నాబార్డు నిధులు మళ్లించిన అధికారులపై విచారణ చేయించాలి

జలజీవన్‌ మిషన్‌ పనుల కోసం నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.830 కోట్లతో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులను మళ్లించిన రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ముఖ్య కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) ఆర్వీ కృష్ణారెడ్డిపై విచారణ జరిపించాలని ఏపీ తాగునీటి సరఫరా గుత్తేదారుల సంఘం కోరింది.

Published : 08 Jun 2024 04:15 IST

గవర్నర్‌తోపాటు అనిశా, విజిలెన్స్‌ డీజీలకు గుత్తేదారుల సంఘం ఫిర్యాదు

ఈనాడు-అమరావతి: జలజీవన్‌ మిషన్‌ పనుల కోసం నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.830 కోట్లతో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులను మళ్లించిన రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ముఖ్య కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) ఆర్వీ కృష్ణారెడ్డిపై విచారణ జరిపించాలని ఏపీ తాగునీటి సరఫరా గుత్తేదారుల సంఘం కోరింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు అవినీతి నిరోధక, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)కు శుక్రవారం వేర్వేరుగా ఫిర్యాదు చేసింది. నాబార్డు నిధులు మళ్లించి జలజీవన్‌ పనులు చేస్తున్న చిన్న గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో గత ఐదేళ్లుగా ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన రుణాలపై వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.రామారావు, బి.రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు వై.వెంకటేశ్‌ వాపోయారు. మొదట అప్‌లోడ్‌ చేసిన బిల్లులను తొలుత చెల్లించాలన్న విధానాన్ని పక్కనపెట్టి.. కమీషన్లు ఇచ్చిన సన్నిహిత గుత్తేదారు సంస్థలకే బిల్లులు చెల్లించారని ఫిర్యాదులో వివరించారు. 

ఈఎన్‌సీపై పోలీస్‌ స్టేషన్‌లో నేడు ఫిర్యాదు

గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో అడ్డగోలుగా వ్యవహరించిన ఈఎన్‌సీ కృష్ణారెడ్డిపై భవానీపురం పోలీస్‌స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేయాలని గుత్తేదారులు నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు మేఘా ఇంజినీరింగ్, ఎన్‌ఏఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థలకు ఈఎన్‌సీ రూ.90 కోట్లకుపైగా బిల్లులు చెల్లించారని గుత్తేదారులు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని