దార్శనికుడు.. ధర్మరక్షకుడు రామోజీరావు

నిత్య కృషీవలుడు, మేరునగ ధీరుడు, ధీరోదాత్తుడు, నాయకుడు, నిగర్వి, మానవతావాది, సంఘ సంస్కర్త, సత్య శోధకుడు.. ఇలా తెలుగు భాషలోని విశేషణాలన్నీ వాడినా రామోజీరావు వ్యక్తిత్వానికి, పరిపూర్ణ జీవితానికి పూర్తిగా అద్దం పట్టవు. రామోజీరావు ఒక మహోన్నత శక్తి.

Updated : 09 Jun 2024 08:17 IST

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు. చిత్రంలో బోయపాటి శ్రీను, బండ్ల గణేశ్‌

నిత్య కృషీవలుడు, మేరునగ ధీరుడు, ధీరోదాత్తుడు, నాయకుడు, నిగర్వి, మానవతావాది, సంఘ సంస్కర్త, సత్య శోధకుడు.. ఇలా తెలుగు భాషలోని విశేషణాలన్నీ వాడినా రామోజీరావు వ్యక్తిత్వానికి, పరిపూర్ణ జీవితానికి పూర్తిగా అద్దం పట్టవు. రామోజీరావు ఒక మహోన్నత శక్తి. ఐదున్నర దశాబ్దాలుగా ఆయన సృష్టించిన అద్భుతాలు తెలుగు వారి జీవితాల్లో విడదీయరాని భాగమయ్యాయి. ఆ అద్భుతాల్లోకెల్లా అద్భుతమైంది ఉదయాన్నే తలుపు తెరవగానే గడప దగ్గర పలకరించే ‘ఈనాడు’ దినపత్రిక. తెలుగు జాతికీ, భాషకూ ఈనాడు చేస్తున్న సేవకు వెలకట్టలేం. పత్రికను ప్రాణంగా భావించి, అక్షరమక్షరం సరిదిద్దుతూ, కొత్త ఒరవడికి, రెండో తరం వాడుక భాషా ఉద్యమానికి నాంది పలికారు రామోజీరావు. ఆనాడు రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా ఉన్న అధికార పార్టీ అణచివేతను ఖాతరు చేయకుండా అవినీతిని, అక్రమాలను ఎండగట్టారు. సామాన్యుడి ఆవేశానికి, ఆగ్రహానికి, ఆక్రోశానికి గొంతుకనిచ్చారు. తెలుగు జాతికి అధిష్ఠానాల వల్ల జరుగుతున్న అవమానాలను భరించలేక, బహిరంగంగానే ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించారు. నిర్మాణాత్మక పాత్రికేయ విలువలతో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికారు. ప్రజలకు, సమాజానికి న్యాయం చేయాలంటే న్యాయమూర్తే కానవసరం లేదని నిరూపించారు. ‘యథో ధర్మ.. తథో జయ’ అన్న సూత్రాన్ని నమ్మారు. తన కలం ద్వారా నిరంతరం న్యాయం, ధర్మం నిలబెట్టేందుకు పాటుపడ్డారు. 

వేధింపులకు వెరవని నైజం

ఎదుటివాడు ఎంతటి శక్తిమంతుడైనా అన్యాయం అన్పిస్తే ఢీకొట్టేవారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత వేధించినా వెనక్కి తగ్గలేదు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగలేదు. రాజకీయ అధికారాన్ని ఆమడదూరంలో ఉంచారు. 2004 నుంచి 2010 వరకు, మళ్లీ ఇటీవల రెండేళ్లుగా రామోజీరావు ఎదుర్కొన్న వేధింపులు, మానసిక హింస, బహుశా మరే పత్రికా యజమాని చవిచూసి ఉండరు. అయినా ఆయన కలం కింద పడేయలేదు. అధికారంలో ఉన్నవారు ఎన్ని రాయబారాలు పంపినా రాజీ పడలేదు. బెదిరింపులకు లొంగలేదు. తప్పుడు కేసులు పెట్టి, గంటల తరబడి ప్రశ్నించి హింసించినా, నిస్సహాయంగా మంచంపై ఉన్న తన ఫొటోలను ప్రభుత్వం పైశాచిక ఆనందం కోసం ప్రసారం చేసినా, రామోజీరావు కుంగిపోలేదు. ఆయనకు తెలిసింది ఒక్కటే.. అది పోరాటం.

వారసత్వాన్ని నిలబెట్టేది తెలుగు జాతే

సగటు తెలుగువాడి నిజాయతీకి, నిర్భీతికి, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం రామోజీరావు. మిగతా ప్రపంచం కంటే ఎప్పుడూ నాలుగడుగులు ముందే నడచిన దార్శనికుడు, నిత్య పరిశోధకుడాయన. తెలుగు సంస్కృతిని, కళారూపాలను కంటికి రెప్పలా కాపాడారు, ప్రోత్సహించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి, ప్రపంచంలో ఏ మూలనైనా తెల్లవారుజామున జరిగిన సంఘటనను సైతం అచ్చులో మన గడప దగ్గరకు చేర్చి పాత్రికేయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు.. మూలాలను మరవలేదు. రైతుల అభ్యున్నతికి, వారికి ఆధునిక సాగు రీతులు నేర్పడానికి పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా వెలకట్టలేని కృషి చేశారు. ఎందరికో ఉపాధి కల్పించారు. నా తొలి ఉద్యోగం కూడా రామోజీరావు చలవే. ఎన్టీఆర్‌ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న వారు నేడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లోనూ రాణిస్తున్నట్టే, రామోజీరావు స్థాపించిన ఈనాడులో పాత్రికేయం నేర్చినవారు అన్ని మీడియా సంస్థల్లోనూ రాణిస్తున్నారు. దార్శనికులకు మాత్రమే ఇది సాధ్యం. ప్రజలు అన్యాయాన్ని, అరాచకాన్ని సహించరని, పాతర వేస్తారని రామోజీరావుకు గట్టి నమ్మకం. ఈ నెల నాలుగో తేదీన, ప్రజలు తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని నిర్ధారించుకున్నాకే ప్రశాంతంగా నిష్క్రమించారు. వారికి నా శ్రద్ధాంజలి! కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా సానుభూతి! రామోజీరావు ఘనమైన వారసత్వాన్ని తెలుగు సమాజం కాపాడుకుంటుందని నా ప్రగాఢ విశ్వాసం!

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని