ఈ ఏడాది తుంగభద్రకు 172 టీఎంసీల జలాలు

తుంగభద్ర జలాశయానికి ఈ నీటి సంవత్సరంలో సుమారు 172 టీఎంసీల దాకా జలాలు తరలివచ్చే అవకాశం ఉందని పర్యవేక్షక ఇంజినీర్లు అంచనా వేశారు.

Published : 07 Jun 2024 05:51 IST

వస్తాయని అంచనా వేస్తున్న నిపుణులు

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయానికి ఈ నీటి సంవత్సరంలో సుమారు 172 టీఎంసీల దాకా జలాలు తరలివచ్చే అవకాశం ఉందని పర్యవేక్షక ఇంజినీర్లు అంచనా వేశారు. గురువారం టి.బి.డ్యాం పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పర్యవేక్షక ఇంజినీర్ల సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఖరీఫ్‌లో ముందస్తుగా వర్షాలు ప్రారంభమవడంతో ప్రస్తుతం జలాశయానికి సుమారు 1,500 క్యూసెక్కుల దాకా వరద నీరు వచ్చి చేరుతోందని తుంగభద్ర మండలి పర్యవేక్షక ఇంజినీరు శ్రీకాంత్‌రెడ్డి సమావేశంలో వెల్లడించారు. జూన్, జులై నెలల్లో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. జులైలో జలాశయం నిండితే చివరి వారంలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు నీటిని విడుదల చేయవచ్చన్న అంచనాకు వచ్చారు. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని సంబంధిత ఇంజినీర్లు కోరారు. సమావేశంలో పర్యవేక్షక ఇంజినీర్లు ఎల్‌.బసవరాజ్‌ (మునిరాబాద్‌), ఎన్‌.రాజశేఖర్‌ (అనంతపురం), కార్యనిర్వాహక ఇంజినీర్లు జి.టి.రవిచంద్ర (టి.బి.డ్యాం), ఎం.నీలకంఠరెడ్డి (బళ్లారి) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని