అంతా ‘సర్దు’కుంటున్నారు

రాష్ట్ర ప్రజానీకం జగన్‌ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడంతో ఆ పార్టీ నాయకులు, వారికి అండగా నిలిచిన అధికారులు భయం భయంగా ‘సర్దు’కుంటున్నారు.

Updated : 06 Jun 2024 06:54 IST

కొన్ని పత్రాలు బయటకు.. డేటా చౌర్యం
అప్రమత్తమైన అధికారులు, పోలీసులతో తనిఖీలు 
సజ్జల సహా పలువురు సలహాదారుల రాజీనామా
తమను రిలీవ్‌ చేయాలంటున్న జగన్‌ భక్త అధికారులు
ఎవరి బదిలీలు వద్దు... ఎవరినీ పంపవద్దు
ఉన్నతస్థాయిలో నిర్ణయం

ఈనాడు-అమరావతి: రాష్ట్ర ప్రజానీకం జగన్‌ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడంతో ఆ పార్టీ నాయకులు, వారికి అండగా నిలిచిన అధికారులు భయం భయంగా ‘సర్దు’కుంటున్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, తప్పిదాలు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని కంగారుపడుతూ.. ఆధారాలు లేకుండా చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరో వైపు డిప్యుటేషన్లపై వచ్చిన అధికారులు జారుకునే పనిలో ఉన్నారు. జగన్‌ హయాంలో ఆయన అరాచకాలకు మద్దతు పలికిన వారు ఆ పోస్టుల నుంచి నెమ్మదిగా తప్పుకొని తమ మాతృశాఖలకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలను నిరోధించాలంటూ గవర్నర్‌ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ పత్రాలు, విలువైన వస్తువులు, ఇ-డేటా అంతా భద్రంగా ఉంచాలని ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. మరో వైపు బదిలీలు, ఇతరత్రా నిర్ణయాలు కూడా వద్దని.. ఎవరి డిప్యుటేషన్లనూ రద్దు చేయవద్దని, ఎవరినీ రిలీవ్‌ చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. దీంతో సర్దుకోవడానికి ప్రయత్నించిన అధికారులు కొందరు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు జగన్‌ వీరవిధేయులుగా ఉండి వివిధ పోస్టులు సంపాదించుకున్న వారు రాజీనామాలు చేస్తున్నారు.

పత్రాలు మాయం, డేటా చౌర్యం...

 సచివాలయంలో కొన్ని పత్రాలను మాయం చేసే పని జరుగుతోంది. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న దువ్వూరి కృష్ణ కార్యాలయంలో కొన్ని కాగితాలు బయటకు తీసుకువెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎలక్ట్రానిక్‌ ఆఫీసుతో సంబంధం లేకుండా కొన్ని ఫైళ్లను నడిపించిన నేపథ్యంలో వాటిని మాయం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సచివాలయంలో డేటా చౌర్యానికి ప్రయత్నించినట్లు సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి గత ఐదేళ్ల డేటాను కొందరు ఐటీ సలహాదారుల సాయంతో తస్కరించినట్లు గుర్తించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో తనిఖీలు చేశారు. ఐటీ విభాగంలోని ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను పోలీసు సిబ్బంది పరిశీలించారు. ఉన్నతాధికారులను ఐటీ శాఖ అప్రమత్తం చేయడంతో సచివాలయశాఖ ఉపయోగించే లాగిన్‌లను..సర్వర్‌ను అధికారులు నిలిపివేశారు.

సజ్జల సహా పలువురు రాజీనామా

ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది సలహాదారులు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖరరెడ్డి కూడా ఇదేబాటలో రాజీనామా సమర్పించారు.


ఉద్యోగుల జీతాల విషయంలోను...

కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో నిధులు అందుబాటులో ఉన్నా ఆర్థికశాఖ అధికారి ఒకరు జీతాలు చెల్లించకుండా నిలిపివేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు అనేక మందికి బుధవారం ఉదయానికి కూడా అందలేదు. గత నెలలో ఒకటో తారీకునే జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు శ్రద్ధ చూపిన అధికారులు ఈ నెల నిర్లక్ష్యం చేశారు. ఒకటి రెండు తేదీల్లో కేవలం కొద్ది మందికి మాత్రమే జీతాలు జమ చేశారు. దీంతో సచివాలయంలో కొందరు ఉద్యోగులు ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ వద్దకు వెళ్లి జీతాల విషయం ప్రస్తావించారు. తన వద్ద లాగిన్‌ లేదని వారికి ఆయన బదులివ్వడంతో వారు అవాక్కయ్యారు. ఈ విషయం తెలిసి కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌తో మాట్లాడారు. రిజర్వుబ్యాంకు నుంచి మంగళవారం రుణంగా తీసుకువచ్చిన రూ.4,000 కోట్ల అందుబాటులో ఉన్నా జీతాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. దీంతో వెంటనే నిధుల లభ్యత మేరకు జీతాలు, పెన్షన్లను చెల్లించారు.

సచివాలయంలోని మంత్రులు, సలహాదారుల ఛాంబర్లకు ఉన్న నేమ్‌ ప్లేట్లన్లు సాధారణ పరిపాలనశాఖ తొలగిస్తోంది. మరో వైపు ఆ పేషీలను, కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకుంటోంది.


అధికారుల్లోనూ జంకు

జగన్‌ వీరభక్త అధికారగణం ఆయా స్థానాల నుంచి మాతృస్థానాలకు, సొంత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇలాంటి ప్రయత్నాలకు అనుగుణంగా ఎవరూ ఉత్తర్వులు ఇవ్వవద్దని తాజాగా ఆదేశాలు వచ్చాయి. తమను రిలీవ్‌ చేయాలంటూ అనేకమంది అధికారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మాతృసంస్థకు వెళతానంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. తనను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రిలీవ్‌ చేయాలని గనులశాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి అభ్యర్థించారు. మరో వైపు సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌  విజయకుమార్‌రెడ్డి, ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్‌ చిలకల రాజేశ్వర్‌రెడ్డి తమను రిలీవ్‌ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో డిప్యుటేషన్‌పై వచ్చిన వారిని ఎవరినీ రిలీవ్‌ చేయవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వకూడదని నిర్ణయించింది. సీఐడీ చీఫ్‌ సంజయ్‌ విదేశాలకు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఇచ్చారు. తాజాగా సెలవు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయన తన విదేశీ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రెవెన్యూశాఖలో ఎలాంటి ఫైళ్లనూ ప్రాసెస్‌ చేయవద్దని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు ఇచ్చారు. రెవెన్యూశాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపులకు సంబంధించిన దస్త్రాలను నిలిపివేయాలని ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, దస్త్రాలను కూడా జాగ్రత్త పరచాలని సిబ్బందిని కోరారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని