చిత్రసీమలో జోష్‌

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సంచలన విజయం తెలుగు చిత్రసీమలో ఉత్సాహాన్ని నింపింది. సజావుగా సినీ వ్యాపారం సాగడానికి ఇన్నాళ్లూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ వ్యాపార వర్గాలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నాయి.

Updated : 06 Jun 2024 06:57 IST

ఏపీలో కూటమి విజయంతో సర్వత్రా హర్షం
చిక్కులు తొలగాయని భావిస్తున్న సినీ వ్యాపారులు
ఈనాడు - హైదరాబాద్‌

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సంచలన విజయం తెలుగు చిత్రసీమలో ఉత్సాహాన్ని నింపింది. సజావుగా సినీ వ్యాపారం సాగడానికి ఇన్నాళ్లూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ వ్యాపార వర్గాలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో సినిమా రంగానికి ఏ దశలోనూ ప్రోత్సాహం లభించలేదు. వేడుకలు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు మొదలుకొని టికెట్‌ ధరల వరకూ ప్రతి విషయంలోనూ ప్రభుత్వం పేచీలు పెట్టేది. సర్వం తానే అయి, ఎవరైనా తన వద్దకొచ్చి ప్రాధేయపడాల్సిందే అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించారు. దాంతో కళారంగానికి, చిత్రసీమకు తాము బద్ధ వ్యతిరేకమని చెప్పకనే చెప్పినట్టయింది. అదే చిత్రసీమ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌ హృదయంతో సమానం. 60 శాతానికిపైగా సినీ వ్యాపారం జరిగేది ఇక్కడే. తనకు రాజకీయ ప్రత్యర్థులైన పవన్‌కల్యాణ్, బాలకృష్ణను దెబ్బ కొట్టడానికి పలుమార్లు ఇదే అస్త్రంగా జగన్‌ ఎంచుకున్నారు. వాళ్లు నటించిన సినిమాలనే లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. అయినా వెనకడుగు వేయకుండా తమ నిర్మాతలకు అండగా నిలుస్తూ ఒకవైపు సినిమాలు చేసుకుంటూ.. మరోవైపు ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్, బాలకృష్ణ పోరాడారు. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని రజనీకాంత్‌ అన్నందుకు అప్పటి మంత్రులతో వైకాపా నాయకత్వం తిట్టించింది. రజనీ వయసు, స్థాయినీ మరిచిపోయి ఆయన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని కొడాలి నాని, రోజా నానా మాటలన్నారు. ఆ నోటి దురుసు ఫలితమెలా ఉంటుందో అర్థమైందా అంటూ ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటుతో బుద్ధి చెప్పారు. ఇలాంటి సినీ వ్యతిరేక విధానాలను చిత్రసీమ, సినీ ప్రేమికులు, అభిమానులు గమనిస్తూనే వచ్చారు. ఎన్నికల్లో తాము చేయాల్సిన పనిని తాము చేసి చూపించారు. 

అభిమానుల ఆనంద పరవశం

అగ్ర కథానాయకులు పవన్‌కల్యాణ్, బాలకృష్ణ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. వారిద్దరూ ఘన విజయాలు సొంతం చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. వాళ్లిద్దరూ సాధించిన ఘనతలను, ప్రసంగాల వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. నిర్మాణ సంస్థల కార్యాలయాలు, సినిమాల సెట్స్‌లోనూ సంబరాలు చేసుకున్నారు. పలువురు సినీ తారలు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తెదేపా అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలకు శుభాకాంక్షలు చెప్పారు. 

పిఠాపురంలో సినీ ప్రముఖుల పవర్‌ పంచ్‌

ఎన్నికలకు ముందే పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లి ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అంతగా ఆయనకు సినీపరిశ్రమ నుంచి ప్రోత్సాహం దక్కింది. ఫలితాలు వెలువడ్డాక కథానాయకుడు నితిన్‌ ఎక్స్‌ ద్వారా స్పందిస్తూ... ‘ఈ ఎన్నికల్లో విజయం సాధించడం, కూటమిని అగ్రస్థానానికి చేర్చిన తీరుపై ఓ అభిమానిగా, ఓ సోదరుడిగా థ్రిల్‌గా ఉన్నా. మనసును భావోద్వేగాలు ఆక్రమించుకోవడంతో నా ఆనందాన్ని చెప్పలేకపోతున్నా. మీరు ఎంతో అద్భుతంగా పోరాడారు. ఈ విజయానికి అర్హులు. ఎప్పటికీ మీరు మా పవర్‌స్టార్‌. మీకు మరింత శక్తియుక్తులు కలగాలి’ అంటూ అభినందించారు. మరో అగ్ర కథానాయకుడు రవితేజ స్పందిస్తూ.. ‘ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, బాలకృష్ణ, లోకేశ్‌లకు అభినందనలు. సంపూర్ణమైన పదవీ కాలం, అభివృద్ధితో కూడిన మరిన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నా. పిఠాపురం నియోజకవర్గంలో భారీ విజయం సాధించినందుకు, ఈ ప్రయాణంలో మీ పట్టుదలకు నా అభినందనలు. పెద్ద మనసుతో ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా’ అంటూ వ్యాఖ్య చేశారు.


అద్భుతమైన విజయం సాధించిన పవన్‌కల్యాణ్‌కు అభినందనలంటూ ఎక్స్‌ ద్వారా అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు చెప్పారు. ‘ప్రజలకు సేవ చేయడంలో మీ అంకితభావం, నిబద్ధత, కృషి ఎప్పుడూ మా హృదయాల్ని హత్తుకునేవి. ప్రజాసేవలో ఈ కొత్త ప్రయాణానికి శుభాభినందనలు’ అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌


‘ఘనవిజయం సాధించిన చంద్రబాబుకు అభినందనలు. మీ నాయకత్వం రాష్ట్రాన్ని ప్రగతి, శ్రేయస్సు, కీర్తి వైపు నడిపిస్తుంది. చారిత్రక విజయం సాధించిన ప్రియమైన పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఈ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి మై ఫ్రెండ్‌. ఇదే ఉత్సాహంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా. పిఠాపురం ఎమ్మెల్యేకు మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’

ప్రముఖ నటుడు వెంకటేశ్‌


‘ఘన విజయం సాధించిన చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. అభివృద్ధి, శ్రేయస్సుతో నిండిన మీ పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అద్భుతమైన విజయం అందుకున్న పవన్‌కల్యాణ్‌కు అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన విశ్వాసం, నమ్మకానికి మీ విజయమే ప్రతిబింబం. ప్రజల కోసం మీ కలలను సాకారం చేసేందుకు పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ 

హీరో మహేశ్‌బాబు


‘ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబుకు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’  

నాగార్జున


‘అద్భుతమైన విజయం సాధించిన దార్శనికుడు చంద్రబాబుకు అభినందనలు. మా కుటుంబానికి గర్వకారణమైన రోజు ఇది! చారిత్రక విజయం సాధించిన పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు’ 

రామ్‌చరణ్‌


దార్శనిక నాయకత్వం స్ఫూర్తిదాయకం: కమల్‌హాసన్‌

ఓటర్ల చరిత్రాత్మక ఆదేశం ఇదంటూ చంద్రబాబునాయుడిని అగ్రనటుడు కమల్‌హాసన్‌ అభినందించారు. ఎక్స్‌ ద్వారా ఆయన స్పందిస్తూ.. ‘మీ దార్శనిక నాయకత్వం దేశంలోని ఇతర ప్రాంతాలకూ స్ఫూర్తిదాయకం. బలమైన, పునరుద్ధరణతో కూడిన భారతదేశం ఉజ్వల భవిష్యత్తు ఇక్కడే ఉందంటూ వ్యాఖ్య చేశారు.


అగ్రనటుడు మోహన్‌బాబు ఎక్స్‌ ద్వారా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ‘మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేద’ంటూ అభినందించారు.


‘ఈ చరిత్రాత్మకమైన విజయాన్ని ప్రియమైన నారా చంద్రబాబునాయుడు మావయ్య సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేశ్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురందేశ్వరి అత్తకు నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్‌కల్యాణ్‌కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’

ఎన్టీఆర్‌.


‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబునాయుడు మావయ్యకు, తెదేపా నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు. మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భవిష్యత్తును కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. వరుసగా మూడోసారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్‌కి శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన లోకేశ్, శ్రీభరత్, పురందేశ్వరి అత్త గారికి నా శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు నా శుభాకాంక్షలు.’

నందమూరి కల్యాణ్‌రామ్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు