మార్గదర్శి తోడుంటే.. ఆనందం మీ వెంటే

ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పట్టుదలతో కృషి చేస్తే ఎంత ఎత్తుకు ఎదగవచ్చో.. జీవితకాలంలో ఎన్ని లక్షలమందిని ప్రభావితం చేయవచ్చో.. క్రమశిక్షణ, అంకితభావంతో ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈతరం ఎరిగిన స్ఫూర్తి శిఖరం రామోజీరావు గురించి తెలుసుకోవలసిందే.

Updated : 09 Jun 2024 09:00 IST

62 ఏళ్లుగా నమ్మకమైన ప్రయాణం
ఖాతాదారుల అవసరాలకు ఆర్థిక భరోసా

మార్గదర్శి 60 ఏళ్ల వేడుకల్లో శైలజాకిరణ్‌తో కేక్‌ కోయిస్తున్న రామోజీరావు. పక్కన కిరణ్, దివిజ, విజయేశ్వరి 

ఈనాడు, అమరావతి : ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పట్టుదలతో కృషి చేస్తే ఎంత ఎత్తుకు ఎదగవచ్చో.. జీవితకాలంలో ఎన్ని లక్షలమందిని ప్రభావితం చేయవచ్చో.. క్రమశిక్షణ, అంకితభావంతో ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈతరం ఎరిగిన స్ఫూర్తి శిఖరం రామోజీరావు గురించి తెలుసుకోవలసిందే. ప్రతిమనిషి జీవితంలో ఆర్థిక భద్రత, భరోసా ఎంత అవసరమో గుర్తించి, ఆ దిశగా అందరికీ వెలుగుబాట చూపే కాంతి స్తంభం ఆయన స్థాపించిన మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ. ఆరు దశాబ్దాల వజ్రోత్సవ ప్రయాణంలో నమ్మకానికి చిరునామాగా ఆ సంస్థను తీర్చి దిద్దారు రామోజీరావు. సవాళ్లకు ఎదురునిలిచి.. లక్షలమందికి ఆర్థిక నేస్తమై ఖాతాదారుల మనసుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 

బిందువు.. బిందువు కలిస్తేనే సింధువుగా మారేది. రూపాయి, రూపాయి పొదుపు చేస్తేనే రేపటి స్వప్నాల సాకారానికి బాటలు పడేది. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, అడుగు పెట్టిన ప్రతిరంగంలో అనితర సాధ్యమైన విజయాల్ని అందుకున్న రామోజీరావు సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక భరోసా అందించాలనే సంకల్పంతో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు అదే స్ఫూర్తితో ‘కలలు మీవి, వాటికి సాకారం చేసే ఆర్థిక సహకారం మాది’ అంటూ నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందిస్తూ వస్తోంది మార్గదర్శి. 

ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభం 

ఆరు దశాబ్దాల క్రితం.. చిట్‌లు అంటే గృహిణుల వ్యాపారం అనే అభిప్రాయం ఉండేది. ఇలాంటి భిన్నాభిప్రాయాలు, ఆక్షేపణలు ఎదురైనా వెరవకుండా పట్టుదలతో 1962 అక్టోబరులో చిట్‌ఫండ్‌ సంస్థను స్థాపించి ముందుకు నడిపించారు రామోజీరావు. వసూళ్లు, చెల్లింపులు కచ్చితంగా ఉండడంతో అనతికాలంలోనే ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొన్నారు. పొదుపే పరమావధి అనే సూత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లారు. యాజమాన్యం విశ్వసనీయత, సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో ఈ సంస్థ అంతే వేగంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో ఒక చిన్న అద్దె గదిలో ఇద్దరు ఉద్యోగులతో ప్రయాణం ప్రారంభించిన మార్గదర్శి ఇంతింతై అన్నట్లు నేడు రూ. 10,687 కోట్లకు పైగా టర్నోవర్, 113 శాఖలు, 3 లక్షలమందికి పైగా క్రియాశీలక చందాదారులతో దినదిన ప్రవర్థమానమవుతూనే ఉంది. 4,100 మంది ఉద్యోగులు, 18,000 మందికి పైగా ఏజెంట్లకు జీవనోపాధిని కల్పిస్తోంది. ప్రభుత్వాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ఆదాయపు పన్ను, జీఎస్టీ సహా వివిధ పన్నుల రూపంలో వందల కోట్లు చెల్లిస్తోంది. 

60 లక్షలమందికి పైగా చందాదారులు 

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఈ 62 ఏళ్ల విజయగీతికలో 60 లక్షలమందికి పైగా చందాదారులు సంతృప్తికరమైన సేవలందుకుంటున్నారు. ఇంటి నిర్మాణం, వ్యాపార ప్రారంభం, విస్తరణ, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, చింతలేని పదవీ విరమణ జీవితం.. ఇలా అవసరమేదైనా అండగా నిలుస్తుంది మార్గదర్శి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో విస్తరిస్తూనే ఉంది. 

రాజకీయ మారీచుల మాయలను అధిగమించి..  

ఖాతాదారులే దేవుళ్లు, వారికి సేవ చేయడమే మన విధి అన్న రామోజీరావు మాటనే తారక మంత్రంగా చేసుకుని సుస్థిరవృద్ధిని సాధిస్తోంది ఈ సంస్థ. చిట్‌ఫండ్‌ వ్యాపారంలో దేశంలోనే నంబర్‌-1గా నిలిచింది. ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు.. ఇలా అన్నివర్గాలవారికీ అందుబాటులో ఉండేలా ఆకర్షణీయమైన పథకాలు, చిట్‌ గ్రూపులతో ఇన్నేళ్లుగా ఖాతాదారులకు ఆత్మీయ మిత్రుడిగా నిలవడం అంటే ఆషామాషీ కాదు. పైగా మధ్యలో గిట్టనివాళ్లు కుట్రలు చేసినా, రాజకీయ మారీచులు యుద్ధం ప్రకటించినా నమ్మకమే ఊపిరిగా, శ్రీరామరక్షగా 62 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు లేకుండా ఖాతాదారులందరికీ ఐశ్వర్యానందాలు పంచుతోంది మార్గదర్శి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని