ఇక.. విముక్త విశాఖ!

‘నా విశాఖ..నా విశాఖ’ అంటూ ఎక్కడలేని ప్రేమ గుప్పించారు. అధికారంలోకి రాగానే రుషికొండపై విధ్వంసంతో నగరంలో పాదంమోపారు. ‘పరిపాలనా రాజధాని’ అంటూ విలువైన భూములు, ప్రాజెక్టులు గుప్పిట్లోకి తీసుకున్నారు.

Updated : 06 Jun 2024 06:58 IST

అరాచక వైకాపాకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన ప్రజలు
కబంధహస్తాల నుంచి నగరం బయటపడ్డట్టే!
ఫలితాలొస్తుండగానే రుషికొండ భవనాలపైకి వెళ్లిన తెదేపా అభిమానులు
వాస్తుకోసం మూసివేసిన  టైకూన్‌ కూడలి డివైడర్ల తొలగింపు
ఇక మిగిలింది ఆంధ్ర వర్సిటీ ప్రక్షాళన.. కబ్జాల కట్టడి

విశాఖ టైకూన్‌ కూడలి వద్ద డివైడర్లను తొలగిస్తున్న కూటమి నేతలు

ఈనాడు, విశాఖపట్నం: ‘నా విశాఖ..నా విశాఖ’ అంటూ ఎక్కడలేని ప్రేమ గుప్పించారు. అధికారంలోకి రాగానే రుషికొండపై విధ్వంసంతో నగరంలో పాదంమోపారు. ‘పరిపాలనా రాజధాని’ అంటూ విలువైన భూములు, ప్రాజెక్టులు గుప్పిట్లోకి తీసుకున్నారు. ఏకంగా విశాఖలోని ప్రభుత్వ భూములు, కార్యాలయాలు తనఖా పెట్టి రూ.వేల కోట్ల అప్పులు తెచ్చారు... ఇలా విధ్వంసకర పాలనా విధానాలతో విశాఖ విలవిల్లాడిపోయింది. ప్రశాంత నగరం హత్యలు, కిడ్నాప్‌లు, గంజాయి మత్తుతో వణికిపోయింది. దీనిపై చైతన్యవంతులైన విశాఖవాసులు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి తీర్పు ఇచ్చారు. వైకాపా అభ్యర్థులను ఓటుతో ఓడించి ఇంటికి పంపారు. వైకాపా ఐదేళ్లుగా చేసిన ప్రజావ్యతిరేక పనులు, తీసుకున్న చర్యల నుంచి విముక్తి పొందేందుకు జనం ఎంత కసిగా ఓటేశారో ఫలితాల సరళి చూస్తేనే అర్థమవుతుంది.

రుషికొండకు గుండుకొట్టి...:

సముద్రానికి అభిముఖంగా పచ్చని కొండ. దానిపై పర్యాటకశాఖ భవనాల్లో పర్యాటకులకు వసతి, భోజన సదుపాయాలుండేవి. వైకాపా అధికారంలోకి వచ్చాక బాగున్న భవనాలను కూల్చేశారు. రుషికొండకు గుండుకొట్టి లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించారు. రూ.450 కోట్ల ప్రజాధనం వెచ్చించి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. పర్యాటకులకు ఆంక్షలు పెట్టారు. రుషికొండకు రెండో వైపు ఉన్న రహదారిని పూర్తిగా మూసేశారు. హెలిప్యాడ్‌ కోసం పర్యాటక భవనాలు కూలగొట్టారు. రుషికొండపై జరిగిన విధ్వంసం తీరు ప్రజల మనసులో నాటుకుపోయింది. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడం మొదలవ్వగానే..అక్కడి సెక్యూరిటీని తప్పించుకుని ఇద్దరు రుషికొండ భవనాలపైకి వెళ్లి తెదేపా జెండా ఎగుర వేయడం కలకలం రేపింది. ఇకపై ఈ భవనాలు ఎలా ఉపయోగిస్తారో చూడాల్సి ఉంది. రుషికొండ వద్ద ఆంక్షలు తొలగించి, రెండో రోడ్డును తెరవాలంటూ నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

వాస్తుకోసం మూసిన ఆ రహదారి... ఇప్పుడు తెరిచారు.. 

నగరంలో సిరిపురం వద్ద టైకూన్‌ కూడలిని గత ఏడాది మూసివేశారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా దాన్ని మూసివేశామంటూ జీవీఎంసీ, పోలీసు అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆ కూడలి ఎదురుగా వివాదాస్పద సీబీసీఎన్సీ స్థలంలో వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణ భారీ ప్రాజెక్టు చేపడుతున్నారు. దానికి వాస్తు దోషమన్న కారణంతో టైకూన్‌ కూడలి మూసి వేశారనే చర్చ సాగింది. దీంతో దత్‌ ఐలాండ్‌ నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లాలంటే ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి. దీనిపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ క్షేత్రస్థాయి పరిశీలన చేసి, డివైడర్లు తొలగించాలంటూ డిమాండ్‌చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అక్రమాలపై తొలి ఉక్కుపాదం మోపారు. బుధవారం టైకూన్‌ కూడలిలో డివైడర్లను, స్టాపర్లను జేసీబీలతో నేతలు తొలగించారు.

విశాఖ నగరం

‘జి-20’ సమయంలో  వ్యూ పాయింట్‌ పేరుమార్చి...

విశాఖ బీచ్‌ రోడ్డులో తెన్నేటిపార్కు దాటిన తర్వాత సీతకొండ వద్ద వ్యూపాయింట్‌ ఉంది. దీనిని గతంలో అబ్దుల్‌ కలాం వ్యూపాయింట్‌గా పిలిచేవారు. గతేడాది జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనులు చేపట్టారు. సదస్సు రెండు రోజుల్లో ప్రారంభమవుతుందనగా రాత్రికి రాత్రే వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌గా బోర్డు ఏర్పాటుచేశారు. అమర్‌నాథ్, ఇతర మంత్రులు సైతం లవ్‌ వైజాగ్‌ సింబల్‌ పక్కనే ఉన్న వైఎస్సార్‌ వ్యూపాయింట్‌ పేరు వద్ద సెల్ఫీలు దిగి హల్‌చల్‌ చేశారు. కూటమి విజయకేతనం ఎగుర వేయడంతో ‘అబ్దుల్‌ కలాం వ్యూపాయింట్‌’గా గుర్తుతెలియని వ్యక్తులు మార్చేశారు.

ఇక మిగిలింది ఇవే: సేవ పేరుతో తీసుకుని వైకాపా పెద్దలు వ్యాపారం చేసిన హయగ్రీవ, సెయింట్‌లూక్స్‌ వంటి విలువైన స్థలాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. వివాదాల్లో ఉన్న స్థలాల్లో పాగా వేసిన వైకాపా నేతలు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. న్యాయ వివాదాల్లో ఉండగానే సీబీసీఎన్సీకి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు విస్తరణలో కోల్పోయిన భూమికి వైకాపా నేత ఎంవీవీ సత్యనారాయణకు రూ.63 కోట్ల టీడీఆర్‌ బాండ్లను అధికారులు ఇచ్చేశారు. ఎంతో విలువైన దసపల్లా భూములు కూడా చేతులు మారాయి. కబ్జాకు గురైన విలువైన భూములు, 596 జీవో తెచ్చి పేదలను బెదిరించి లాక్కొన్న అసైన్డు భూముల వ్యవహారం కొత్త ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఎన్నికల ఫలితాలతో ‘విముక్త ఆంధ్రప్రదేశ్‌’ చేశారు.. ‘విముక్త ఆంధ్ర వర్సిటీ’ ఎప్పుడు చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. వీసీ ప్రసాద్‌రెడ్డి వర్సిటీని వైకాపా కార్యాలయంగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. శిష్యుడైన జేమ్స్‌ స్టీఫెన్‌ను రిజిస్ట్రార్‌గా నియమించడంలో చక్రం తిప్పారని,  ఎన్నికల వేళ కళాశాల యాజమాన్యాలతో వైకాపాకు అనుకూలంగా విద్యార్థులతో ఓట్లు వేయించేలా మీటింగ్‌లు పెట్టారని, బొత్స ఝాన్సీకి ఓటెయ్యాలంటూ విద్యార్థులతో సర్వే పేరు చెప్పి ఫోన్లు చేయించిన ఉదంతాలు ఉన్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. వర్సిటీని ప్రక్షాళన చేస్తేనే విద్యావ్యవస్థకు గౌరవం దక్కుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని