మనమెరిగిన మార్గదర్శి

ఆలోచనల్లో నూతనత్వం... ఆచరణలో విరామమెరుగని తత్వం... విలువలతో కూడిన వ్యాపార విధానం... ప్రతిక్షణం సమాజం కోసం ఆలోచించే నైజం... జనతను జాగృతం చేసే సంకల్పం... స్ఫూర్తిదాయక చైతన్యప్రస్థానం...

Updated : 09 Jun 2024 08:18 IST

ఆయన వ్యక్తి కాదు.. వ్యవస్థ
తెలుగువారి గుండెచప్పుడు

రామోజీరావు పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి

ఆలోచనల్లో నూతనత్వం... ఆచరణలో విరామమెరుగని తత్వం... విలువలతో కూడిన వ్యాపార విధానం... ప్రతిక్షణం సమాజం కోసం ఆలోచించే నైజం... జనతను జాగృతం చేసే సంకల్పం... స్ఫూర్తిదాయక చైతన్యప్రస్థానం...

..వీటన్నింటి సమాహారం రామోజీరావు జీవితం. ఓ సాధారణ కుటుంబంలో జన్మించి, ఇష్టంగా కష్టపడి, ఒక్కో మెట్టూ పైకి ఎదుగుతూ, తనతోపాటు మరెంతోమందికి చేయూతనిస్తూ, నలుగురికీ ప్రేరణగా నిలుస్తూ వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం భావితరాలు గుర్తుంచుకుని ఆచరించాల్సిన వెలుగుల పాఠం.

విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజన్తి?

భర్తృహరి చెప్పినట్లు ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవరోధాలు ఎదురైనా చలించకుండా చేపట్టిన కార్యాన్ని పూర్తిచేసేవరకూ ధీరోదాత్తులు విశ్రమించరు. వారినే ఉత్తములుగా భర్తృహరి అభివర్ణించారు. అలాంటి కార్యసాధకుల్లో నాకు ముందుగా గుర్తొచ్చే పేరు, నేను ఎంతోమందికి ఆదర్శంగా చూపించే వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రిక నుంచి ఈటీవీ జాతీయ నెట్‌వర్క్‌ వరకూ, ప్రియా పచ్చళ్ల నుంచి ప్రపంచప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీ వరకూ ప్రతిదీ ఆయన సరికొత్త ఆలోచనా సరళికి ఉదాహరణలే.

రామోజీరావు జీవితం ఓ సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైంది. ఆయన ఆలోచనా విధానం ప్రత్యేకమైనది. నా పట్ల ఎంతో అభిమానాన్ని, గౌరవాన్ని చూపించే ఆయన అనేక సందర్భాల్లో అనేక విషయాల గురించి నాతో చర్చించేవారు. ఆ సమయంలో చిన్న చిన్న విషయాల గురించి కూడా సూక్ష్మంగా ఆలోచించే ఆయన శైలిని గమనించాను. అప్పట్లో చాలామంది, మాట వరసకు రామోజీరావు పట్టిందల్లా బంగారమేనండీ అని నాతో అనేవారు. అయితే పట్టుకున్నది బంగారం చేసే దిశగా ఆయన పట్టుదల, చేసే కృషి, పడే శ్రమ గురించి తెలుసుకుని ఆచరణలో పెట్టాలని నేను సూచించేవాడిని. సమయపాలన, క్రమశిక్షణ అనేవి ఆయన వ్యక్తిగత జీవితానికే కాదు, వారు చేసిన వ్యాపారాలకూ విజయాలను అందించాయి. 

నిత్యం ఉషోదయంతో...

సమయపాలన అనగానే ముందుగా నాకు ఈనాడే గుర్తుకొస్తుంది. ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించు గాక’ అంటూ పత్రికారంగంలో ఈనాడుతో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లో ఆంధ్ర అనే పేరు లేని పత్రికలు ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో ‘ఈనాడు’ అనే పేరు ఓ నూతనత్వానికి నాంది పలికింది. ఈ రోజు, ఈ ప్రాంతం అనే రెండు అర్థాలు వచ్చేలా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా జర్నలిజం స్కూలును స్థాపించి, ఉద్దండులైన పాత్రికేయులను తెలుగు నేలకు అందించిన ఘనత ఈనాడుకు దక్కుతుంది. వార్తల్లో, సంపాదకీయాల్లో ఈనాడు భాషా ప్రామాణికత కొత్త బాటలు వేసింది. ఘనమైన చరిత్ర ఉన్న తెలుగుభాష పట్ల ఎనలేని మమకారం ఆయన సొంతం. భాష విషయంలో చిన్న పొరపాటు జరిగినా, అది తనవల్ల అయినా సరే తట్టుకోలేని మనస్తత్వం ఆయనది. అమ్మ భాష పట్ల అంత ప్రేమ ఉండటం వల్లే తమ మీడియా విషయంలో నిరుపమానమైన నిబద్ధతను చూపారు. నాణ్యతకు పెద్దపీట వేశారు.

విలువలతో కూడిన వ్యాపారం

వ్యాపారం అంటే కొనడం, అమ్మడం కాదు, నమ్మకం. ఈ విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి అడుగుపెట్టిన అనేక వ్యాపారాల్లో తనదైన ముద్ర వేశారు రామోజీరావు. హోటళ్లు, ఎరువులు, మార్గదర్శి, ఇమేజెస్‌ ప్రకటనలు, సినిమాలు, కళాంజలి వస్త్రాలు... ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా నూతనత్వంతో కూడిన ఆలోచనలతో పాటు, విలువలకు పెద్దపీట వేయడమే ఆయన విజయరహస్యం. కళాత్మక వ్యాపారమైన సినిమా సమాజాన్ని ప్రభావితం చేయగల మాధ్యమం అని రామోజీరావు బలంగా విశ్వసించారు. ఓ చిన్న వార్త ఆధారంగా నిర్మించిన మౌనపోరాటం, కాలు దూరమైనా నాట్యానికి దగ్గరైన సుధాచంద్రన్‌ జీవితం ఆధారంగా నిర్మించిన మయూరి, నాటి సమాజాన్ని అద్దంలో చూపించిన ప్రతిఘటన, ఓ విజేత నిజజీవితం ఆధారంగా నిర్మించిన అశ్వని, యువతరం ఆలోచనలను ప్రతిబింబించిన నువ్వే కావాలి... ఇలా ఎన్నో సినిమాలు సంచనాలు సృష్టించాయి. సమాజంలో ఓ సానుకూల మార్పునకు బీజం వేశాయి. 

రామోజీరావు సంస్థలు వ్యాపారానికి పరిమితం కాలేదు. సమాజానికి మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయం చేయడం, దేశవ్యాప్తంగా అనేకచోట్ల కాలనీల నిర్మాణం, అనేక పాఠశాల భవనాల నిర్మాణం, చేతివృత్తుల వారికి పనిముట్ల వితరణ... ఇలా సేవారంగంలోనూ రామోజీ సంస్థలు తమదైన ముద్రను వేశాయి.

యథా మృత్పిణ్డతః కర్తా కురుతే యద్యదిచ్ఛతి
ఏవమాత్మకృతం కర్మ మానవః ప్రతిపద్యతే

మట్టిముద్ద నుంచి కులాలుడు (కుండల తయారీ కళాకారుడు) తన ఆలోచనలకు అనుగుణంగా కోరిన వస్తువులను తయారు చేస్తున్నట్లే.. మానవుడు తన మనసుకు నచ్చినవిధంగా, తన ఆలోచనలకు అనుగుణంగా, ప్రయత్నాను రూపంగా కర్మలను ఆచరించి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడు. అదే మార్గంలో దిల్లీలో ఒక చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, యువతకు ఆదర్శంగా ఎదిగిన రామోజీరావు జీవితం నుంచి భావితరాలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. పనిలోనే విశ్రాంతిని వెతుక్కునే ఆయన తత్వం విజయాలకు దగ్గర చేస్తుంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆచరణలో చూపించిన నూతనత్వం కొత్త బాటను పరిచయం చేస్తుంది. రామోజీరావు అంటే తెలుగువారి గుండెచప్పుడు. ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక తరాలను ప్రభావితం చేశారు. భవిష్యత్తు తరాలనూ ప్రభావితం చేస్తూనే ఉంటారు. భారతదేశ పత్రిక, సినిమా రంగాల్లో ఆయన కీర్తి అజరామరం, ఆచంద్రతారార్కం.


తెలుగుకు పట్టం

తెలుగు భాష అంటే రామోజీరావుకు ఉన్న మమకారం ఆయన వ్యాపారాలన్నింటిలో కనిపిస్తుంది. ఆయా సంస్థలకు పెట్టే పేర్లు కావచ్చు, ప్రజలకు చేరువ చేసే తీరు కావచ్చు. అడుగడుగునా తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈనాడు, ఈటీవీలో తెలుగు భాష, సంస్కృతుల ఉన్నతికి ఆయన శ్రమించిన తీరు తెలుగు వారెవరూ మరువలేరు. పాడుతా తీయగా లాంటి కార్యక్రమం ద్వారా తెలుగునాట సంగీత విప్లవాన్ని సృష్టించారు. స్వరాభిషేకం వంటి కార్యక్రమాలు తెలుగు పాటకు ఈటీవీ ఇచ్చిన అఖండహారతి. ఆయన స్థాపించిన తెలుగువెలుగు మాసపత్రిక భాషా ఉద్యమంలో ఓ ముందడుగు. తరాల మధ్య అక్షరాల వారధి నిర్మించటంలో తెలుగు వెలుగు విజయం సాధించింది.


ఉద్యమస్ఫూర్తి

సారా ఉద్యమం, సమాచార హక్కు చట్టం... ఇలా ఈనాడు ఏ ఉద్యమాన్ని తలకెత్తుకున్నా సంచలనమే. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుల్ని చేయాలన్న తలంపుతో కుట్ర జరిగినప్పుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఈనాడు తనవంతు పాత్ర పోషించింది. ఆరోజు పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌ తరఫున నిలబడి పోరాడినవారిలో నేనూ ఉన్నాను. ప్రాంతీయవార్తలను ప్రజలకు అందించాలన్న తలంపుతో జిల్లా ఎడిషన్ల దిశగా ఈనాడు వేసిన అడుగును ప్రజలు ఎంతగానో ఆదరించారు. రామోజీరావు సంపాదకత్వంలో వార్త అంటే సంచలనం కాదు, సమగ్ర సమాచారం. అదే దృక్పథంలో పనిచేసిన ఈనాడు, విలువలతో కూడిన పాత్రికేయానికి చిరునామాగా నిలిచింది.

 (రామోజీరావుకు నివాళులర్పిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ప్రత్యేక వ్యాసం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని