ఆతిథ్యరంగంలో మేటి డాల్ఫిన్‌

దేశంలోనే పేరొందిన డాల్ఫిన్‌ హోటళ్లు.. రామోజీరావు కృషితో ఆతిథ్యరంగంలో మేటిగా ఎదిగాయి.

Updated : 09 Jun 2024 08:15 IST

హోటళ్ల నిర్వహణలో  దేశంలోనే పేరు 
విశాఖపట్నంలో మొదలైన  ప్రయాణం  
ఆపై హైదరాబాద్‌కు విస్తరణ

ఈనాడు, అమరావతి: దేశంలోనే పేరొందిన డాల్ఫిన్‌ హోటళ్లు.. రామోజీరావు కృషితో ఆతిథ్యరంగంలో మేటిగా ఎదిగాయి. ‘ఈనాడు’ దినపత్రిక మాదిరిగానే విశాఖపట్నంలో మొదలైన డాల్ఫిన్‌ ప్రయాణం హైదరాబాద్‌ వరకు సాగింది. ఈ హోటళ్ల సముదాయం ఆతిథ్య సేవల్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది.. ఆహార నాణ్యతకు గీటురాయిగా నిలిచింది.  

సువిశాల రామోజీ ఫిలిం సిటీలో డాల్ఫిన్‌ గ్రూపు రెండు ప్రతిష్ఠాత్మక హోటళ్లను నిర్మించింది. అవే తార, సితార. ఆధునిక సదుపాయాలతో దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే ఈ స్టార్‌ హోటళ్లు చక్కటి వసతులకు పేరొందాయి. ఫిలిం సిటీలో ఏటా జరిగే ఎన్నో కార్పొరేట్‌ సదస్సులకు హాజరయ్యే ప్రముఖులకు వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. 2002లో ప్రపంచ చదరంగ పోటీలకు హాజరైన దేశ, విదేశీ ప్రముఖులందరికీ ఆతిథ్య సేవలందించిన కేంద్రాలివే. అదే సంవత్సరం జరిగిన నేషనల్‌ గేమ్స్‌కు అధికారిక ఆతిథ్య సంస్థగా క్రీడాకారులందరికీ డాల్ఫిన్‌ భోజన సదుపాయాలు కల్పించింది. 


విశాఖలో 1980లో ప్రారంభం 

రామోజీరావు కృషితో డాల్ఫిన్‌ సంస్థ తొలి అడుగు వేసి దాదాపు నాలుగున్నర దశాబ్దాలు అవుతోంది. విశాఖలో మొదటి త్రీస్టార్‌ హోటల్‌గా డాల్ఫిన్‌ హోటల్‌ 1980లో మొదలైంది. నాలుగు అంతస్తులుగా మొదలై ఏడంతస్తులకు విస్తరించిన ఈ హోటల్‌ స్థాయి కూడా ఫోర్‌ స్టార్‌కు పెరిగింది. విశాఖలోనే ఉత్తమమైనదిగా 2008లో ప్రభుత్వ గుర్తింపు సాధించింది. ఇందులోని హొరైజాన్‌ 2010లో ఉత్తమ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది. దేశ, విదేశాల పర్యాటకులు ఎందరినో ఆకట్టుకున్న డాల్ఫిన్‌ హోటల్‌కు ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్, ఇంటర్నేషనల్‌ హోటల్‌ అసోసియేషన్, ట్రావెల్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల్లో సభ్యత్వం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని