సంక్షిప్త వార్తలు(8)

భూ మాఫియాకు కొమ్ముకాసిన వారిపై చర్యలు చేపట్టాలి

Updated : 08 Jun 2024 06:19 IST

తూర్పుగోదావరి జిల్లా గౌతమి సేవాదళ్‌ ఛైర్మన్‌ డిమాండు

ఈనాడు, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం గ్రామీణం పరిధిలోని కవలగొయ్యిలో రూ.100 కోట్ల విలువైన 15.53 ఎకరాలకు సంబంధించిన దస్త్రాలు మార్చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా గౌతమి సేవాదళ్‌ ఛైర్మన్‌ బత్తుల మధుబాబు శుక్రవారం డిమాండు చేశారు. ఈ భూమి విషయంలో రాజమహేంద్రవరంలో పని చేసిన పీపీవీ గోపాలకృష్ణ (తహసీల్దార్‌), గొలుగూరి బాపిరాజు (డీటీ), కె.రామకృష్ణ, జి.శ్రీనివాసరెడ్డి (సర్వేయర్‌లు), పోలీసు శాఖకు చెందిన పి.కనకారావు, జి.చెన్నకేశవరావు (సీఐలు), ఆర్‌.రఘురామ్‌ (హెచ్‌సీ) విజయవాడకు చెందిన హరిబాబుకు అనుకూలంగా పని చేశారని, అప్పట్లో దీనిపై అభియోగాలు మోపుతూ సీఐడీ ఛార్జిషీట్‌ నమోదు చేసి కాకినాడ న్యాయస్థానంలో దాఖలు చేసిందన్నారు. కానీ, వీరిపై చర్యలు తీసుకోకుండా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. మాజీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ సహకారంతో అక్రమార్కులను ఇప్పటికీ అరెస్టు చేయలేదన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అక్రమార్కులపై చర్యలు తీసుకొని, వారికి సహకరించిన జవహర్‌రెడ్డి, సంజయ్‌లపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని డిమాండు చేశారు.


తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా... విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: సుదీర్ఘ కాలంపాటు నీటిపారుదల, జలవనరుల రంగంలో విధులు నిర్వర్తించిన అనుభవమున్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1987 బ్యాచ్‌కి చెందిన ఆదిత్యనాథ్‌దాస్‌ ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. విభజన అనంతరం ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021 సెప్టెంబరులో పదవీ విరమణ చేశారు.


ఇద్దరు సలహాదారుల తొలగింపు

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ట్రస్టు సలహాదారు బాధ్యతల నుంచి ఆర్‌.గోవింద్‌హరిని, ఎన్నారై-మెడికల్‌ ఎఫైర్స్‌ (పీడియాట్రిక్‌ కేర్‌) బాధ్యతల నుంచి వాసుదేవ.ఆర్‌.నల్లిపిరెడ్డిని తప్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏంటీ కృష్ణబాబు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. 


ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్సీ రఘువర్మ

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ నివేదిక త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలని అన్నారు. అనంతరం అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం ఉద్యోగులను వేధింపులకు గురి చేసింది. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకుండా బోధన భారం మోపింది. పాఠశాలల విలీన ప్రక్రియతో ప్రాథమిక బడుల ఉసురుతీసింది. వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి’’ అని కోరారు. సమావేశంలో పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు పాల్గొన్నారు.


ఐటీఐల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు పొడిగింపు 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఐటీఐల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 651 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహాయ శిక్షణ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్‌ సబార్డినెట్స్, రాత్రి కాపలాదారుల సేవలను పొడిగించింది.


పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అకడమిక్‌ ఆడిట్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అకడమిక్‌ ప్రమాణాలు పెంచేందుకు ఆడిట్‌ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్రాంచిల వారీగా అకడమిక్‌ ఆడిట్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాలు సెమిస్టర్‌కు ఒకసారైనా కళాశాలలకు వెళ్లి అకడమిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తాయి. బోధన, అభ్యసన విధానాలు, అధ్యాపకుల సంఖ్య, పనిభారం, పారిశ్రామిక శిక్షణ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. 


‘నీరు-చెట్టు బిల్లులపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు’

ఈనాడు డిజిటల్, అమరావతి: గత తెదేపా ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకంలో చేపట్టిన చెరువులు, కాలువల్లో పూడికతీత పనుల పెండింగ్‌ బిల్లుల గురించి తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పెండింగ్‌ బిల్లుల గ్రీవెన్స్‌సెల్‌ ఇన్‌ఛార్జి ఆళ్ల వెంకటగోపాలకృష్ణారావు తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబును గురువారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసినట్లు పేర్కొన్నారు. గతంలో నీరు చెట్టు పథకం పనుల బిల్లులను వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిందని గుర్తుచేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించినా, ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించలేదని తెలిపారు. రూ.425 కోట్ల బకాయిలపై చంద్రబాబుకు నివేదిక అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. బకాయిలపై సమీక్షించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు.


‘ఖాళీలన్నీ కలిపి మెగా డీఎస్సీ ఇవ్వాలి’ 

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లోని అన్ని ఖాళీలను కలిపి మెగా డీఎస్సీగా మార్చాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు. మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానని చంద్రబాబు ప్రకటించినందున ఒకేసారి అన్ని ఖాళీలకు డీఎస్సీ ప్రకటించాలని పేర్కొన్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లోనూ ఎస్జీటీ, భాషోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని