బండెనక బండి ఎక్కి.. ఓటుబాట పట్టి!

ఒకరా.. ఇద్దరా.. లక్షల మంది ఓటర్లు! తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్లలో మిడతల దండులా తరలివచ్చారు. ఇతర దేశాల్లోని వారు సైతం రానూపోనూ టికెట్లకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టి మరీ విమానాలెక్కి తమ ఊర్లలో వాలిపోయారు.

Published : 05 Jun 2024 07:09 IST

ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి లక్షల్లో తరలివచ్చిన ఓటర్లు
ఎన్డీయే కూటమి విజయంలో వీరందరి పాత్ర కీలకమే 

ఈనాడు-అమరావతి: ఒకరా.. ఇద్దరా.. లక్షల మంది ఓటర్లు! తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్లలో మిడతల దండులా తరలివచ్చారు. ఇతర దేశాల్లోని వారు సైతం రానూపోనూ టికెట్లకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టి మరీ విమానాలెక్కి తమ ఊర్లలో వాలిపోయారు. పోలింగ్‌ రోజు గంటల తరబడి లైన్లలో నిల్చొని ఓట్లేశారు. ఎన్డీయే కూటమి విజయంలో వీరందరి పాత్ర కీలకమే. అలాగని వీరంతా తెలుగుదేశం, మిత్రపక్షాలకు వీరవిధేయ నాయకులో, కార్యకర్తలో కాదు. కూటమి అధికారంలోకి వస్తే పదవులు అనుభవిద్దామనే ఆశలూ లేవు. వీరందరికీ ఉన్నదల్లా నవ్యాంధ్రపై అభిమానం. గత అయిదేళ్ల పాలనలో గాడి తప్పిన తమ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం బాట పట్టారు. ఇతర రాష్ట్రాల్లో ఉండే వారిలో అధిక శాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరడంతో పోలింగ్‌కు ముందు రోజు బస్సులు, రైళ్లు కిక్కిరిశాయి. అయినా వెనకాడకుండా.. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ సొంత వాహనాలు ఏర్పాటు చేసుకుని మరీ వచ్చి ఓట్లేశారు. అంతకుముందు వారంతా స్వస్థలాల్లో ఉన్న తమ ఓట్లపై దృష్టి సారించారు.

ఉద్యోగాల నిమిత్తం వలస వెళ్లిన యువత.. పనుల్లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు, రైతులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు పరిశీలించుకున్నారు. ఒకవేళ తొలగిస్తే మళ్లీ నమోదు చేయాలంటూ పత్రాలు సమర్పించారు. ఓట్లు తొలగింపునకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరిగా పోలింగ్‌ సమయానికి లక్షల సంఖ్యలో తరలివచ్చి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపారు. ప్రధానంగా అమెరికా, లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల్లో చాలామంది పోలింగ్‌కు కొన్ని రోజుల ముందే రాష్ట్రానికి చేరుకున్నారు. అందుకోసం విమాన టికెట్లకే వారు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. ఇక్కడ తమకు తెలిసిన వారితో మాట్లాడారు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే పిల్లల భవిష్యత్తు ఎంతలా దెబ్బతింటుందో వివరించారు. ఇదే కోవలో వివిధ రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతతోపాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే చిరుద్యోగులు సొంత ఖర్చులతో తరలివచ్చి మరీ ఓట్లేసి జన్మభూమిపై మమకారాన్ని చాటుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని