అన్నదాతా! సుఖీభవ

‘‘నేను రైతుబిడ్డను. వ్యవసాయానికి ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునేందుకు నేను ఎంచుకున్న మార్గం అన్నదాత’’.. అని కర్షకుల ప్రస్తావన వచ్చినప్పుడు రామోజీరావు చెప్పేవారు.

Updated : 09 Jun 2024 08:16 IST

ఇదే రైతుబిడ్డ రామోజీరావు సంకల్పం

‘‘నేను రైతుబిడ్డను. వ్యవసాయానికి ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునేందుకు నేను ఎంచుకున్న మార్గం అన్నదాత’’.. అని కర్షకుల ప్రస్తావన వచ్చినప్పుడు రామోజీరావు చెప్పేవారు. ఈ మాటలకు ఆయన కడవరకు కట్టుబడి ఉన్నారు. అన్నదాతకు కొండంత అండగా నిలిచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. మాధ్యమం ఏదైనా ఆయన ప్రాథమ్యం రైతు సంక్షేమమే. నాటి ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి ‘జైకిసాన్‌’ అని నినదిస్తే.. దాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి రామోజీరావు. 

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబిడ్డగా పుట్టిన రామోజీరావు ‘‘అన్నదాతా! సుఖీభవ’’ అనే మాటను నినాదాలకే పరిమితం చేయలేదు. ఆరుగాలం కష్టపడే కర్షకుల ఇంట సిరులపంట పండించాలన్న సంకల్పంతో అక్షరసేద్యం చేశారు. అన్నదాత, ఈనాడు, ఈటీవీ.. ఇలా వేర్వేరు మాధ్యమాల ద్వారా వ్యవసాయదారుల సాధికారతకు, సంక్షేమానికి తన వంతు కృషి చేశారు. 1969లో ‘అన్నదాత’ మాసపత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’లో రైతేరాజు, ఈటీవీలో అన్నదాత, ఈటీవీ-2లో జైకిసాన్‌.. ఇలా పలు కార్యక్రమాలతో రైతుల పక్షపాతిగా కొనసాగారు. ‘అన్నదాత’ వ్యవసాయ పరిజ్ఞానాన్ని కూలంకషంగా అందించగా.. వ్యవసాయ ఉత్పత్తులను లాభసాటిగా అమ్ముకోవడంలో ‘జైకిసాన్‌’ రైతులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈనాడులోని ‘రైతేరాజు’ శీర్షిక ఒకరకంగా రైతన్నల వేదం. ఇలా రైతులకు రామోజీరావు సమర్పించిన అక్షర సుమాలు ఒక్కొక్కటీ చరిత్ర సృష్టించి, కష్టజీవుల రుణం తీర్చుకొంటూ వచ్చాయి. 

 • తెలుగు రైతులకు ఆచరించదగిన సూచనలు చేసే మార్గదర్శిగా నిలిచింది ‘అన్నదాత’. ఆయా సీజన్లలో, నెలల్లో సాగుకు ఉపయోగపడే, ఆచరణసాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక నెల ముందుగానే అందజేసేది. ఉత్తరాలు, ఫోన్‌కాల్స్‌ ద్వారా రైతులు అడిగిన సందేహాలను శాస్త్రవేత్తల సహకారంతో నివృత్తి చేసేది. పశుపోషకుల పరిజ్ఞానాన్ని పెంపొందించడంలోనూ అన్నదాత సహకారం ఎంతో! 1995లో మరో అడుగు ముందుకేసి, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఈటీవీ ద్వారా అన్నదాత కార్యక్రమ ప్రసారాలను ప్రారంభించి కొత్తచరిత్రకు శ్రీకారం చుట్టారు. రైతులకు పంటల సాగుపై సమస్త సమాచారాన్ని అందించడం ద్వారా ‘అన్నదాత’ ఒక విప్లవమే తెచ్చింది. సాగుకు సంబంధించి అన్నిరకాల మెలకువల్ని ప్రత్యేకంగా చూసి ఎందరో రైతులు సేద్యంలో పురోగమించారు. ఈటీవీ ప్రాంతీయ భాషా ఛానళ్ల ద్వారా అన్నదాత కార్యక్రమం దేశంలో ఎందరో రైతులకు మార్గదర్శిగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో ప్రారంభించిన మరో వ్యవసాయ కార్యక్రమం ‘జైకిసాన్‌’ రూపకల్పనా ఒక సంచలనమే. పంటల సాగుకు సంబంధించిన సూచనలకు అన్నదాత కేంద్రమైతే.. రైతు సమస్యలు, ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్‌ సమస్యలు, వాటి పరిష్కారాలను సూచించడానికి ‘జైకిసాన్‌’ వేదికగా నిలిచింది. దేశంలో టీవీ మాధ్యమం ద్వారా ఈ రెండు కార్యక్రమాలు రైతులకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయని అంతర్జాతీయ వేదికపై కొందరు నిపుణులు పరిశోధనా పత్రాలు సమర్పించడం రామోజీరావు కృషికి సరైన గుర్తింపు. 
 • రామోజీరావు దృష్టిలో రైతు ఎప్పుడూ రాజే. అందుకే 1974లో ‘ఈనాడు’ దినపత్రిక ప్రారంభించిన తరవాత కొన్నాళ్లకు ‘రైతేరాజు’ పేరుతో ప్రత్యేక కాలమ్‌ ప్రవేశపెట్టారు. ప్రతిరోజూ రాష్ట్రంలోని రైతులకు సకాలంలో లభించవలసిన శాస్త్రీయ సమాచారం, సలహాలను అత్యంత ప్రజాదరణ గల పత్రిక ద్వారా అందించాలనే ఆకాంక్షతో రూపుదిద్దుకున్నదే ఈ శీర్షిక. రాష్ట్రంలోని పాడిపంటలు, అనుబంధ వృత్తులు, కార్యక్రమాలు, రైతుల స్థితిగతుల్లో ఉన్న వైవిధ్యానికనుగుణంగా ఆయా ప్రాంతాలకు సకాలంలో అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించాలన్నదే ఆయన సంకల్పం. 
 • అన్నదాతల సంక్షేమం గురించి రామోజీరావు ఆలోచనలు ఇంతటితో ఆగిపోలేదు. కష్టపడి పనిచేయడం, దేవునిపై భారం వేయడం తప్ప పోరాటాలు తెలియని కర్షకుల గొంతుకగా నిలిచారు. నకిలీ విత్తనాల మోసాలు, దళారుల దందాలతో అన్నదాతకు జరుగుతున్న అన్యాయంపై ఈనాడు, ఈటీవీ ద్వారా గళమెత్తారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయి, సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్న రైతులను సర్కారీ వ్యవస్థలకన్నా ముందే వెళ్లి పలకరించి భరోసా కల్పించారు. కరవు కాటకాలు, తుపానుల సందర్భంగా రైతులకు జరిగిన నష్టాన్ని పాలకుల కళ్లకు కట్టేలా చూపించి.. పరిహారం దక్కేలా చూడటంలో తన వంతు కృషి చేశారు. ఇలా ప్రతి దశలోనూ రైతు అభ్యున్నతి కోసం పరితపించి, పనిచేసిన రామోజీరావు తెలుగురైతుల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  ap-districts
  ts-districts

  సుఖీభవ

  చదువు