Ramoji Rao: ‘అమరావతి’ నామకరణం చేసిన మహాతపస్వి

‘రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానికి ‘అమరావతి’ అని నామకరణం చేసిన మహాతపస్వి రామోజీరావు. చారిత్రక ప్రాధాన్యం గల అమరావతి పేరు పెడితే అజరామరంగా నిలిచిపోతుందని, దేవతలు నడయాడిన ప్రాంతంగా స్ఫురణకు వస్తుందని ఆనాడు చంద్రబాబుకు రామోజీరావు సూచించార’ని అమరావతి ప్రాంత రైతులు స్మరించుకున్నారు.

Published : 09 Jun 2024 07:10 IST

రామోజీరావుకు రాజధాని గ్రామాల ప్రజల నివాళి

తుళ్లూరు శిబిరంలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రాజధాని మహిళలు

తుళ్లూరు, న్యూస్‌టుడే: ‘రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానికి ‘అమరావతి’ అని నామకరణం చేసిన మహాతపస్వి రామోజీరావు. చారిత్రక ప్రాధాన్యం గల అమరావతి పేరు పెడితే అజరామరంగా నిలిచిపోతుందని, దేవతలు నడయాడిన ప్రాంతంగా స్ఫురణకు వస్తుందని ఆనాడు చంద్రబాబుకు రామోజీరావు సూచించార’ని అమరావతి ప్రాంత రైతులు స్మరించుకున్నారు. అమరావతి ఐకాస ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల్లో రామోజీరావు చిత్రపటాలకు రైతులు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. పలువురు రైతులు మాట్లాడుతూ రామోజీ గ్రూపు సంస్థలు ‘ఈనాడు’, ‘ఈటీవీ’ ప్రజలను చైతన్యపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటు పడుతున్నాయని కొనియాడారు. ‘అమరావతి పరిరక్షణ ఉద్యమంలో రామోజీ సంస్థల పాత్ర కీలకం. 1,631 రోజుల పాటు సాగిన సుదీర్ఘ ఉద్యమంలో నిరంతరం రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన గొప్ప వ్యక్తిని కోల్పోయాం. రాజధాని లేని రాష్ట్రంగా తయారైన ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజలంతా అమరావతికి అండగా నిలవాలని ఐదు కోట్ల ఆంధ్రులను చైతన్యవంతులను చేసి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ యుగపురుషుడు తనువు చాలించడం బాధాకరమ’ని పేర్కొన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని రాజధాని రైతులు, కూలీలు, మహిళలు ప్రార్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని