రామోజీరావు మరణం తెలుగు సమాజానికి తీరని లోటు

మా కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే ఆయన ఒక కారణం. ఆయన స్థాపించిన సంస్థల్లో లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఏ ఉద్యోగిని కదలించినా అదే స్ఫూర్తిని కలిగి ఉన్నారంటే ఆయన ఎంత బలంగా ఆ సంస్థలను నడిపించారో అర్థం చేసుకోవచ్చు.

Published : 09 Jun 2024 06:35 IST

తెదేపా కేంద్ర కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నాయకులు వర్ల రామయ్య, బొండా ఉమా, అశోక్‌బాబు, కొండ్రు మురళి తదితరులు


మా కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే ఆయన ఒక కారణం. ఆయన స్థాపించిన సంస్థల్లో లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఏ ఉద్యోగిని కదలించినా అదే స్ఫూర్తిని కలిగి ఉన్నారంటే ఆయన ఎంత బలంగా ఆ సంస్థలను నడిపించారో అర్థం చేసుకోవచ్చు. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా పోరాటపటిమ వదిలిపెట్టలేదు. అది మా అందరికీ స్ఫూర్తిదాయకం.

రామ్మోహన్‌నాయుడు


ఆయన ఒక లెజెండ్‌. ఒక పోరాటయోధుడు. ఏపీలో దుర్మార్గపాలనను ఓడించాలన్న తపనతో ప్రజల కోసం పోరాటం చేశారు. ఈనాడు, ఈటీవీ ద్వారా ప్రముఖపాత్ర పోషించారు. ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత.. తన పోరాటం ఫలించిందని, ఇక పని పూర్తయిందని అనుకున్నారో ఏమో. అందుకే ఆయనను మనం కోల్పోయాం. సమాజానికి తీరని లోటు ఏర్పడింది. 

ఎం.శ్రీభరత్‌


నేనీ స్థాయిలో ఉన్నానంటే ఆయన స్ఫూర్తే కారణం. ఎంతోమంది యువకులకు మార్గదర్శకులుగా ఉన్నారు. జర్నలిజంలోనే కొత్త ఒరవడి తీసుకొచ్చిన వ్యక్తి. ఈనాడు ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లారు. ఎంతోమందికి జీవనోపాధి చూపారు. మచ్చలేని వ్యక్తి. ఎన్నికలకు ముందు, ఫలితాలు వచ్చేముందు కూడా మాట్లాడాను. మిషన్‌ పూర్తయింది. విజయం సాధించాం అన్నారు. కానీ, ఆ తర్వాతిరోజే ఆస్పత్రిలో చేరి, మనకు లేకుండా పోవడం దురదృష్టకరం.

కంభంపాటి రామ్మోహన్‌రావు


లక్షలమందికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి. ఎదిగిన ప్రతి మెట్టూ ఉన్నత విలువలతో కూడుకున్నది. సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి. ఎప్పుడు కలిసినా యువతకు స్ఫూర్తిదాయకమైన సందేశాలను ఇచ్చేవారు. తెలుగుజాతి ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. 

ఏలూరి సాంబశివరావు


రామోజీ ఫౌండేషన్‌ ద్వారా పెదపారుపూడికి రూ.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దేశంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఫౌండేషన్‌ ద్వారా సేవలు అందించారు. మార్గదర్శి ఎన్నో పేద కుటుంబాలకు వెలుగునిచ్చింది. ఈనాడు పత్రిక జాతీయస్థాయిలో అక్షరవిప్లవాన్ని తీసుకొచ్చింది. ఏ రంగంలోనైనా రామోజీరావు ఆయనకు ఆయనే సాటి.

దేవినేని ఉమామహేశ్వరరావు 


చెమ్మగిల్లిన కళ్లతో రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వీరంతా కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేట ఆదర్శ ఆశ్రమంలోని వృద్ధులు. గతంలో ఈ ఆశ్రమానికి రామోజీరావు ఇన్వర్టర్, బాటరీ సౌకర్యం కల్పించినట్లు వారు గుర్తుచేసుకున్నారు. 


తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు 

నక్కా ఆనంద్‌బాబు

పత్రిక, టీవీ, సినీ రంగాల్లో రామోజీరావు తనదైన ముద్ర వేశారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం.


రామోజీరావు మరణం తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు. తెలుగు భాష సాహిత్యాభివృద్ధికి విపుల, చతుర, తెలుగు వెలుగు వంటి పత్రికలను తీసుకొచ్చి కవులు, రచయితలు, సాహిత్యాభిమానుల మనసుల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కొత్తగా రాస్తున్న ఎంతో మంది కవులు రామోజీ స్థాపించిన పత్రికల ద్వారానే పరిచయం అయ్యారు. ఆయన మరణం తెలుగు సాహిత్య సమాజానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. 

కెంగార మోహన్, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు

కె.సత్యరంజన్, సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు

వర్ల రామయ్య

రామోజీరావు అనే పేరు తెలుగువారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. మొదటి నుంచీ ఆధునిక భావాలతో ప్రపంచీకరణకు కృషి చేసిన మహానుభావుడు. కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి, నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు.


ప్రజాశ్రేయస్సు కోసం పరితపించేవారు

పంచుమర్తి అనురాధ

ప్రజాశ్రేయస్సు కోసం రామోజీరావు నిరంతరం తపించేవారు. ఈనాడులో ప్రచురితమయ్యే ప్రతి అక్షరం బడుగు బలహీన వర్గాలకు రక్షణగా నిలిచింది. విలువలతో కూడిన వ్యవస్థల్ని, ప్రజల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చే వ్యాపార సంస్థల్ని ఆయన స్థాపించారు.


జనహితమే ఆయన అభిమతం

వేపాడ చిరంజీవిరావు

ఆయన ప్రజాపక్షపాతి. జనహితమే ఆయన అభిమతం. స్వయం కృషితో అత్యున్నత స్థితికి చేరి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు.


‘ముందడుగు’తో స.హ.చట్టంపై ప్రజా చైతన్యం

- న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు

సమాచార హక్కు చట్టం గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఎంత వ్యయమైనా ఆలోచించని దార్శనికుడు రామోజీరావు అని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ‘ఈనాడు’ నిర్వహించిన ‘ముందడుగు’ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రంలో రీసోర్స్‌ పర్సన్‌గా కొనసాగే అవకాశాన్ని ఆయన తనకు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రామోజీరావుకు ఆయన నివాళి అర్పించారు.


తెలుగు జాతికి మార్గదర్శకులు 

- ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు

కొన్ని దశాబ్దాలపాటు తెలుగు భాష కోసం.. తెలుగు ప్రజల కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారు. తెలుగు జాతికి మార్గదర్శకుడిగా నిలిచారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేసిన మహనీయుడు. 


ప్రజా చైతన్యానికి దోహదం

- ఈశ్వరయ్య, కేవీవీప్రసాద్, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు 

అక్షర యోధుడిగా జర్నలిజానికే వన్నెతెచ్చిన మేధావి రామోజీరావు. ఈనాడు పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన పాత్ర ఎనలేనిది. తెలుగు చరిత్రలో ఎప్పటికీ చెదిరిపోని సంతకం ఆయనది.


మద్య నిషేధ ఉద్యమంలో ఆయన తోడ్పాటు మరువలేనిది

- గేయానంద్, రామారావు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

మద్య నిషేధ ఉద్యమంలో జనవిజ్ఞాన వేదికకు రామోజీరావు అందించిన తోడ్పాటు మరువలేనిది. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభ విజయనగరంలో జరిగినప్పుడు ఆయనే ముఖ్యఅతిథిగా వచ్చి ప్రసంగించారు. తెలుగువారి సామాజిక, రాజకీయ రంగాలను అన్ని విధాలుగా ప్రభావితం చేశారు. 


తెలుగు భాష వ్యాప్తికి కృషి

- గుంటుపల్లి శ్రీనివాస్, సామాజికవేత్త 

తెలుగు భాష వ్యాప్తి, ఆధునికీకరణ కోసం ఆయన చేసిన కృషిని తెలుగుజాతి ఎప్పటికి మర్చిపోదు. సాధారణ రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. నియంతృత్వ ప్రభుత్వాలకు తలవంచకుండా ఎదురునిలబడి పోరాడారు.


రామోజీరావు జీవితం నేటి యువతరానికి స్ఫూర్తి

- ఫరూక్‌ షిబ్లీ, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు 

రామోజీరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. స్వయంకృషితో అనేక రంగాల్లో విజయం సాధించారు.


నిబద్ధతకు నిలువెత్తు రూపం

- టి.మనోహర్‌నాయుడు, విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ

నిబద్ధతకు నిలువెత్తు రూపం రామోజీరావు. తెలుగు ప్రజలకు మార్గదర్శిగా నిలిచిన అక్షర యోధుడు. తెలుగు వర్ణమాలను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు.


భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి 

- డాక్టర్‌ చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి 

దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించిన రామోజీరావు.. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిలింసిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. 


తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటారు

- కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

‘క్రమశిక్షణ, శ్రమించేతత్వం, దార్శనికతతో తెలుగువారి కీర్తిని రామోజీరావు ప్రపంచానికి చాటారు. పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.


అక్షర జ్ఞానంలో సంపన్నులు

- బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ

రామోజీరావు అక్షర జ్ఞానంలో సంపన్నులు. ఈనాడు, ఈటీవీ, ప్రియా పచ్చళ్లు, ఉషాకిరణ్‌ మూవీస్, రామోజీ ఫిల్మ్‌ సిటీ తదితర సంస్థల అధినేతగా తనదైన ముద్ర వేశారు. టెలివిజన్‌ రంగంలో రారాజుగా వెలుగొందారు. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటు.


ఈనాడు పత్రిక ప్రారంభించి రామోజీరావు తెలుగునాట సంచలనం సృష్టించారు. చెడుపై యుద్ధం చేసి నిరంతరం ప్రజలకు అండగా నిలిచారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా వేలమంది జర్నలిస్టులను తయారుచేసి మంచికి స్థానం కల్పించిన మీడియా మొఘల్‌ ఆయన.

- ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్‌


రామోజీరావుకు ఘన నివాళి అర్పించండి 

పార్టీ శ్రేణులకు తెదేపా అధిష్ఠానం పిలుపు 

ఈనాడు డిజిటల్, అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి నేపథ్యంలో గ్రామ గ్రామాన సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలూ పాల్గొనేలా చూడాలని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.


తెదేపా కార్యాలయంలో నేతల నివాళులు

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు.. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈనాడు ద్వారా తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, పల్లె రఘునాథ్‌రెడ్డి, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బుచ్చిరాంప్రసాద్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

  • గుంటూరు మిర్చియార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, తెదేపా అధికార ప్రతినిధులు గురజాల మాల్యాద్రి, ఆనం వెంకటరమణారెడ్డి, మీడియా కోఆర్డినేటర్‌ సతీష్‌ తదితరులు రామోజీరావు మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దుబాయ్‌లో రామోజీరావుకు నివాళి

దుబాయ్‌లో రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించిన తెలుగువారు

ఈనాడు డిజిటల్, అమరావతి: రామోజీరావు మృతి పట్ల దుబాయ్‌లోని తెలుగువారు సంతాపం ప్రకటించారు. పత్రికాధిపతిగా, రామోజీ ఫిల్మ్‌ సిటీ రూపశిల్పిగా ఆయన సేవలను కొనియాడారు. దుబాయ్‌లోని తెలుగు రెస్టారెంట్‌లో శనివారం జరిగిన సంతాప కార్యక్రమంలో రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని