నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట

వర్షాలు మొదలుకాగానే దోమల తాకిడి పెరుగుతుంది. వీటి బెడదను వదిలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఒక అంకుర సంస్థ.. వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నీటిలో దాగున్న దోమల లార్వాలను పసిగట్టేందుకు అధునాతన గూఢచర్య, నిఘా ఉపగ్రహ పరిజ్ఞానాన్ని ఉపయోగించింది.

Updated : 09 Jun 2024 08:19 IST

వర్షాలు మొదలుకాగానే దోమల తాకిడి పెరుగుతుంది. వీటి బెడదను వదిలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఒక అంకుర సంస్థ.. వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నీటిలో దాగున్న దోమల లార్వాలను పసిగట్టేందుకు అధునాతన గూఢచర్య, నిఘా ఉపగ్రహ పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. ఈ జీవులకు చౌకలో, సమర్థంగా చెక్‌ పెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఎక్కడికక్కడ నిలిచి ఉండే నీటిలో దోమలు గుడ్లు పెట్టి, వాటి సంతతిని పెంచి, మానవుల్లోకి అనేక వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. కోల్‌కతాకు చెందిన శిశిర్‌ రాడార్‌ అనే అంకుర సంస్థ.. అధునాతన హైపర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీని ఉపయోగించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ మాజీ డైరెక్టర్‌ తపన్‌ మిశ్ర దీన్ని స్థాపించారు. ఆయనకు భారత నిఘా ఉపగ్రహాల పితామహుడిగా పేరుంది.

  • దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు 85 దేశాలను పీడిస్తున్నాయి. ఏటా 70 కోట్ల మంది వీటి బారినపడుతున్నారు. అందులో 7.25 లక్షల మంది చనిపోతున్నారు.
  • భారత్‌లో ఏటా 4 కోట్ల మంది.. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారినపడుతున్నారు. 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా.
  • భారత్‌లో దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా, జికా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.

బోలెడు ప్రయోజనాలు..

  • దోమల లార్వాలు నిర్దిష్టంగా ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఆధారంగా కీటకనాశనులను అక్కడే ప్రయోగిస్తే సరిపోతుంది. 
  • ప్రస్తుతం దోమల నివారణ మందులను విచక్షణారహితంగా ఎక్కడపడితే అక్కడ పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా సంబంధిత నీటి వనరులు విషతుల్యమవుతున్నాయి. అందులోని జలచరాలకు, పర్యావరణ వ్యవస్థలకు ఇది హానికరంగా మారింది. ఈ పోకడకు చెక్‌ పెట్టడానికి తాజా పరిశోధన దోహదపడుతుంది. 
  • అలాగే లార్వా దశలోనే దోమల పీడను విరగడ చేసుకోవచ్చు. మలేరియా, డెంగీ మరణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

ఏమిటీ స్పెక్ట్రల్‌ పరిజ్ఞానం?

విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లో రేడియో తరంగాలు, మైక్రోవేవ్స్, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియోధార్మికత, దృశ్య కాంతి, అతినీలలోహిత కిరణాలు, ఎక్స్‌రేలు, గామా కిరణాల వంటి పలురకాల కాంతి తరంగాలు ఉంటాయి. 

  • ప్రతి వస్తువూ కాంతితో విభిన్నంగా చర్య జరుపుతుంది. ఈ చర్యను మనం విశ్లేషించినప్పుడు అందులో ఒక ప్రత్యేక ‘ముద్ర’ కనిపిస్తుంది. దీన్ని స్పెక్ట్రల్‌ సిగ్నేచర్‌ అంటారు. 
  • హైపర్‌స్పెక్ట్రల్‌ కెమెరా.. ఒక వస్తువు, ప్రదేశానికి సంబంధించిన కాంతిని ఒడిసిపడుతుంది. అనంతరం దాన్ని వేర్వేరు కాంతి తరంగదైర్ఘ్యాలుగా వర్గీకరిస్తుంది. తద్వారా ఆ దృశ్యానికి సంబంధించిన 2డీ చిత్రాన్ని అందించడంతోపాటు అందులోని ప్రతి పిక్సెల్‌కు సంబంధించిన స్పెక్ట్రల్‌ సమాచారాన్ని రికార్డు చేస్తుంది. 
  • ఈ క్రమంలో వచ్చే హైపర్‌ స్పెక్ట్రల్‌ చిత్రంలో ప్రతి పిక్సెల్‌లో ఒక ప్రత్యేక స్పెక్ట్రమ్‌ ఉంటుంది. ప్రతి పదార్థం.. దాని స్వభావం రీత్యా కాంతితో చర్య జరిపే తీరులో వైరుధ్యాలు ఉండటం వల్ల వాటి స్పెక్ట్రల్‌ సంకేతాలూ విభిన్నంగా ఉంటాయి. దీన్ని ఆ పదార్థ ‘వేలిముద్ర’గా అభివర్ణించొచ్చు. 
  • మనుషులను గుర్తించడానికి వారికే ప్రత్యేకమైన వేలిముద్రలు ఉపయోగపడినట్లు.. హైపర్‌స్పెక్ట్రల్‌ చిత్రంలోని స్పెక్ట్రల్‌ సంకేతాల సాయంతో ఆ ప్రదేశంలోని పదార్థాలను గుర్తించొచ్చు.

పనిచేసేది ఇలా..

  • ప్రత్యేకంగా రూపొందిన డ్రోన్లకు హైపర్‌స్పెక్ట్రల్‌ కెమెరాను అమర్చారు.  ఇవి ట్యాంకులు,  చెరువులు, కాలువలపై విహరిస్తూ అక్కడి జలాల్లో దోమల లార్వాలు ఉన్నాయా.. లేదా అన్నది గుర్తించగలవు.   
  • పరీక్షల్లో భాగంగా శుభ్రమైన నీరు, లార్వాలతో కూడిన నీరును వేర్వేరు పాత్రల్లో పరిశోధకులు ఉంచారు. వాటిపైకి  హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజర్‌తో కూడిన డ్రోన్‌ను పంపారు. 
  • ఈ లోహవిహంగం.. 15 మీటర్ల ఎత్తు నుంచి నీటి పాత్రలను ప్రత్యేక కెమెరాతో పరిశీలించింది. అందులో దోమల లార్వాలతో కూడిన పాత్రను విజయవంతంగా గుర్తించింది.

ఉపయోగాలు..

  • ఒక వస్తువును తాకకుండానే.. దాని భౌతిక, రసాయన వివరాలను తెలుసుకోవడానికి హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపయోగపడుతుంది. ఒకేలా కనిపించే భిన్న వస్తువుల మధ్య వైరుధ్యాన్ని గుర్తించడానికి సాయపడుతుంది.
  • వస్తువుల నాణ్యతలో లోపాలు, వ్యర్థ పదార్థాలను గుర్తించడం, ప్యాకింగ్‌ తనిఖీ వంటి అనేక అవసరాలకు ఇది అక్కరకొస్తుంది. 
  • ఖగోళశాస్త్రం, వ్యవసాయం,  ఫుడ్‌ ప్రాసెసింగ్, జీవశాస్త్రం, బయోమెడికల్‌ ఇమేజింగ్, ఔషధాల తయారీ వంటి పలు రంగాల్లో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని