‘సమాజ హితైషి..’ ప్రజల మేలుకోరే మనీషి

సమాజ హితైషి రామోజీరావు. ప్రజల మేలు కోసం నిత్యం పరితపించేవారు. ప్రజలకు ఈనాడు పత్రిక ద్వారా యథార్థ సమాచారాన్ని అందించడంతోపాటు సమాజానికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాను అంటూ ముందు నిలిచేవారు.

Updated : 09 Jun 2024 08:18 IST

ఆపదవస్తే కదిలేది.. కదిలించేది ఆయనే
ఆపన్నులకు అండగా రామోజీరావు

ఇది తెలంగాణలోని ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామంలో రామోజీ ఫౌండేషన్‌ ద్వారా రూ.కోట్లు వెచ్చించి సకల వసతులతో కార్పొరేట్‌ స్థాయిలో నిర్మించిన జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 2019లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దీన్ని ప్రారంభించారు.

ఈనాడు, హైదరాబాద్‌: సమాజ హితైషి రామోజీరావు. ప్రజల మేలు కోసం నిత్యం పరితపించేవారు. ప్రజలకు ఈనాడు పత్రిక ద్వారా యథార్థ సమాచారాన్ని అందించడంతోపాటు సమాజానికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాను అంటూ ముందు నిలిచేవారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తొలుత తనవంతుగా సాయం ప్రకటించి.. తర్వాత విరాళాలు అందించాలని దాతలకు పిలుపునిచ్చేవారు. సాయం చేసే చేతులు.. ప్రార్థించే పెదవులు రెండూ ఆయనే అయ్యేవారు. ఆయన పిలుపునిచ్చిందే తడవుగా దాతలూ మేమున్నామంటూ కదలివచ్చేవారు. చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకులలో దాచుకున్న మొత్తాన్ని అందించి ఈనాడు సహాయనిధిని సుసంపన్నం చేసేవారు. రామోజీ పిలుపునందుకున్న నిరుపేద సైతం రూపాయి రూపాయి పోగుచేసి తమ గొప్ప మనసును చాటుకునేవారు. వారిచ్చిన ప్రతి రూపాయినీ రామోజీరావు బాధ్యతగా బాధితులకు దక్కేలా చూసేవారు. అలా తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, తమిళనాడు, గుజరాత్‌లలోని అనేక కల్లోల పీడిత గ్రామాల్లో కూడా ఆపన్నులకు అండగా నిలిచారు. అందుకే ఇప్పటికీ ‘ఈనాడు’లో కదిలించే చిన్నవార్త వచ్చినా దాతలు స్పందించి తమ వంతుగా సాయం చేస్తుంటారు.

 అడుగుపడింది నాడే..

అది 1976.. ఒకే ఏడాదిలో దివిసీమ ప్రాంతంలో వరుసగా 3 తుపాన్లు విరుచుకుపడ్డాయి. అప్పుడే తొలిసారిగా ‘ఈనాడు’ ద్వారా తుపాను సహాయ నిధిని రామోజీరావు ప్రారంభించారు. దానికి విశేష స్పందన లభించింది. పాఠకుల నుంచి దాదాపు రూ.65 వేలు విరాళాల రూపంలో రాగా సీఎం సహాయనిధికి అందించారు.

  • 1977 నవంబరులో కృష్ణా జిల్లా పాలకాయతిప్ప గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. అక్కడి దయనీయ స్థితిని గమనించిన రామోజీరావు తక్షణ సాయం ప్రకటించి విరాళాలకు పిలుపునిచ్చారు. అప్పట్లోనే 3లక్షల 73వేల 927 రూపాయలు సమకూరగా అప్పుడు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో వరదలకు తట్టుకునేలా దాదాపు 112 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది ‘ఈనాడు’. ఇళ్లు కట్టగా మిగిలిన డబ్బుతో పక్కనే కృష్ణాపురం అనే ఊళ్లో మరో 22 మందికి నీడ కల్పించింది.
  • 1996లో కోస్తాపై పెనుతుపాను విరుచుకుపడినప్పుడు మరోసారి బాధితులకు అండగా నిలిచారు. రూ.25 లక్షలతో తుపాను సహాయనిధిని ప్రారంభించగా పాఠకుల విరాళాలతో అది కోటి రూపాయలకు చేరుకుంది. దాంతో 42 సూర్య భవనాలను నిర్మించి తీరప్రాంతంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేలా అందించారు.
  • 2009 అక్టోబరులో కృష్ణ, తుంగభద్ర, కుందూ నదులకు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు రావడంతో నాటి కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలు కకావికలమయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా ‘ఈనాడు’ తక్షణం రంగంలోకి దిగి 1.2 లక్షల ఆహార పొట్లాలను అందజేసింది. రామోజీ గ్రూపు సంస్థల తరఫున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ.. బాధితులను ఆదుకోవాల్సిందిగా దాతలకు రామోజీరావు పిలుపునిచ్చారు. వేలమంది దాతలు విరాళాలు అందించడంతో రూ.6.05 కోట్లు సమకూరాయి. వాటితో మహబూబ్‌నగర్‌ జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన చేనేత కుటుంబాలకు ‘ఈనాడు’ మగ్గాలు అందజేసింది. కర్నూలు జిల్లాలో ఉషోదయ పేరిట ఆధునిక సౌకర్యాలతో పాఠశాల భవనాలను నిర్మించి 2011 జులై 14న ప్రభుత్వానికి అప్పగించింది. వరద బాధితులను ఆదుకునేందుకు వేల మంది వితరణశీలురు రూ.కోట్ల విలువ చేసే వస్తువులు, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు ‘ఈనాడు’ను ఆశ్రయించడం సంస్థపై ప్రజలకు ఉన్న విశ్వసనీయతకు నిదర్శనం.
  • 2014లో హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు బాధితుల కోసం రూ.3 కోట్ల సహాయనిధితో పాటు పాఠకుల విరాళాలు రూ.3 కోట్లు కలిపి విశాఖపట్నం జిల్లాలోని తంతడి, వాడపాలెం ప్రాంతాల్లో 80 కొత్త ఇళ్ల నిర్మాణంతోపాటు దెబ్బతిన్న మరికొన్ని ఇళ్లకు మరమ్మతులు చేసి ఇచ్చింది ఈనాడు.
  • కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రామోజీరావు రూ.20 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ సాయాన్ని రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధి ఖాతాలకు బదిలీ చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారు. కరోనాపై యుద్ధంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
  • రామోజీ ఫౌండేషన్‌ తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుంది. అందులో ఒకటి కృష్ణా జిల్లా పెదపారుపూడి కాగా.. రెండోది రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లి గ్రామం. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి ఫౌండేషన్‌ ఎంతగానో కృషి చేసింది. కోట్లాది రూపాయలు ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చించింది.

పక్క రాష్ట్రాల్లోనూ..

  • 1999లో ఒడిశాను చెల్లాచెదురు చేసింది సూపర్‌ సైక్లోన్‌. అప్పుడు రామోజీ తన వంతుగా 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా ఆయన పిలుపుతో దాతలు తమ వంతు సాయం అదించారు. 45లక్షల 83వేల 148 రూపాయలు సేకరించి  జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలో రామకృష్ణ మిషన్‌ ద్వారా 60 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు.
  • 2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపం వేలమందిని పొట్టనపెట్టుకుంది. రామోజీరావు తన వంతు సాయం అందించడంతో పాటు విరాళాలను పోగుచేశారు. అలా సమకూరిన దాదాపు రూ.2.2 కోట్లతో కచ్‌ జిల్లాలో స్వామి నారాయణ్‌ సంస్థ సహకారంతో ‘ఈనాడు’ 104 ఇళ్లు కట్టిచ్చింది.
  • 2004లో తమిళనాట సునామీ ముంచెత్తినప్పుడు తీవ్రంగా నష్టపోయిన కడలూరు, నాగపట్నం జిల్లాల్లో రూ.రెండున్నర కోట్లు వెచ్చించి రామకృష్ణ మఠం సహకారంతో మత్స్యకారులకు 164 ఇళ్లు కట్టిచ్చింది.
  • 2018 కేరళ వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఛైర్మన్‌ రామోజీరావు రూ.3 కోట్లతో ‘ఈనాడు’ సహాయనిధిని ఏర్పాటు చేశారు. మానవతావాదులూ సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు ఇలా ఎందరో తమకు సాధ్యమైనంత మేరకు విరాళాలు అందించారు. వారి దాతృత్వ హృదయాన్ని సాక్షాత్కరిస్తూ నిధి రూ.7.77 కోట్లకు చేరింది. ఆ డబ్బుతో అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన 121 కుటుంబాలకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో రెండు పడక గదుల ఇళ్లు కట్టించారు.

ప్రతి రూపాయికీ లెక్క..

ప్రజలిచ్చే సొమ్ముకు కచ్చితమైన లెక్క ఉండాలి. లేదంటే వారు నమ్మకంతో చేసే సాయానికి విలువ ఉండదు. అందుకే ఏ రోజుకారోజు సహాయనిధికి ఎవరెవరు ఎంతిచ్చారన్నది ‘ఈనాడు’లో వెల్లడించేవారు. ఆ నిధులతో ఏం చేయాలి? ఎలా ఖర్చు చేస్తే బాగుంటుంది? అన్నది బాధిత ప్రాంత అధికారులతో, నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకునేవారు. నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు అందజేసి, నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామ పంచాయతీలకు అప్పజెప్పేవరకూ ‘ఈనాడు’ పాత్ర ఉంటుంది.


కార్పొరేట్‌ సామాజిక బాధ్యతపరంగానూ.. 

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతపరంగానూ..  సంస్థ నిధులతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించి, ఆయా విభాగాల అధికారులకు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్‌పల్లిని రామోజీ గ్రూప్‌ దత్తత తీసుకొని ఆ పల్లెల రూపురేఖల్నే మార్చేసింది. రోడ్లు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్థుల జీవనశైలిని మెరుగుపరిచింది. కర్నూలు జిల్లాలో నిర్మించిన అనాథాశ్రమం, తెలంగాణలోని అబ్దుల్లాపుర్‌మెట్‌లో కట్టించిన పోలీస్‌ స్టేషన్, తహసీల్దార్‌ కార్యాలయం, ఇబ్రహీంపట్నంలో నిర్మించిన ఆర్డీవో కార్యాలయం రామోజీ గ్రూప్‌ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తాజా ఉదాహరణలు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని