సంక్షిప్తవార్తలు(5)

సిట్‌ (సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2) కార్యాలయానికి ఎట్టకేలకు తాళాలు పడ్డాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో ఆ కార్యాలయం నుంచి ఏ ఒక్క దస్త్రమూ,

Updated : 07 Jun 2024 06:27 IST

సిట్‌ కార్యాలయానికి తాళాలు

ఈనాడు, అమరావతి: సిట్‌ (సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2) కార్యాలయానికి ఎట్టకేలకు తాళాలు పడ్డాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో ఆ కార్యాలయం నుంచి ఏ ఒక్క దస్త్రమూ, పత్రాలు బయటకు వెళ్లకుండా, బయటి వ్యక్తులు లోపలికి రాకుండా చర్యలు చేపట్టారు. తాడేపల్లి పాతూరు రోడ్డులోని ‘‘సంవృద్ధి నెక్సా’’ అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలోని ఈ సిట్‌ కార్యాలయం వద్ద పోలీసు భద్రతనూ పెట్టారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఫైబర్‌గ్రిడ్, ఎసైన్డ్‌ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యులు చెప్పిన వాటికల్లా తలాడించి, తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, నారాయణ తదితరులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే అభియోగాలను సిట్‌ కార్యాలయం ఎదుర్కొంటోంది. చంద్రబాబు, లోకేశ్‌పై నమోదు చేసిన కొన్ని అక్రమ కేసులకు సంబంధించిన పలు వాంగ్మూలాల పత్రాల్ని ఎన్నికల సమయంలో సిట్‌ కార్యాలయ సిబ్బంది కాల్చేసిన సంగతి తెలిసిందే. 


అటవీ సంరక్షణపై ఏపీతో సమన్వయానికి తెలంగాణ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, అక్కడ సంచరించే వన్యప్రాణుల సంరక్షణపై తెలంగాణ అటవీ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేలా ప్రణాళిక రూపొందించింది. తొలుత ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖతో కార్యాచరణ ప్రారంభించి.. తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించనుంది. అందులో భాగంగా రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ నెల 8వ తేదీన ఏపీలోని నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్‌)కు వెళ్లనున్నారు. 9వ తేదీన తెలంగాణలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోని దోమలపెంటలో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కానున్నారు.


సచివాలయంలో స్వీట్ల పంపిణీ

ఈనాడు, అమరావతి: తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌ సచివాలయంలో స్వీట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సంక్షేమ కోసం అన్ని విధాల కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.


నీట్‌ ఫలితాల్లో ఆకాష్‌ విజయభేరి

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) వెల్లడించింది. 15 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేశారని.. వీరిలో ఎక్కువ మంది 679, అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని పేర్కొంది. 716 మార్కులతో అనురన్‌ ఘోష్‌ ఆలిండియా 77వ ర్యాంకు సాధించారని తెలిపింది. అసాధారణ విజయాన్ని సాధించిన విద్యార్థులను ఏఈఎస్‌ఎల్‌ చీఫ్‌ అకడమిక్, బిజినెస్‌ హెడ్‌ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా అభినందించారు.


మరికొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరణ

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: కోస్తాంధ్ర, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు అమరావతి వాతావరణ కేంద్రం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుతం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గురువారం చిత్తూరు, ఏలూరు, తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, పార్వతీపురం మన్యం, వైఎస్సార్, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, అనకాపల్లి తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు చిత్తూరులో 69.75 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని