బిల్లుల చెల్లింపులపై ఫిర్యాదులు సిద్ధం!

వైకాపా ప్రభుత్వంలో ఓ విధానం అంటూ లేకుండా, నచ్చిన గుత్తేదారులకు ఇష్టానుసారం చెల్లించడానికి బాధ్యులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, కార్యదర్శి సత్యనారాయణపై చర్యలు

Published : 07 Jun 2024 05:49 IST

సీఎస్, ఆర్థికశాఖ అధికారులు ఇష్టానుసారం చేశారు   
నేడు ఏసీబీ, విజిలెన్స్‌ డీజీలను కలవనున్న గుత్తేదారులు 

ఈనాడు-అమరావతి: వైకాపా ప్రభుత్వంలో ఓ విధానం అంటూ లేకుండా, నచ్చిన గుత్తేదారులకు ఇష్టానుసారం చెల్లించడానికి బాధ్యులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, కార్యదర్శి సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ, విజిలెన్స్‌ డీజీలకు గుత్తేదారులు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బాయ్‌) ఏపీ విభాగం గుత్తేదారులు ఓ ఫిర్యాదును సిద్ధంచేసి, గురువారం అన్ని జిల్లాల్లోని బాయ్‌ ప్రతినిధుల నుంచి ఆమోదం తీసుకున్నారు. శుక్రవారం సంఘం రాష్ట్ర ప్రతినిధులు ఏసీబీ, విజిలెన్స్‌ డీజీలను కలిసి వేర్వేరుగా ఫిర్యాదులు అందజేయనున్నారు. తొలుత బిల్లులు అప్‌లోడ్‌ చేసిన గుత్తేదారులకు తొలుత చెల్లింపులు విధానం (ఫిఫో విధానం) కాకుండా, ఇష్టానుసారం నచ్చిన గుత్తేదారులకు చెల్లింపులు చేయడంలో సీఎస్, ఆర్థికశాఖ అధికారులే కీలకమని వారు పేర్కొంటున్నారు. 2019-24 మధ్య అయిదేళ్లలో పంచాయతీరాజ్‌లోని ఏఐఐబీ రుణంతో చేపట్టిన పనులు, ఆర్‌అండ్‌బీలో కేంద్ర రహదారి అభివృద్ధి నిధిలో చేసిన పనులు, జలవనరులశాఖ, గృహనిర్మాణ శాఖల్లోని పనులకు జరిపిన చెల్లింపులపై విచారణ చేయాలని అందులో కోరనున్నారు. వైకాపా పెద్దలకు సన్నిహితులైన బడా కంపెనీలకు మాత్రమే చెల్లింపులు చేసి, మిగిలిన గుత్తేదారులకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలోనే వారంతా ఫిర్యాదు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని