పనిచేయడంలోనే నాకు విశ్రాంతి

దార్శనికుడు. సాహసికుడు. అన్నింటికీ మించి కార్యసాధకుడు. అనునిత్యం లక్షల మందిని ప్రభావితం చేస్తున్న కృషీవలుడు.

Updated : 09 Jun 2024 08:55 IST

దార్శనికుడు. సాహసికుడు. అన్నింటికీ మించి కార్యసాధకుడు. అనునిత్యం లక్షల మందిని ప్రభావితం చేస్తున్న కృషీవలుడు. ఆయనే ఈనాడును ఇంటిపేరుగా మార్చుకున్న రామోజీరావు. జర్నలిస్టుల్లో జర్నలిస్టుగా, పారిశ్రామికవేత్తల్లో పారిశ్రామికవేత్తగా, సినీ ప్రముఖుల్లో సినీ ప్రముఖునిగా ఆయన పాత్ర బహుముఖం. ప్రతిభ అనంతం.

ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం.. దాన్ని సాధించడం; మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం.. దాన్నీ సాధించడం.. ఇదే దశాబ్దాలుగా రామోజీ జీవనక్రమం. దేవుణ్ని గుడిలో కాక పనిలో చూసే ఆయనకు విశ్రాంతి తీసుకోవడమే ‘కష్టమైన పని’. రోజూ 18 గంటలు పనిచేసినా అలసిపోని ఆయన మనసు, శరీరం అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయి. ఆయనకు అంత అపరిమితమైన శక్తిసామర్థ్యాలు, మేధస్సు ఎక్కడివా అని అందరూ విస్తుపోతారు. ఆయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అణువణువునా ఆత్మవిశ్వాసం పుణికిపుచ్చుకున్న ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? వివిధ అంశాలపై ఆయన అంతరంగం ఏమిటి? వ్యక్తిగత అలవాట్లు - అభిరుచులు ఎలా ఉంటాయి? అనే అంశాలపై పాతికేళ్ల కిందట .. ఈనాడు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఛైర్మన్‌తో జరిపిన ఇంటర్వ్యూలో వీటన్నింటికీ సమాధానం లభించింది. ఆయన విలక్షణ వ్యక్తిత్వం ఆవిష్కృతమైంది. వ్యక్తిగత విషయాలపై ఆయన ఎప్పుడూ సంభాషించనంత విపులంగా ఈ ముఖాముఖిలో చర్చించారు. పాఠకుల కోసం.. ఆ ముఖాముఖి మరోసారి.. 

క్రమశిక్షణకు మారుపేరని మిమ్మల్ని అందరూ ప్రశంసిస్తారు. ఇంతటి క్రమశిక్షణ మీకెలా అలవడింది? 

ఏ వ్యాపారంలోనైనా క్రమశిక్షణ అనేది అన్నింటికన్నా ముఖ్యం. సంస్థ పెద్దగా నేను క్రమశిక్షణ పాటిస్తేనే మిగతావాళ్లు అనుసరిస్తారు. క్రమశిక్షణ వల్ల నేను పొందిన ప్రయోజనం నాకు స్ఫూర్తి ఏ ఒక్కరో అని ప్రత్యేకంగా చెప్పలేను. నా చుట్టూ ఉన్న ప్రపంచమే ఒక పెద్ద పాఠశాల. మంచి ఎక్కడ కనిపించినా తీసుకొంటాను. ఒకరిద్దరి వ్యక్తుల నుంచి కాక మొత్తం సమాజం నుంచే నేను స్ఫూర్తి పొందాను.

సంఘంలో పేరుప్రతిష్ఠలను, డబ్బును సంపాదించారు. హాయిగా సుఖసంతోషాలతో గడపాలని మీకనిపించదా?

హాయి అనేది ఒక మానసిక స్థితి. హాయిగా ఉండటానికి డబ్బు అవసరమే కానీ డబ్బుతోనే సుఖసంతోషాలు లభిస్తాయనుకోవడం భ్రమ. జీవితాన్ని ప్రతిక్షణం సద్వినియోగం చేయడంలోనే నాకు ఆనందం. ఒక దశ దాటిన తరువాత డబ్బుకు విలువ లేదు. ఆ దశకు నేనెప్పుడో చేరుకున్నాను.

యుక్తవయుసులో మీరు కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. ఆ  ప్రభావం ఇప్పుడు మీపై ఏమైనా ఉన్నదా? కమ్యూనిస్టు అభిమానిగా మీరు పొందిన ప్రాపంచిక అనుభవం పత్రికా నిర్వహణలోనూ, ఇతర వ్యాపారాల్లోనూ ఏమైనా ఉపయోగపడిందా?

పదిహేనేళ్ల వయసులో కమ్యూనిజం పట్ల ప్రభావితుణ్నయ్యాను. నేను ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కార్డ్‌ హోల్డర్‌ను కూడా. ఆనాడు ఉద్యమంలో ఉన్న అనేకమందిలో సేవాభావం, త్యాగనిరతి, క్రమశిక్షణ, తెగింపు, దృడవైఖరి, సచ్ఛీలత తదితర లక్షణాలను చూసి ఆ ఉద్యమం పట్ల ఆకర్షితుణ్నయ్యాను. అంతేతప్ప సిద్ధాంతాలను జీర్ణించుకొని కాదు. నేను మెచ్చిన ఆ లక్షణాలను ఎంతో కొంత నా జీవితంలో భాగం చేసుకోవాలని ప్రయత్నించాను. నేను జీర్ణించుకోగలిగిన మేరకు నాకవి ఉపయోగపడ్డాయనే అనుకొంటున్నాను. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత - పరస్పర శీలహనన కార్యక్రమం, బురద జల్లుకొన్న తీరు చూసి అయిష్టత ఏర్పడింది. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో చోటుచేసుకున్న మార్పులు, ఉద్యమ నేతల్లో మంకుపట్టు, ఎవరితోనైనా విభేదిస్తే వాళ్లను నాశనం చేసేయాలన్న ధోరణుల కారణంగా కమ్యూనిస్టు పార్టీకి దూరమయ్యాను. సిద్ధాంతపరంగా కూడా కమ్యూనిజానికి కాలదోషం పడుతున్నట్లు భావించాను.

ఏ వ్యాపారం చేసినా మీరు ఎవర్నీ భాగస్వాములుగా ఎంచుకోరు. షేర్‌మార్కెట్‌ బాగా ఉన్న రోజుల్లో కూడా షేర్ల రూపంలో మీరు ప్రజల నుంచి డబ్బు సేకరించలేదు. దీని వెనుక ఏదైనా ఫిలాసఫీ ఉందా?

వ్యాపారంలో విజయవంతంగా నడిచిన భాగస్వామ్యాలు తక్కువ. ఎక్కువ భాగం వైఫల్యాలే. నా శక్తి మేరకు నేను వ్యాపారం చేసుకొందామనుకునేదే మొదటి నుంచీ నా దృక్పథం. ఏ వ్యాపారమైనా నా వల్ల ఎవరికీ నష్టం జరగకూడదనే షేర్ల రూపేణా వసూళ్లకు పోను. షేర్ల వల్ల అందరూ నష్టపోయారని కాదు. నాకిష్టం ఉండదు. అంతే! ఒకే ఒక్కసారి - డాల్ఫిన్‌ విషయంలో పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లాం. ఇక ఆ తరువాత అటువైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా.

మీకు ఎన్ని కార్యకలాపాలు, వ్యాపారులున్నా ఎక్కువ సమయం ఈనాడుకే కేటాయిస్తారు కదా! కారణమేమిటి? అవసరమా-అభిరుచా?

అందులో నాకు ఆత్మానందం కలుగుతుంది. ‘ఈనాడు’ ద్వారా సమాజానికి ఎంత ప్రయోజనం జరుగుతుందో నాకు అవగాహన ఉంది కాబట్టి - అది ఎంత బాగా చేస్తే నాకు అంత ఆనందం. ఆ మేరకు ప్రయత్నం చేస్తాను. నా దృష్టిలో మిగతావన్నీ వ్యాపారాలు - ‘ఈనాడు’ కాదు!

ఈనాడు నంబర్‌వన్‌ అవుతుందని, జాతీయస్థాయిలోనూ రికార్డులు స్థాపిస్తుందని పత్రిక  ప్రారంభించినప్పుడు ఊహించారా? మొదట్లో మీకలాంటి ఆశయాలున్నాయా?

నాలో ఉన్న బలహీనత - నంబర్‌ 2గా ఉండటం ఇష్టపడకపోవడం. ‘ఈనాడు’కన్నా ముందు కూడా కొన్ని వ్యాపారాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధించాను. ఆంధ్రప్రదేశ్‌లో ‘ఈనాడు’ నం.1 కావాలనే ఆశయంతోనే ప్రారంభించాను. విశాఖపట్నం, ఆ తర్వాత తిరుపతి, హైదరాబాద్, విజయవాడల్లో వరుసగా ప్రచురణ కేంద్రాలు ప్రారంభించాలన్నదే మా మొదటి ప్రణాళిక. విజయవాడ అప్పట్లో తెలుగు పత్రికల రాజధానిగా ఉండేది. అక్కడ పోటీని తట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంతో చివరగా వెళ్లాలనుకున్నాం. విశాఖలో పత్రిక ప్రారంభించాక ప్రణాళికను మార్చుకున్నాం. రాష్ట్ర రాజధానిలో ఎడిషన్‌ ఉండడం అవసరమనిపించి రెండో యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాం. నంబర్‌-1 స్థానాన్ని చేరుకోగలమన్న విశ్వాసం కలగడంతో 1978 మే 1న విజయవాడ ఎడిషన్‌ మొదలుపెట్టాం. ఆరోజే ఈనాడు నంబర్‌-1 దినపత్రిక అయింది. సర్క్యులేషన్‌ కూడా లక్ష దాటింది. అయితే జాతీయస్థాయిలోనూ ఈనాడు రికార్డులు సృష్టిస్తుందని మొదట్లో ఊహించలేదు.

పత్రిక గొప్పతనాన్ని వెల్లడించేది ఆ పత్రిక సర్క్యులేషనా? లేక పాఠకులకు తనవెంట నడిపించుకువెళ్లగలిగే శక్తా?

రెండూనూ. ఈ రెంటికి పరస్పర సంబంధముంది. ప్రజల ప్రయోజనాల పట్ల కనబరచే నిబద్ధత వల్లగానీ అనేక పరీక్షలకు గురై నిగ్గుతేలడం వల్లగానీ ఈనాడు ప్రజాభిమానం పొందింది. ప్రజల మనసులలో తనకొక సుస్థిర స్థానాన్ని పొందగలిగింది. సహజంగానే సర్క్యులేషన్‌ పెరిగింది. ఏ పత్రికైనా పాఠకులను తనవెంట తీసుకువెళ్లగలదనుకోవడం తప్పుడు అవగాహన. ఈనాడుతో కొన్ని వర్గాలు విభేదించిన సందర్భాలున్నాయి. ఈనాడు చేసిన దానిలో స్వార్ధం ఏమీలేదని గుర్తించాక మళ్లీ అభిమానించిన ఊదాహరణలూ ఉన్నాయి. ఈనాడు నేడిలా ఉండటానికి ప్రజల శక్తే కారణం.

ఉదయం, వార్త దినపత్రికలు భారీస్థాయిలో ప్రారంభమైనప్పుడు కానీ, ఇంకెప్పుడైనా కానీ పోటీ అని భావించారా? ఇతర పత్రికల కారణంగా మీరెప్పుడైనా ఒత్తిడికి గురయ్యారా?

లేదు. ఎప్పుడూ లేదు. ఒక పత్రికగా ‘ఈనాడు’ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని కోరుకోవడం నా స్వార్థం. పోటీ ఉండకూడదనుకోవడం కేవలం అజ్ఞానమే. పోటీ పరిస్థితులను సంబాళించడం - దాన్ని దృష్టిలో పెట్టుకోవడం ప్రాప్తకాలజ్ఞత. సమయం సందర్భాన్ని బట్టి, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాను. 

ఏదైనా సంఘటనను లేదా పరిణామాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, సొంత వ్యాఖ్యలు జోడించి ఇవ్వడం ద్వారా (వార్తలను కూడా) ప్రజలను ప్రభావితం చేసేందుకు ఈనాడు ప్రయత్నిస్తుందనే విమర్శలు అక్కడక్కడా విన్పిస్తుంటాయి. దీనికి మీ స్పందన?

వ్యాఖ్యానంతో కూడిన పత్రికా రచన  (interpretative journalism)   ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతి. ప్రజాప్రయోజనాన్ని ఆశించి మాత్రమే వ్యాఖ్యలు జోడించడంలో తప్పేమీ లేదు. ప్రజల విచక్షణ, జ్ఞానం, శక్తి - వీటినిబట్టి వ్యాఖ్యల ప్రభావం ఉంటుంది. అంతేతప్ప కేవలం వార్తలతోనే జనం ప్రభావితం అవుతారని నేను నమ్మను.

దాదాపు మీరు నిర్వహిస్తున్న వ్యాపారాలన్నీ సేవల రంగానికి సంబంధించినవే. మీలాంటివారు పెద్దపెద్ద పరిశ్రమలు లేదా పవర్‌ ప్రాజెక్టుల వైపు వెళ్లాల్సిందని బయటి వ్యక్తులు చాలామంది (ప్రముఖులు కూడా) వ్యాఖ్యానిస్తుంటారు. మీరు సేవల రంగం మీదే దృష్టి సారించడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? 

మొదట్లో పెద్దపెద్ద పరిశ్రమలు పెట్టే స్థోమత నాకూ లేదు. నా పరిమితుల్లో కొన్నింటిని ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకున్నాను. వాటిని ఒక రూపానికి తెచ్చాను. స్వామికార్యం - స్వకార్యం రెండూ నెరవేరాలన్నది నా పద్ధతి. నాతోపాటు పదిమందికీ ప్రయోజనం చేకూర్చగలిగేవాటినే ఎంచుకున్నాను. ఇప్పుడు భారీ పరిశ్రమలు, పవర్‌ ప్రాజెక్టులు ప్రారంభించే శక్తి ఉన్నా - నాకు ఆసక్తి లేదు.

వ్యక్తులుగా ఎవరు ఎలాంటివారైనా ఒకసారి ఈనాడులో చేరితే ఒళ్లు వంచి పనిచేస్తారు. ఈ వర్క్‌ కల్చర్‌ను మీరు ఎలా సాధించారు?

నేను ఒళ్లు వంచి పనిచేయడం ద్వారా కేవలం ఉద్యోగం కోసం వచ్చినట్లుగా కాకుండా - మనం చేస్తున్నది ఎంతో ముఖ్యమైన పనని గుర్తింపజేయడం ద్వారా జీవితం ప్రారంభదశలో ఉన్నవాళ్లను తీసుకుని వారిని తీర్చిదిద్దుకోవడం దీర్ఘకాలంలో సంస్థకు ప్రయోజనమని నేను నమ్ముతాను. సిబ్బంది నియామకంలో కూడా నేను సకల జాగ్రత్తలు తీసుకుంటాను. ఇది సొంత సంస్థ అన్న భావన కలగజేయడానికి ప్రయత్నిస్తాను. సిబ్బందితో నిరంతరం సంబంధాలు కలిగి వారిని కర్తవ్యోన్ముఖుల్ని చేయడం నా ఆచరణ విధానం. అన్నింటికీ మించి ఒక సిస్టమ్‌ ఏర్పాటుచేయడం ఈ వర్క్‌ కల్చర్‌కు దోహదపడింది.

‘‘రామోజీరావు గారు పట్టిందల్లా బంగారం’’ అని అందరూ అంటారు. మీ విజయ రహస్యం ఏమిటి?

పని.. పని.. పని.. కష్టపడి పనిచేయడమొక్కటే....

మీరు నమ్మే మేనేజ్‌మెంట్‌ థియరీ?

పారదర్శకత, కలిసి పనిచేయడం, విలువల వ్యవస్థ.

మీరు మంచి ఆర్టిస్టని, బొమ్మలు బాగా వేస్తారని సుమన్‌గారు దూరదర్శన్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలో ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జ్ఞాపకశక్తిని ప్రదర్శించే అనేక ప్రక్రియలు చేసేవారని మీ సమకాలికులు చెబుతారు. సరదాకు, సంతోషానికి అయినా ఇప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్లరా?

ఆ సరదాకి, సంతోషానికి ఇప్పుడు సమయమేది? నాపనే నాకు ఆనందం. సంతోషమంటే అది ఒక మానసిక స్థితిని ఇంతకు ముందే చేప్పాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిలో ఆనందం లభిస్తుంది.

మీ ఆరోగ్యమెప్పుడూ మీ అదుపాజ్ఞలో ఉంటుంది. విల్‌పవర్‌ వల్లే ఇది సాధ్యమైందా?

మనందరిలోనూ అపరిమితమైన శక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడంలోనే అంతా ఉంది. మనకేం కావాలో, ఏం వద్దో మన శరీరమే చెబుతుంది. గ్రహించగలిగే శక్తి మనకు ఉంటే ఆ ప్రకారం నడుచుకుంటే అంతా సవ్యంగానే ఉంటుంది. నేనెప్పుడూ ఆకలితో నాశరీరాన్ని మాడ్చను. నేను భోజన ప్రియుణ్ని. అన్నీకాదు - కొన్నింటిని అదుపులో పెట్టడం ద్వారా నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. చల్లని నీరు తాగను. ఐస్‌క్రీమ్‌ తినను. అవి నా ఒంటికి సరిపడవు. ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా గంటసేపు నడుస్తాను. ఇదివరకైతే గంటన్నర, రెండు గంటలు కూడా నడిచేవాణ్ని. ఇది కూడా నా ఆరోగ్యాన్ని కాపాడుతోంది. విల్‌పవర్‌ కూడా ఒక ప్రధాన కారణం.

మిమ్మల్ని మీరు ఎలా అభివర్ణించుకోవడానికి ఇష్టపడతారు? పత్రికాధిపతిగానా?  వ్యాపారవేత్తగానా? స్టూడియో అధినేతగానా?

ఏదీకాదు. అవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు. వాటి ద్వారా ‘నేనిది’ అనిపించుకోవడం ఇష్టం ఉండదు.

ఈ రాజకీయ నాయకులపై ఆగ్రహం కలిగినప్పుడు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ప్రజాసేవ   చేయాలని అనిపిస్తుంటుందా?

ప్రత్యక్ష రాజకీయాలు నా తత్వానికి సరిపడవు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు ఒక్కటే మార్గం అనుకోను. నేను చేస్తున్న దానిలోనూ ప్రజాసేవ ఉంది. నేటి క్షీణ రాజకీయ విలువల్లో నేను ఇమడగలనన్న నమ్మకం నాకులేదు. ఇవాళ్టి రాజకీయాల్లో సిన్సియారిటీ లేదు. సేవాభావం లేదు. స్వార్థమే రాజ్యమేలుతోంది. 

‘‘నా జీవితపు క్యాండిల్‌ని అటూఇటూ కూడా కాల్చేశానని’’ మీరు అంటుంటారు. ఇంత డ్రైవ్‌ మీలో ఎక్కడిది? ప్రేరణ ఏమిటి?

ఏదైనా పని ఒకసారి మొదలుపెడితే దాన్ని పూర్తిచేసినప్పుడే ఆపేది. ఏదైనా సరే, మధ్యలో వదిలిపెట్టను. అది నా స్వభావం. ప్రేరణ అదే. నన్ను నడిపంచే శక్తీ అదే. ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అన్న తపన నాలో చిన్నతనం నుంచీ ఉంది.


రాజకీయంగా అతి శక్తిమంతులైన చెన్నారెడ్డి, ఇందిరాగాంధీ వంటి వారిపై ఉద్యమస్థాయిలో అనేక ప్రతికూల వార్తలు రాసి ఎలా తట్టుకుని నిలబడగలిగారు? ఆ శక్తి మీకు ఎలా వచ్చింది?

చెన్నారెడ్డి, ఇందిరాగాంధీలపై ‘ప్రతికూల వార్తలు’ రాశామనడం సబబు కాదు. నియంతృత్వం, అప్రజాస్వామిక పద్ధతులతో కూడిన ఆనాటి వ్యవస్థకు వాళ్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రజలకు అది ఇష్టం ఉండదు. కాబట్టి ప్రజాభిప్రాయానికి ఒక రూపం కల్పించింది ‘ఈనాడు’. అంతేతప్ప వ్యక్తుల పట్ల శత్రుభావం లేదు. స్వార్థబుద్ధి, దేశమేమైనా పరవాలేదనుకునే ధోరణులకు వ్యతిరేకంగా ఈనాడు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించింది. దేశంలో పార్టీ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇందిర అందరూ తన అడుగులకు మడుగులొత్తాలనుకున్నారు. తనను ఎదిరించిన వారిని అణచివేయాలని చూశారు. ఇదంతా కేవలం తన అధికారం కోసం దాని తాలూకు దుష్ఫలితాలు దేశంపై పడి పార్టీ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయి గందరగోళం ఏర్పడ్డా పట్టించుకోనంత, లెక్కచేయనంత స్వార్థం.. ఇన్ని రాష్ట్రాలు, జాతులు, సంస్కృతులు, భాషలు కలిగిన ఇలాంటి దేశం విచ్ఛిన్నమైపోతే మిగిలేది అరాచకమే. కేంద్రీకృత అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలి. ప్రతి రాష్ట్రం స్వయంసమృద్ధం కావాలి. కేంద్రంలో సమాఖ్యగా అవతరించాలి. అదే ఆచరణలో నిజం కావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని