడా డబ్బులు చేతులు మారలేదని అన్నారు. కేవలం తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించేందుకు దీనిని నడిపిస్తున్నారని అన్నారు. బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ కల్యాణి వాదించారు. ముఖ్యమంత్రి ప్రాణం తీసేందుకే నిందితుడు సతీష్‌ రాయి విసిరారని అన్నారు. సీఎం విదేశీ పర్యటనకు వెళ్లినందున ఇంకా స్టేట్‌మెంట్‌ తీసుకోలేదని, ఆయన తిరిగి వచ్చాక నమోదు చేస్తామని అన్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదని, ఈ దశలో బెయిల్‌ ఇస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని, పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు నిమిత్తం న్యాయాధికారి లక్ష్మి కేసును మంగళవారానికి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని