సంక్షిప్త వార్తలు(9)

భూముల కేటాయింపులు, గుత్తేదారులకు చెల్లింపులు, అధికారుల బదిలీల దస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్‌ చేయొద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated : 06 Jun 2024 06:29 IST

భూ కేటాయింపులు, గుత్తేదారుల చెల్లింపుల ఫైళ్లను ప్రాసెస్‌ చేయొద్దు
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ్‌ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: భూముల కేటాయింపులు, గుత్తేదారులకు చెల్లింపులు, అధికారుల బదిలీల దస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్‌ చేయొద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మంత్రుల పేషీల్లోని ఎలక్ట్రానిక్, ఫిజికల్‌ దస్త్రాలను భద్రపరచాలని స్పష్టంచేశారు. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ శాఖలకూ వర్తిస్తాయని తెలిపారు. రాజ్‌భవన్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రజత్‌భార్గవ్‌ ఈ ఆదేశాలు జారీచేశారు. ఇదే విషయమై రాష్ట్ర యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ తరఫున కూడా రజత్‌భార్గవ్‌ మరో ఉత్తర్వు ఇచ్చారు. ఎంపికచేసిన గుత్తేదారులకు మాత్రమే ప్రభుత్వపరంగా చెల్లింపులు జరుగుతున్నాయని రాజ్‌భవన్‌కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.


డీవైఈవో పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి

ఈనాడు డిజిటల్, అమరావతి: డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(డీవైఈవో) మెయిన్స్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తరగతులు, విధుల కారణంగా పరీక్షకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని బుధవారం లేఖ రాశారు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల గ్రామీణ అభ్యర్థులకు సమయం సరిపోలేదని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు వేర్వేరు ప్రకటనల్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిని కోరారు.


ఈఏపీసెట్‌ ఫలితాలు ఎప్పుడు?
ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ రాజీనామాతో ప్రతిష్టంభన

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాల విడుదలలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పదవికి హేమచంద్రారెడ్డి.. కొన్ని కీలకమైన దస్త్రాలను మాయం చేసిన అనంతరం రాజీనామా చేశారు. ప్రభుత్వం లేనందున రాజీనామాను ఆమోదించడం కుదరదని, కావాలంటే సెలవులో వెళ్లాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు సూచించడంతో హేమచంద్రారెడ్డి మెడికల్‌ లీవ్‌లో వెళ్లారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ బాధ్యతలను వైస్‌ ఛైర్మన్‌ రామమోహన్‌రావుకు అప్పగించారు. ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల చేసి, కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రవేశపరీక్ష పూర్తయి, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్‌ పెరుగుతున్నా ఎలాంటి నిర్ణయం ప్రకటించడం లేదు. ఛైర్మన్‌ లేనందున ఫలితాల విడుదలపై ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.  


దళితులకు నమ్మకద్రోహమే వైకాపా పరాజయానికి కారణం
దళిత బహుజన ఫ్రంట్‌ ప్రధాన కార్యదర్శి భాగ్యరావు

 ఈనాడు, అమరావతి: దళితులకు ప్రత్యేకంగా ఏళ్లుగా అమలవుతున్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి తీరని ద్రోహం చేయడమే వైకాపా ఘోర పరాజయానికి కారణమని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు పేర్కొన్నారు. స్వయంఉపాధి రాయితీ రుణాలకుగాను రూపాయి కేటాయించకుండా ఎస్సీ కార్పొరేషన్‌ విభజన పేరుతో జగన్‌ నాటకాలాడారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దళితులు, గిరిజనులపై వైకాపా నేతలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నా అడ్డుకట్ట వేసేందుకు ఏనాడూ ప్రయత్నించలేదని ఆరోపించారు.


దస్త్రాలు, రికార్డులు జాగ్రత్త!

భూముల కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు, బదిలీలు చేయొద్దు
ప్రభుత్వ శాఖలకు గవర్నర్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని దస్త్రాలు, రికార్డులను సురక్షితంగా భద్రపరిచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలు, విభాగాధిపతులకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి అందిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్‌) ఎస్‌.సురేష్‌కుమార్‌ ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులకు సర్క్యులర్‌ పంపించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు భూముల కేటాయింపులు, గుత్తేదారులకు నిధుల విడుదల,  అధికారుల బదిలీలకు సంబంధించిన ఎలాంటి దస్త్రాల్నీ ప్రాసెస్‌ చేయవద్దని స్పష్టం చేశారు. మంత్రుల పేషీల్లోని దస్త్రాలు, ఈ-ఫైల్స్‌ రూపంలో ఉన్న అన్ని అధికారిక రికార్డులను సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. 


బిందుమాధవ్, అమిత్‌బర్దార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ఈనాడు డిజిటల్, అమరావతి: ఐపీఎస్‌ అధికారులు బిందుమాధవ్, అమిత్‌బర్దార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులిచ్చింది. పోలింగ్‌ రోజు, తర్వాత పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో అప్పట్లో ఆయా జిల్లాలకు ఎస్పీలుగా ఉన్న వీరు విఫలమయ్యారనే కారణంతో మే 16న సస్పెండ్‌ చేస్తూ ఈసీ ఆదేశాలనిచ్చింది. తాజాగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొంది. 


అదనపు ఏజీ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీనామా

ఈనాడు, అమరావతి: అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) వై.నాగిరెడ్డి, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వారి పదవులకు రాజీనామా చేశారు. అదనపు ఏజీ వారి రాజీనామా లేఖను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. పీపీ, అదనపు పీపీ రాజీనామా లేఖలను న్యాయశాఖ కార్యదర్శికి పంపించారు. మరోవైపు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు కొందరు ఛాంబర్లను ఖాళీ చేశారు. వైకాపా ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో ఏజీ మంగళవారమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


ఎస్వీబీసీ ఛైర్మన్‌ సాయికృష్ణ రాజీనామా 

వెంకటగిరి, న్యూస్‌టుడే: ఎన్నికల్లో వైకాపా ఓటమి చెందడంతో.. తితిదే నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్‌(ఎస్వీబీసీ) పదవికి డాక్టర్‌ వీబీ సాయికృష్ణ యాచేంద్ర బుధవారం రాజీనామా చేశారు. 43 నెలల పాటు తనకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వేంకటేశ్వర స్వామి కృపతో తన పదవికి న్యాయం చేశానని పేర్కొన్నారు.


హామీలను విస్మరించినందుకే ఘోర పరాజయం
నిరుద్యోగ ఐకాస

ఈనాడు డిజిటల్, అమరావతి: ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించినందుకే జగన్‌కి ఎన్నికల్లో నిరుద్యోగులు గుణపాఠం చెప్పారని నిరుద్యోగ ఐకాస విమర్శించింది. త్వరలో కొలువుదీరే ఎన్డీయే ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తుందని బుధవారం ఓ ప్రకటనలో ఆకాంక్షించింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని