ఏయూలో కీలక దస్త్రాలు మాయం!

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కీలక దస్త్రాలను మాయం చేసేందుకు వీసీ ప్రసాదరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. వైకాపా వీర విధేయుడిగా వీసీ ప్రసాదరెడ్డికి పేరుంది. ఆయన పదవీ కాలంలో వర్సిటీని రాజకీయాలకు నిలయంగా మార్చేశారు.

Published : 08 Jun 2024 06:04 IST

ప్రభుత్వం మారిన నేపథ్యంలో తరలించినట్లు అనుమానం
తొలి నుంచి వీసీ ప్రసాదరెడ్డి తీరు వివాదాస్పదం

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కీలక దస్త్రాలను మాయం చేసేందుకు వీసీ ప్రసాదరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. వైకాపా వీర విధేయుడిగా వీసీ ప్రసాదరెడ్డికి పేరుంది. ఆయన పదవీ కాలంలో వర్సిటీని రాజకీయాలకు నిలయంగా మార్చేశారు. ఎన్నికల్లో వైకాపా ఓటమి తర్వాత ఆయన కార్యాలయానికి సరిగా రావడం లేదు. వీసీ స్థానికంగా లేరని, బెంగళూరు వెళ్లినట్లు వర్సిటీలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన పరిపాలన భవనంలోని వివిధ దస్త్రాలను రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ తనిఖీ చేసి వెళ్లినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం వీసీకి చెందిన కారులోనే దస్త్రాలను ఆయన కార్యాలయం నుంచి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది. హడావుడిగా దస్త్రాలను తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రాజీనామాకు సిద్ధమేనా?

గతంలో ప్రసాదరెడ్డి రెక్టార్‌గా పనిచేసిన సమయంలోనూ పలు కీలక దస్త్రాలను మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. పలువురు విశ్రాంత ఆచార్యులు, ఉద్యోగులకు చెందిన సర్వీసు దస్త్రాలు ఇప్పటికీ కనిపించట్లేదని వారు వాపోతున్నారు. ఎన్నికలకు ముందు వీసీ ఏయూ కేంద్రంగా వైకాపా అభ్యర్థులకు అనుకూలంగా సర్వేలు చేయించారనే విమర్శలున్నాయి. వైకాపాకు ఓటేయకపోతే భవిష్యత్తులో చర్యలుంటాయని ఉద్యోగులు, సిబ్బందిని బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. కానీ, రాష్ట్ర ఉన్నతాధికారుల రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో ఆయన నిర్ణయాన్ని విరమించుకున్నట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఆయన పదవీ కాలంలో వర్సిటీని భ్రష్టు పట్టించారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. 

నిర్ణయాలన్నీ వివాదాస్పదమే..

ప్రసాదరెడ్డి పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్సిటీలోని ఆచార్యులను కాకుండా బయటి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెట్టారు. ప్రైవేటు కళాశాలలో పనిచేసే జేమ్స్‌ స్టీఫెన్‌ను అంబేడ్కర్‌ ఛైర్‌ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకం పేరిట వర్సిటీలోకి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా అదనపు బాధ్యతల పేరిట వర్సిటీలో కీలకమైన రిజిస్ట్రార్‌ పదవిని అప్పగించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ప్రసాదరెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆచార్యులెవరూ నోరెత్తలేకపోయారు. అంతకుముందు వర్సిటీలో సమర్థులైన సీనియర్‌ ఆచార్యులు ఉన్నప్పటికీ వారిని కాదని విశ్రాంత ఆచార్యుడిని రిజిస్ట్రార్‌గా నియమించి మూడుసార్లు పదవీ కాలాన్ని పొడిగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని