‘రూసా’ నిధుల ధారాదత్తానికి హడావుడి

కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేలోపే విశ్వవిద్యాలయాల్లో ఉన్న నిధులను కరిగించేయాలనే యోచనలో ఆయా వర్సిటీల ఉన్నతాధికారులు ఉన్నారు.

Published : 08 Jun 2024 06:13 IST

బ్యాంకు ఖాతా వివరాలు కోరిన అధికారులు
నాగార్జున విశ్వవిద్యాలయం తీరుపై విమర్శలు

ఈనాడు, అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేలోపే విశ్వవిద్యాలయాల్లో ఉన్న నిధులను కరిగించేయాలనే యోచనలో ఆయా వర్సిటీల ఉన్నతాధికారులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే నాగార్జున వర్సిటీలో పరిశోధన ప్రాజెక్టులకు ‘రూసా’ నిధులు మంజూరు చేస్తామని.. వెంటనే తమకు అధ్యాపకుల బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలని వర్సిటీ రూసా కోఆర్డినేటర్‌ ఆచార్య సునీత ఈ నెల 5న సర్క్యులర్‌ జారీ చేయడం అధ్యాపకుల్లో చర్చనీయాంశమవుతోంది.మే 31న వర్సిటీ ఉపకులపతి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను ఆ లేఖలో పొందుపరిచారు. ఎప్పుడో ఖర్చు పెట్టాల్సిన నిధులను ఇప్పుడు మంజూరు చేయాలనుకోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

ఎన్నికల కోడ్‌ ముగియడంతో..

ఈ ఏడాది మార్చి 16 నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ గురువారంతో ముగిసింది. ఈ వ్యవధిలో కొత్త ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయకూడదు. కానీ విడతల వారీగా జమ చేస్తామని మెలికపెట్టింది. విశ్వవిద్యాలయంలో ఈ మధ్యే న్యాక్‌ కమిటీ పర్యటించింది. న్యాక్‌ కమిటీ రాకను దృష్టిలో పెట్టుకుని ఐదారు నెలల కిందటే రెగ్యులర్, ఒప్పంద అధ్యాపకులకు పరిశోధన ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు మంజూరు చేశారు. అప్పట్లో ఒక్కో అధ్యాపకుడికి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల దాకా మంజూరు చేశారు. తాజాగా రెండు రోజుల నుంచి ఆ నిధులు జమ చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని కోరడంతో అధ్యాపకులు బెంబేలెత్తుతున్నారు. ఇంతకుముందే న్యాక్‌ పర్యటన పేరుతో రూ.కోట్ల నిధులు మంచినీళ్ల ప్రాయంలా వెచ్చించారనే విమర్శలు వర్సిటీపై ఉన్నాయి. వాటి ఖర్చు, వినియోగానికి పారదర్శకత లోపించిందని, కొన్ని పనులకు టెండర్లు లేకుండానే నిధులు ఖర్చుచేశారనే ఆరోపణలు ఉన్నాయి. రూసా నిధులు రూ.6 కోట్ల వరకు రాగా వాటిని వర్సిటీలో సైన్సు, ఇతర పరిశోధన ప్రాజెక్టులకు వెచ్చించాలి. అందుకు విరుద్ధంగా రహదారులు, భవన నిర్మాణాలకు వెచ్చించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు, తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ‘రూసా’ నిధులు మంజూరు చేయడం విమర్శలకు తావిచ్చింది. 

ఆదేశాలకు విరుద్ధంగా..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్ల నియామకాలకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరి అనుమతులూ లేకుండా రూసా నిధులు మంజూరు చేస్తుండడం గమనార్హం. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే లోపు ఎలాంటి కేటాయింపులు, బదిలీలు చేయరాదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు విరుద్ధంగా నాగార్జున విశ్వవిద్యాలయంలో కొందరు అధ్యాపకులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల మంజూరుకు ఉపక్రమించడం వివాదాస్పదంగా మారింది. కోడ్‌ అమల్లో ఉండగా నిధుల మంజూరుకు బ్యాంకు ఖాతా వివరాలు కోరడం ఏమిటని కొందరు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గురువారం కొందరు ఆచార్యులు వర్సిటీలో గత ఐదేళ్లలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని వాటిపై సిట్‌ వేయాలని కోరారు. ప్రస్తుత వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్‌లు తమ పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చేయాలని రిజిస్ట్రార్‌ను కలిసి వాదనకు దిగారు. ఏక్షణాన అయినా తమను తొలగిస్తారనుకున్నారో ఏమోగానీ అందుబాటులో ఉన్న రూసా నిధులను అస్మదీయులకు కేటాయించడానికి హడావుడి చేస్తున్నారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని