తోపుదుర్తి సోదరులకు డబ్బులిచ్చి మోసపోయాం

మొన్నటి వరకు రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తోపుదుర్తి సోదరులకు డబ్బులిచ్చి మోసపోయామంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాపోతున్నారు.

Published : 08 Jun 2024 06:10 IST

సొమ్ములు తీసుకుని పనిచేయలేదంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆవేదన

ఈనాడు డిజిటల్, అనంతపురం: మొన్నటి వరకు రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తోపుదుర్తి సోదరులకు డబ్బులిచ్చి మోసపోయామంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాపోతున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అనంతపురం నగరానికి సమీపంలోని ఓ తోటలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రహస్యంగా సమావేశమయ్యారు. 25 మందికి పైగా ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో లేఅవుట్లు వేసేందుకు వీరంతా గతంలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పారు. భూ బదాలయింపు కోసం ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆయన సోదరులు వసూలు చేసినట్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చెబుతున్నారు. ఇలా ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

రూ.50 కోట్ల దాకా వసూళ్లు

 రాప్తాడు, అనంతపురం రూరల్‌ మండలంలో ప్రకాశ్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో మరో సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు మండలంలో ఆయన తండ్రి ఆత్మరామిరెడ్డి తమ నుంచి సుమారు రూ.50 కోట్ల వరకు వసూలు చేశారని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మరికొంత మంది నుంచి పెద్దమొత్తంలో భూములు లాక్కున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి నుంచి డబ్బులు తీసుకుని కూడా పనులు చేయలేదని వాపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారందరూ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఎలాగైనా తాము తోపుదుర్తి సోదరులకు ఇచ్చిన సొమ్మును తిరిగి రాబట్టుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని సమాలోచనలు చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వచ్చే వారం ప్రకాశ్‌రెడ్డి ఇంటిని ముట్టడించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. 

ఒకే వ్యక్తి నుంచి రూ.6 కోట్లు 

గత తెదేపా ప్రభుత్వంలో అనంతపురం నగరానికి ఆనుకుని ఓ వ్యాపారి పెద్ద ఎత్తున వెంచర్‌ అభివృద్ధి చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి రాగానే ఆ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేశారు. అధికారుల్ని ఉసిగొల్పి భయపెట్టారు. దీంతో తోపుదుర్తి సోదరులకు రూ.6 కోట్లు సమర్పించినట్లు సదరు వెంచర్‌ యజమాని ఆరోపిస్తున్నారు. దీంతోపాటు అనంతపురం నగరానికి ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో అన్నదమ్ముల భూ వివాదంలో తలదూర్చి భూమి రాయించుకున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని