మా పెద్దిరెడ్డి చెప్పందే సీటులో నుంచి కదలను

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఉపకులపతి(వీసీ) శ్రీకాంత్‌రెడ్డిని విశ్వవిద్యాలయంలోని ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు ఛాంబర్‌ నుంచి వెళ్లిపోవాలంటూ బలవంతంగా బయటకు పంపారు. ఎన్నికల కౌంటింగ్‌ ముగిసిన వెంటనే ఎస్వీయూ రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ రాజీనామా చేశారు.

Updated : 08 Jun 2024 06:42 IST

ఎస్వీయూ వీసీ శ్రీకాంత్‌రెడ్డి వింత వాదన
రాజీనామా చేయాలని పట్టుబట్టిన వర్సిటీ సిబ్బంది, విద్యార్థి సంఘాల నేతలు
వీసీ మొండికేయడంతో బలవంతంగా బయటకు పంపిన వైనం

వీసీ శ్రీకాంత్‌రెడ్డి ఛాంబర్‌ను ముట్టడించిన ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఉపకులపతి(వీసీ) శ్రీకాంత్‌రెడ్డిని విశ్వవిద్యాలయంలోని ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు ఛాంబర్‌ నుంచి వెళ్లిపోవాలంటూ బలవంతంగా బయటకు పంపారు. ఎన్నికల కౌంటింగ్‌ ముగిసిన వెంటనే ఎస్వీయూ రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ రాజీనామా చేశారు. వీసీ కూడా రాజీనామా చేస్తారని భావించారు. కానీ ఆయన పదవిని అంటిపెట్టుకొని ఉండటంతో ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం వర్సిటీకి చేరుకుని వీసీతో వాగ్వాదానికి దిగారు. ‘ప్రభుత్వం మారినా సీటు వదలవా..’ అంటూ ఆయన అక్రమాలపై నిలదీశారు. ‘వైకాపా పాలన ముగిసింది కదా ఇంకా మీరు రాజకీయ ముసుగు వేసుకొని ఆ పదవిలో కొనసాగడం ఏమిటి’ అని నేతలు ప్రశ్నించారు. ‘మా పెద్దిరెడ్డి చెప్పనిదే నేను సీటులో నుంచి కదలను’ అంటూ వీసీ శ్రీకాంత్‌రెడ్డి మొండికేశారు. ఈ మాటతో ఆగ్రహించిన బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాల నేతలు ఆయనపై చేయిచేసుకునే పరిస్థితికి చేరుకున్నారు. ‘వీసీ ఛాంబర్‌కు తాళం వేస్తాం ఇక మీరు బయటికి కదలాలి’అని అంటూ గట్టిగా చెప్పారు. సమస్య ముదిరేలా ఉందని గ్రహించిన వీసీ తన ఛాంబర్‌ నుంచి బయటికి వచ్చేశారు. అందరూ కలిసి వీసీని బంగ్లాకు పంపించేశారు. రెండు రోజుల్లో యూనివర్సిటీ బంగ్లా కూడా ఖాళీ చేయాలంటూ అల్టిమేటం ఇచ్చారు. వర్సిటీలో పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు.

ఛాంబర్‌ నుంచి బయటకు వెళుతున్న వీసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు