వైకాపా అరాచకాలకు ఆద్యుడు గౌతమ్‌ సవాంగ్‌

రాష్ట్ర పోలీసు వ్యవస్థను వైకాపాకు దాసోహం చేసేసి, ఆ పార్టీ నాయకుల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచే విధానానికి ఆద్యుడు మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అని తెదేపా భావిస్తోంది. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టిన ఆయన 2022 ఫిబ్రవరి వరకూ డీజీపీగా పనిచేశారు.

Updated : 08 Jun 2024 06:56 IST

పోలీసు వ్యవస్థను దాసోహం చేసింది ఆయనే
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో సవాంగ్‌పై తెదేపాలో చర్చ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పోలీసు వ్యవస్థను వైకాపాకు దాసోహం చేసేసి, ఆ పార్టీ నాయకుల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచే విధానానికి ఆద్యుడు మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అని తెదేపా భావిస్తోంది. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టిన ఆయన 2022 ఫిబ్రవరి వరకూ డీజీపీగా పనిచేశారు. చంద్రబాబుపై చెప్పు, రాయి విసరడం, తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసం పైకి మాజీమంత్రి జోగి రమేష్‌ దండెత్తడం, తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై దాడి, అమరావతి రైతులపై దాష్టీకాలు తదితర ప్రధాన ఘటనలన్నీ సవాంగ్‌ ఉన్న సమయంలోనే జరిగాయి. తెదేపా కేంద్ర కార్యాలయంలోకి చొరబడి వైకాపా మూకలు విధ్వంసం సృష్టిస్తే... ‘రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని తెదేపా అధికార ప్రతినిధి అసభ్య పదజాలంతో దూషించడం వల్లే ఆ దాడులు జరిగాయి’ అంటూ ఆ దాడుల్ని సమర్థించేలా సవాంగ్‌ వ్యాఖ్యలు చేశారు. తెదేపాది మీడియా షో అంటూ రాజకీయ నాయకుడి తరహాలో వ్యంగ్యంగా మాట్లాడారు. 

తీవ్ర అణచివేత.. అక్రమ కేసులు 

సవాంగ్‌ హయాంలో ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ విధానాల్ని, లోపాల్ని ప్రశ్నించే వారిపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు. తీవ్ర అణచివేత కొనసాగించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిర్వహించే కార్యక్రమాలకు కొవిడ్‌ నిబంధనల పేరిట పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇల్లు కదలనీయకుండా గృహనిర్బంధం, నోటీసులు జారీ, అరెస్టులు చేశారు. అధికార పార్టీ నాయకులు వేలమందితో కార్యక్రమాలు చేసినా పట్టించుకునేవారు కాదు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు నాయకులు తమపై జరుగుతున్న దాడుల విషయమై వినతులివ్వడం కోసం డీజీపీని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లినా సవాంగ్‌ వారిని కలిసేవారు కాదు. లేఖలు రాసినా స్పందించే వారు కాదు. రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఉందా? అంటూ హైకోర్టు ఆక్షేపించినా ఆయన పద్ధతి మార్చుకోలేదు. పూర్తిగా వైకాపా సేవలో తరించి.. ఆ పార్టీ నాయకుల అక్రమాలు, అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలకు అండదండగా నిలిచారంటూ తెదేపా శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. 

చంద్రబాబుపై దాడి చేస్తే.. భావ ప్రకటనా స్వేచ్ఛ అట.. 

వైకాపా అధికారం చేపట్టిన కొన్నాళ్లకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు రాళ్లు, చెప్పులు విసరగా.. ఆ ఘటనపై డీజీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ స్పందిస్తూ ‘నిరసన తెలపడం భావ ప్రకటన స్వేచ్ఛ’ అంటూ అలాంటి దుశ్చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడారు. పోలీసుల అండ చూసుకుని వైకాపా మూకలు మరింతగా పేట్రేగిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబుపైన, అమరావతి రైతులపైనా వివిధ సందర్భాల్లో రాళ్ల దాడులు జరగడానికి ఈ వ్యాఖ్యలే కారణమయ్యాయి. 

  • పల్నాడు ప్రాంతంలో వైకాపా నాయకుల దాడుల బారిన పడ్డ బాధితుల్ని పరామర్శించడం కోసం చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టేసి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. 
  • ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. సీఆర్‌పీసీ 151 సెక్షన్‌ కింద నోటీసులిచ్చి అరెస్టు చేశారు. ఈ అంశంలో గౌతమ్‌ సవాంగ్‌ను హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆయనకు కోర్టుకు పిలిపించి.. సీఆర్‌పీసీ 151 సెక్షన్‌ను ఆయనతో చదివించింది. తీవ్ర నేరాలకు ఇవ్వాల్సిన నోటీసును ఎలా ఇస్తారు? అంటూ నిలదీసింది. సవాంగ్‌ హయాంలో ఏ స్థాయిలో పోలీసులు పేట్రేగిపోయారో చెప్పేందుకు ఈ ఘటన ఒక నిదర్శనం. 
  • తెదేపా సీనియర్‌ నేతలు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు సవాంగ్‌ హయాంలోనే అరెస్టు అయ్యారు. రఘురామకృష్ణరాజుపై అనేక పోలీసుస్టేషన్‌ల్లో ఈయన హయాంలోనే కేసులు నమోదయ్యాయి. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల అరాచకానికి నేతృత్వం 

సవాంగ్‌ డీజీపీగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నాయకులు పేట్రేగిపోయి అరాచకాలకు పాల్పడితే.. పోలీసులే వాటికి నేతృత్వం వహించారు. పోటీకి దూరంగా ఉండాలని, నామినేషన్లు వేయొద్దని, వేసినా ఉపసంహరించుకోవాలని పోలీసులే ప్రతిపక్ష అభ్యర్థుల్ని భయపెట్టారు. వారిని అపహరించారు.. నిర్బంధించారు. అప్పటికీ లెక్క చేయకపోతే పాత కేసులు తిరగదోడారు. గంజాయి కేసులు బనాయించారు. తీవ్రంగా కొట్టారు. మొత్తంగా స్థానిక సంస్థల స్థానాలు వైకాపాకు బలవంతంగా ఏకగ్రీవమయ్యేలా, పోటీ చేసినచోట ప్రతిపక్షాల వారిని ముప్పు తిప్పలు పెట్టడం కోసం పోలీసు వ్యవస్థను సవాంగ్‌ ఉపయోగించారని తెదేపా శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. మాచర్లకు వెళ్లిన తెదేపా నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై వైకాపా నాయకులు దాడి చేసిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చంద్రబాబు డీజీపీ కార్యాలయానికి వెళ్లగా.. ఆయన్ను గేటు బయటే అడ్డుకున్నారు. డీజీపీ లేరని చెప్పి భద్రతా సిబ్బందితో గేటు మూయించేశారు. 

వివేకా హత్య కేసు నీరుగార్చటంలో 

జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌.. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సవాంగ్‌ హయాంలోనే పక్కదారి పట్టింది. ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టాక కొత్త సిట్‌ను ఏర్పాటు చేశారు. అసలు నిందితుల్ని తప్పించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి. ‘అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి (భారతి చిన్నాన్న కుమారుడు) నాకు కళ్లు లాంటి వారు అంటూ జగన్‌ వారి ముగ్గుర్ని నా వద్దకు పంపించారు’ అంటూ గౌతమ్‌ సవాంగ్‌ను కలిసినప్పుడు తమతో చెప్పారని వివేకా కుమార్తె సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వైకాపా సేవలో ఆయన ఎంతలా తరించారో చెప్పేందుకు ఇదే తార్కాణమని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. 

రాజ్యాంగపరమైన రక్షణ కల్పించేందుకు 

విచిత్రమేమిటంటే, ఇదే సవాంగ్‌ను జగన్‌ ప్రభుత్వం.. డీజీపీ పోస్టు నుంచి అప్పట్లో ఆకస్మికంగా, అవమానకరంగా తప్పించింది. అప్పటికి దాదాపు ఏడాదికి పైగా సర్వీసు ఉన్నప్పటికీ.. డీజీపీ పోస్టు నుంచి తప్పించి స్వచ్ఛంద పదవీ విరమణ చేయించింది. తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. ఆయనకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడం కోసమే ఈ పోస్టులో నియమించిందని తెదేపా భావిస్తోంది. 


అమరావతి రైతులపై తీవ్ర దాడులు, నిర్బంధాలు

రాజధాని అమరావతి రైతుల ఉద్యమంపై సవాంగ్‌ హయాంలో కనీవినీ ఎరుగని స్థాయిలో దాడులు, నిర్బంధాలు, అణచివేత చర్యలు కొనసాగాయి. కల్లోలిత ప్రాంతం మాదిరిగా రాజధాని గ్రామాల్లో వేలమంది పోలీసు బలగాల్ని మోహరించి భయభ్రాంతులకు గురిచేశారు. అడుగు తీసి అడుగేస్తే కేసు అన్నట్లుగా రాజధాని మహిళలు, రైతులపై వందలకొద్దీ అక్రమ కేసులు పెట్టారు. వారిపై అనేకసార్లు లాఠీఛార్జీ చేయించారు. అమరావతి రైతులు తిరుపతి వరకూ చేపట్టిన పాదయాత్రకు అనుమతే ఇవ్వలేదు. చివరికి వారు హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందగా.. అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. వారిపై జులుం ప్రదర్శించారు. అమరావతికి చెందిన ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయించారు. రాజధాని రైతులకు సంకెళ్లు వేసి మరీ జైలుకు తరలించారు. వైకాపా నాయకుల మెప్పు పొందడం కోసం.. చట్టాల్ని పక్కన పెట్టేశారని తెదేపా నాయకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని