వెబ్‌ల్యాండ్‌తో పని లేకుండానే.. ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌!

పేదల నుంచి కొట్టేసిన ఎసైన్డ్‌ భూములను వైకాపా పెత్తందారులు, ఉన్నతాధికారుల బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ కుట్రపూరితంగా వ్యవహరించిన వైనమిది.

Published : 07 Jun 2024 05:45 IST

వైకాపా పెత్తందారులు, ఉన్నతాధికారుల కోసం హడావుడి
జవహర్‌రెడ్డి సూచనలతో రిజిస్ట్రేషన్‌ 
శాఖ కుట్రపూరిత ఆదేశాలు
యాజమాన్య హక్కుల కల్పనపై డిసెంబరు 19న జీఓ
జనవరి 13 నాటికి 7 లక్షల ఎకరాల వివరాలు సిద్ధం

ఈనాడు, అమరావతి: పేదల నుంచి కొట్టేసిన ఎసైన్డ్‌ భూములను వైకాపా పెత్తందారులు, ఉన్నతాధికారుల బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ కుట్రపూరితంగా వ్యవహరించిన వైనమిది. ఈ భూములు నిషిద్ధ జాబితా నుంచి తొలగించినట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకున్నా, రిజిస్ట్రేషన్‌ ఆపొద్దంటూ ఆ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) రామకృష్ణ ఆదేశాలు జారీచేసి, అక్రమాలకు చేయూతనిచ్చారు. గత జనవరిలో జారీచేసిన ఈ ఉత్తర్వుల్లో అదే నెల 20వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్లకు అవసరమైన ప్రక్రియ పూర్తికావాలని షరతు కూడా విధించారు. నిశిత పరిశీలన ద్వారా జరగాల్సిన ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపై ఇంత హడావుడిగా లక్ష్యాలు నిర్దేశించడం వెనుక ప్రభుత్వ పెద్దలున్నారు. విస్తీర్ణంలో తేడాలుంటే, ఈ వ్యవహారాలపై నియమించిన కమిటీ సమీక్షించి, నిర్ణయం తీసుకోవాలని సూచించిన రిజిస్ట్రేషన్‌ శాఖ.. కీలకమైన వెబ్‌ల్యాండ్‌ జోలికి మాత్రం వెళ్లలేదు. ఆలస్యమయ్యే కొద్దీ కొత్త సమస్యలు తలెత్తవచ్చన్న ఉద్దేశంతో అక్రమార్కులు రిజిస్ట్రేషన్లకు పరుగులుదీశారు. సాధారణంగా భూముల రిజిస్ట్రేషన్‌కు అన్ని ఆధారాలు, వివరాలు సమర్పించినప్పటికీ ఏవో కొర్రీలు పెట్టి లంచాలు వసూలు చేస్తారన్న అపవాదు రిజిస్ట్రేషన్‌ శాఖపై ఉంది. అలాంటిది ఎసైన్డ్‌ భూముల విషయంలో ఆఘమేఘాలపై స్పందించడం గమనార్హం.

ఇంత వేగిరం ఎందుకో?

పేదలకు 20 ఏళ్ల క్రితం ఎసైన్‌ చేసిన వ్యవసాయ భూములను 2023 జులై 31 నుంచి అమ్ముకునేలా వీలు కల్పిస్తూ వైకాపా ప్రభుత్వం 2023 అక్టోబర్‌ 27న గెజిట్‌ జారీ చేసింది. దీనిపై డిసెంబర్‌ 19న జీవో 596 పేరుతో మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 13 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7,62,041 ఎకరాల భూములు నిషిద్ధ జాబితా నుంచి తప్పించేందుకు అర్హమైనవని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఇందులో 6.34 లక్షల ఎకరాల భూముల వివరాలు జిల్లాల్లోని రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాలకు అందాయి. ఉదాహరణకు, విశాఖ నగరంలో 344 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 5,016, నెల్లూరు- 44,516, అన్నమయ్య- 1.24 లక్షలు, చిత్తూరు- 1.49 లక్షలు, ఎన్టీఆర్‌- 34,039, విజయనగరం జిల్లాలో 5,618 ఎకరాల చొప్పున ఎసైన్డ్‌ భూముల వివరాలు ఆయా జిల్లాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు చేరాయి. వీటిపై పరిశీలన పేరుతో సమయం తీసుకోకుండా హడావుడి చేశారు.

పట్టా భూమిగా మార్చకుండానే..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తన బినామీల ద్వారా భారీగా ఎసైన్డ్‌ భూములు కొన్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన సీఎస్‌ హోదాలోనే రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యకలాపాలను పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్, ఐజీగా ఉన్న రామకృష్ణ.. సీఎస్‌ ఆదేశాల మేరకే నడుచుకున్నారు. సాధారణంగా రాష్ట్ర స్థాయిలో తయారుచేసిన వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. కానీ, వెబ్‌ల్యాండ్‌లోని వివరాలు పరిశీలించకుండానే కలెక్టర్ల నుంచి అందే జాబితాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని రామకృష్ణ ఆదేశాలిచ్చారు. దీంతో వైకాపా పెత్తందారులు, కొందరు ఉన్నతాధికారులు బాగా ప్రయోజనం పొందారు. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఎసైన్డ్‌ భూములను అనుభవిస్తున్నది అసలైన ఎసైన్డ్‌దారులేనా? వారి వారసులా? ఇతరులా? లేక ఎవరూ లేరా అన్నది వీఆర్వోలు పరిశీలించి తహసీల్దారుకు నివేదించాలి. తహసీల్దార్లు వాటిని జాయింట్‌ కలెక్టర్లకు సిఫార్సు చేస్తే, అక్కడ నిశితంగా పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆమోదం తెలపాలి. తర్వాత ఆ వివరాలు వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించాలి. వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో భూముల వర్గీకరణపై ఓ కాలమ్‌ ఉంటుంది. అందులో ‘ప్రభుత్వం’ లేదా ‘పట్టా భూమి’గా వివరాలు నమోదు చేయాలి. ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్న సర్వే నంబర్లపై రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు. వైకాపా ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎసైన్డ్‌ భూములను అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కంటే ముందుగా వాటిని వెబ్‌ల్యాండ్‌లో ‘పట్టా భూమి’ కాలమ్‌లోకి మార్చాలి. ఇలా చేయకుంటే ఆ భూములపై భవిష్యత్తులో బ్యాంకు రుణాలు రావు. ఇతరత్రా సమస్యలు తలెత్తుతాయి. ఎసైన్డ్‌ భూముల వ్యవహారంలో కొత్త ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుచేసి, విచారణ జరిపిస్తే వెబ్‌ల్యాండ్‌లో రికార్డులు మారకుండానే రిజిస్ట్రేషన్‌ జరిగిపోయిన వేల ఎకరాల భూదందా వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని