హమ్మయ్య.. స్వేచ్ఛ దొరికింది!

వ్యక్తిగత స్వేచ్ఛ అంటే.. శ్వాస తీసుకోవడం లాంటిదే... అయితే, రాష్ట్రంలో మంగళవారం ఉదయం వరకు మనసారా మాట్లాడుకోవడానికి కూడా భయపడే కనిపించని నిర్బంధ పరిస్థితులు ఉండేవి.

Published : 06 Jun 2024 05:13 IST

ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
నిన్నటి వరకు వీవోఐపీ కాల్స్‌లో మాట్లాడాలన్నా భయమే
సర్కారు మారడంతో సాధారణ కాల్స్‌ చేస్తున్న అధికారులు, నేతలు
గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌పై తీవ్ర ఆరోపణలు
సమగ్ర విచారణ చేయించాలని  వివిధ వర్గాల డిమాండు 

ఈనాడు, అమరావతి: వ్యక్తిగత స్వేచ్ఛ అంటే.. శ్వాస తీసుకోవడం లాంటిదే... అయితే, రాష్ట్రంలో మంగళవారం ఉదయం వరకు మనసారా మాట్లాడుకోవడానికి కూడా భయపడే కనిపించని నిర్బంధ పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వం మారిన గంటల వ్యవధిలోనే... ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండు రోజుల కిందటి వరకు ఫోన్‌ చేసినా పలకరించని, ఎస్‌ఎంఎస్‌లను కూడా చూడని అధికారులు ఇప్పుడు తమంతట తామే స్వేచ్ఛగా కాల్‌ చేసి మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఐదేళ్ల వైకాపా పాలన సమయంలో... ఎవర్ని కదిలించినా తమ ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారనే కలవరమే! ఏదైనా సమావేశంలో నలుగురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కలిసినా పొడిపొడి మాటలే. ఎవరు వింటున్నారో, వెంటాడుతున్నారో అనే అనుమానమే! అంతెందుకు... కుటుంబ సభ్యులతోనూ స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి. కార్యాలయానికి వచ్చిన వారితో మాట్లాడాలన్నా భయమే వెంటాడింది. బతుకుపై ఆశ కోల్పోయిన ప్రజలకు.. ఇప్పుడు స్వేచ్ఛ లభించిందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా అధికారాన్ని కోల్పోవడంతోనే... ఒక్కసారిగా స్వేచ్ఛ లభించిన ఆనందం నిజంగానే అన్ని వర్గాల్లోనూ కన్పిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరుతున్న తరుణంలో... ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ చేయించాలనే డిమాండ్లు వివిధ వర్గాల నుంచి వస్తున్నాయి. 

ఇక్కడా న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌ ఆరోపణలు? 

వైకాపా సర్కారు హయాంలో.. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతల ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాప్‌ చేశారనే ఆందోళనలు వెల్లువెత్తాయి. ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో.. ఐపీఎస్‌ అధికారి సారథ్యంలో ట్యాపింగ్‌ చేశారని, దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ 2020లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇప్పటికే తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కొందరు పోలీసు అధికారులు అరెస్టై జైలుకు వెళ్లారు. న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాప్‌ చేశారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను అక్కడి హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. 

ఆధారాలు నాశనం చేశారా? 

ప్రభుత్వం మారినందున వైకాపా అనుకూల అధికారుల్లో కలవరం మొదలైంది. ఇందులో భాగంగానే ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మాదిరేే... ఏపీలోనూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ వైకాపా నుంచి ఇటీవలే తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాజాగా ఆరోపించారు. ఇంటెలిజెన్స్‌ విభాగాధిపతి ఆధ్వర్యంలో తమ ఫోన్లు ట్యాప్‌ చేశారని గతంలో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా ఆరోపించారు. 

ఐదేళ్లూ భయం నీడన బతుకే...  

వైకాపా అధికారంలోకి వచ్చాక... నెలా, రెండు నెలలపాటు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడినా... తర్వాత మీరు ఫలానా వారితో ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నలు పెద్దల నుంచి వచ్చాయి. దీంతో తమ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనే అనుమానాలు అధికారులందర్నీ వెంటాడాయి. అప్పటి నుంచి ఉన్నతాధికారులు తరచూ ఫోన్లు మార్చారు. ఆర్థికంగా తట్టుకోగలిగిన వారైతే... 15 రోజులు, నెల, రెండు నెలలకో ఫోన్‌ మార్చారు. ట్యాపింగ్‌ మాత్రమే కాదు... ఫోన్‌లో మాల్‌వేర్‌ చొప్పించి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసి, మైక్రోఫోన్‌ ద్వారా సంభాషణలు వింటున్నారనే అనుమానాలూ అధికారుల్లో ఉండేవి. అందుకే ఎవరైనా తమను కలిసేందుకు వచ్చినా.. ఫోన్‌లను దూరంగా ఉన్న గదిలో పెట్టి రావాలని చెప్పేవారు. తన ఫోన్‌లో నుంచి ఏమైనా రికార్డు చేయొచ్చనే భయంతో దాన్నీ సోఫా సందుల్లో కుక్కేసేవారు. తరచూ ఫోన్లను ఫార్మాట్‌ చేసే విధానమూ నేర్చుకున్నారు. 

ప్రజా సంఘాల నేతలనూ వెన్నాడారు!

వైకాపా హయాంలో ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల నేతలనూ పోలీసులు వెంటాడారు. ఆంగన్‌వాడీ, ఆశ, సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైనా ఇద్దరు తాము చేయాలనుకున్న ధర్నాల గురించి ఫోన్లలో మాట్లాడుకుంటే... పోలీసులు అక్కడ వాలిపోయేవారు. ఫోన్‌ ట్యాపింగ్‌ లేకుంటే ఇంత పక్కా సమాచారం ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నించారు. వీటన్నింటికి సమాధానం చెప్పకుండా.. వారిని అణగదొక్కారు. 

మరి... సురక్షిత మార్గమేంటి? 

ఫోన్లు ట్యాప్‌ కాకుండా చూసుకోవడానికి ఉన్నతాధికారులు... మొదట సాధారణ కాల్స్‌ నుంచి వాట్సప్‌కు మారారు. అదీ సురక్షితం కాదని తెలిసి.. సిగ్నల్‌ యాప్‌లోకి వెళ్లారు. టెలిగ్రామ్‌ ద్వారా కొన్నాళ్లు కాల్‌ చేసి మాట్లాడారు. ఐఫోన్‌ కొనుక్కుని ఫేస్‌టైమ్‌ వినియోగించారు. ఇలా వీవోఐపీ (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) మార్గంలో ఎన్ని చేసినా.. ట్యాపింగ్‌ను తప్పించుకోవడం కష్టమేనని తెలుసుకుని ఫోన్‌కు దూరంగా ఉండటమే అలవాటు చేసుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాలు మాట్లాడే సమయంలోనూ ఫోన్‌ను పక్కగదిలో దూరంగా పెట్టేసి వచ్చేంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కొందరైతే ఏడాదికి రూ.10 వేలు ఖర్చు చేసి ఐటీ సంస్థలు సమాచార భద్రతకు ఉపయోగించే వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) విధానంలోకి మారారు. 

సమగ్ర విచారణ చేయిస్తేనే... 

ఫోన్‌ ట్యాపింగ్‌పై అధికారికంగా ఎక్కడా ఆధారాలు దొరక్కుండా కొన్ని ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించి వారి ద్వారా వ్యవహారం చక్కబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ నుంచి ట్యాప్‌ చేసినా.. ఎవరు చేయించినా ప్రస్తుత టెక్నాలజీ కాలంలో వెలికితీయడం అసాధ్యమేమీ కాదు. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి, సమగ్ర విచారణకు ఆదేశించాలని రాజకీయ నాయకులు, అధికారులు డిమాండు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని