అరబిందోకు ‘బల్క్‌’గా దోచిపెట్టే కుట్ర

జగన్‌ జేబు సంస్థ అరబిందోకు దోచిపెట్టేలా గత వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది.  ఆ సంస్థకు అనుచిత ప్రయోజనాన్ని కల్పించేలా ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి కేంద్రం అడ్డుపడి, మొట్టికాయ వేసింది.

Published : 08 Jun 2024 06:07 IST

బల్క్‌డ్రగ్‌ పార్కులో 89 శాతం వాటా
రూ.5 వేల కోట్ల లబ్ధి  చేకూర్చేందుకు జగన్‌ ప్రయత్నం
ప్రైవేటు సంస్థకు దోచిపెట్టే కుట్రకు చెక్‌ పెట్టిన కేంద్రం
తప్పనిసరి పరిస్థితుల్లో  స్థలం మార్చి నక్కపల్లికి..
వైకాపా ప్రభుత్వ కుట్ర తాజాగా  వెలుగులోకి..

ఈనాడు - అమరావతి: జగన్‌ జేబు సంస్థ అరబిందోకు దోచిపెట్టేలా గత వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది.  ఆ సంస్థకు అనుచిత ప్రయోజనాన్ని కల్పించేలా ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి కేంద్రం అడ్డుపడి, మొట్టికాయ వేసింది. దీంతో కేంద్రం మంజూరు చేసిన బల్క్‌ డ్రగ్‌ పార్కు ద్వారా అరబిందో సంస్థకు రూ.5 వేల కోట్ల భారీ ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చాలన్న వైకాపా సర్కారు ప్రయత్నం బెడిసికొట్టిందన్న విషయంగా తాజాగా వెలుగుచూసింది. పార్కులో మెజారిటీ వాటా కట్టబెట్టి, పాలనా బాధ్యతలు మొత్తాన్ని అరబిందో గుప్పిట్లో ఉంచేలా గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్ర రసాయన మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. కాకినాడ జిల్లా తొండంగిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. బల్క్‌డ్రగ్‌ పార్కుల అభివృద్ధికి చేసే ఖర్చులో 70 శాతం లేదా గరిష్ఠంగా రూ.వెయ్యి కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది. పార్కు ఏర్పాటుకు అవసరమైన 2 వేల ఎకరాల భూములు, అభివృద్ధి పనుల కోసం రూ.441 కోట్లు ఖర్చు పెట్టే అరబిందోకు 89 శాతం వాటా కట్టబెట్టేలా వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల పార్కు పాలనా వ్యవహారాలు ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉంటాయని, అలా కాకుండా ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండేలా కొత్తగా ప్రతిపాదనలు పంపాలని కేంద్రం సూచించింది. ఈ లెక్కన భూములతో కలిపి పెట్టుబడిగా పెట్టే రూ.1,141 కోట్లకుగాను 49 శాతం వాటా మాత్రమే తమకు దక్కుతుందని, అది లాభసాటిగా లేదని బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు ప్రతిపాదన నుంచి అరబిందో వైదొలగింది. గత్యంతరం లేక గత ప్రభుత్వం.. బల్క్‌డ్రగ్‌ పార్కును అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలించింది. ఈ మేరకు అనుమతించాలని కోరుతూ 2023 అక్టోబరు 30న కేంద్రానికి లేఖ రాసింది. గత ప్రభుత్వ హయాంలో బల్క్‌డ్రగ్‌ పార్కు తరలింపు నిర్ణయం వెనుక జరిగిన ఈ వ్యవహారం తాజాగా బట్టబయలైంది. 

రూ.141 కోట్లు పెట్టుబడి పెట్టి.. 78% అదనంగా కొట్టేసే యత్నం 

బల్క్‌ డ్రగ్‌ పార్కులో కామన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫెసిలిటీ అభివృద్ధికి రూ.1,441 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. పార్కు ఏర్పాటు కోసం అరబిందో ప్రతిపాదించిన 2 వేల ఎకరాల భూముల విలువ సుమారు రూ.700 కోట్లు అని లెక్కగట్టింది. అంటే మొత్తం రూ.2,141 కోట్లు. అందులో కేంద్రం గ్రాంటుగా ఇచ్చే రూ.వెయ్యి కోట్లు పోను.. అరబిందో సంస్థ భూములతో కలిపి పెట్టే పెట్టుబడి సుమారు రూ.1,141 కోట్లు. కేంద్ర గ్రాంటుతో పోలిస్తే అరబిందో అదనంగా పెట్టే పెట్టుబడి రూ.141 కోట్లు మాత్రమే. ఆ మాత్రానికే అరబిందోకు.. బల్క్‌ డ్రగ్‌ పార్కులో 78 శాతం వాటా అదనంగా కట్టబెట్టేలా (పార్కులో 89% వాటా అరబిందో, కేంద్ర గ్రాంటు రూ.వెయ్యి కోట్లకు 11 శాతం వాటా ఏపీఐఐసీకి ఇచ్చేలా) గత ప్రభుత్వం వ్యవహరించింది. పార్కు అభివృద్ధి చేయడం ద్వారా వచ్చే ఆదాయంలో మెజారిటీ వాటా అరబిందో ఖాతాలో చేరేలా మాజీ సీఎం జగన్‌ ప్రయత్నించారు. 

పూర్తి వాటా ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఐఐసీకే!

ఈ ప్రతిపాదనపై కేంద్రం కొర్రీ వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం బల్క్‌డ్రగ్‌ పార్కును నక్కపల్లికి తరలించింది. అక్కడ ఏపీఐఐసీకి సుమారు 3 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్లో పార్కును అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికే చెందనుంది. పార్కులో భూముల కేటాయింపు ద్వారా సుమారు రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారుల అంచనా. రాష్ట్ర ప్రభుత్వం తొలుత పంపిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించి ఉంటే.. ఆదాయంలో మెజారిటీ వాటా అరబిందోకే వెళ్ళేది.  


రూ.14 వేల కోట్ల పెట్టుబడులు!

బల్డ్‌డ్రగ్‌ పార్కు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీబీడీఐసీఎల్‌) సంస్థను ఏర్పాటు చేసింది. 2023 మార్చి 13న కేంద్రం.. గ్రాంటు మొత్తంలో రూ.225 కోట్లు (25%) ఏపీబీడీఐసీఎల్‌ ఖాతాలో జమ చేసింది. ఏడాది గడిచినా ఆ గ్రాంటును వినియోగించలేదు. 2024-25తో ప్రాజెక్టు వ్యవధి ముగియనుంది. పార్కు అభివృద్ధికి పట్టుమని ఏడాది కూడా లేదు. పార్కును అభివృద్ధి చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న 200 ఫార్మా యూనిట్లతో పాటు.. అదనంగా మరో 100కు పైగా ఫార్మా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఏర్పడుతుంది. వాటి ద్వారా సుమారు రూ.14,340 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని