5 విడతలు..44 రోజులు

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ మొత్తం 44 రోజుల పాటు సాగనుంది.

Published : 06 Jun 2024 05:27 IST

ఈ నెల 10 నుంచి జోసా కౌన్సెలింగ్‌
జులై 23 నాటికి పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ మొత్తం 44 రోజుల పాటు సాగనుంది. ఈ నెల 9వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ మరుసటి రోజు (ఈ నెల 10) నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. మొత్తం 5 విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. జులై 23వ తేదీకి ఐదో విడత ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు బుధవారం పూర్తి కాలపట్టికను విడుదల చేసింది. ఈసారి మొత్తం 121 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అన్నింటికీ కలిపి సంయుక్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జోసా చివర విడత సీట్లు కేటాయించిన జులై 17వ తేదీ నుంచే ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ జులై 26వ తేదీకి ముగుస్తుంది.

17 వరకు నమూనా కౌన్సెలింగ్‌.. 

ఈ నెల 10వ తేదీ నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ రోజు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే 17వ తేదీ వరకు అర్హత సాధించిన విద్యార్థులకు రెండు సార్లు నమూనా కౌన్సెలింగ్‌ జరుగుతుంది. అంటే విద్యార్థులు తమ ర్యాంకుకు ఎక్కడ సీటు లభిస్తుందో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అసలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకొని అవసరమైతే ఐచ్ఛికాలను మార్చుకోవచ్చు.


ఇదీ కాలపట్టిక..

జూన్‌ 18: తొలి విడత కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్, ఐచ్ఛికాలు

జూన్‌ 20: సీట్ల కేటాయింపు

జూన్‌ 27: రెండో విడత సీట్ల కేటాయింపు

జులై 4: మూడో విడత సీట్ల కేటాయింపు

జులై 10: నాలుగో విడత సీట్ల కేటాయింపు

జులై 17: ఐదో విడత సీట్ల కేటాయింపు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని