మనోడైతే చాలు.. అర్హత అక్కర్లేదు

అస్మదీయులు, ప్రధానంగా తన సామాజికవర్గానికి చెందిన అఖిల భారత సర్వీసుల అధికారులకు.. జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డాగా మార్చేశారు.

Updated : 10 Jun 2024 07:25 IST

అస్మదీయులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి కీలక బాధ్యతలు
తితిదే నుంచి గనులశాఖ వరకు జగన్‌ ‘సొంత’ మనుషులదే రాజ్యం
నేతల అవినీతికి, అడ్డగోలు దోపిడీకి వారి అండదండలు

ఈనాడు, అమరావతి: అస్మదీయులు, ప్రధానంగా తన సామాజికవర్గానికి చెందిన అఖిల భారత సర్వీసుల అధికారులకు.. జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డాగా మార్చేశారు. కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ పని చేస్తున్న కొందరు అధికారుల్ని ఏరికోరి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. ఆ పోస్టులకు వారికి అర్హత లేకపోయినా కీలక స్థానాల్లో కూర్చోబెట్టారు. ముఖ్యమైన విభాగాలకు అధిపతుల్ని చేశారు. వారు జగన్‌కు ఉపయోగపడటంతో పాటు, పనిలో పనిగా సొంత వ్యవహారాలూ బాగానే చక్కబెట్టుకున్నారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి అధికారులంతా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో నెమ్మదిగా జారుకుని, మళ్లీ మాతృసంస్థలకు వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 


గనుల దోపిడీకి సహకరించిన ‘ఘనుడు’!

గనుల శాఖ సంచాలకుడిగా ఉన్న వీజీ వెంకటరెడ్డి ఐదేళ్లలో వైకాపా నేతలు చేసిన రూ.వేల కోట్ల ఇసుక దోపిడీకి, గ్రానైట్, కంకర, మట్టి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్, క్వార్ట్జ్‌ల అడ్డగోలు దందాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని తెదేపా శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో సివిలియన్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డికి పాలనా వ్యవహారాల్లో పట్టులేకపోయినా జగన్‌ ఏరికోరి తీసుకొచ్చి గనులశాఖను కట్టబెట్టారు. ఆయనను నాలుగేళ్లకు పైగా అదే పోస్టులో కొనసాగించడమే కాకుండా, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఎండీగా పోస్ట్‌నూ అప్పగించారు. ముఖ్యమంత్రి, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ చూసుకుని వెంకట్‌రెడ్డి చెలరేగిపోయారు. ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాల విధానం నిలిపేసి, టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించడంలో వెంకట్‌రెడ్డిదే కీలకపాత్ర అన్న ఆరోపణలున్నాయి. తెదేపా ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించగా.. దానిలో అనుచిత లబ్ధి పొందారంటూ చంద్రబాబుపై వెంకట్‌రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసి, కేసు పెట్టించారు. ప్రతిపక్ష నేతల గ్రానైట్, మెటల్, సిలికాశాండ్‌ క్వారీల్లో తనిఖీలు, భారీ జరిమానాలతో భయపెట్టి, వారంతా వైకాపా పెద్దల చెప్పుచేతల్లో ఉండేలా చేశారు. 


జగన్‌ కళ్లలో ఆనందమే ఆయన లక్ష్యం!

రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ, కమిషనర్‌గా పనిచేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి రామకృష్ణ జగన్‌ కోసం ఏమైనా చేసేవారు. తన సామాజికవర్గం వ్యక్తి కాకపోయినా జగన్‌ ఆయన్ను అభిమానించడానికి ఈ విధేయతే కారణమంటారు. ఆయన పార్టిషన్, కన్వేయన్స్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నిబంధనల్లో లొసుగులున్నాయంటూ.. వాటిని సవరించే ముసుగులో ఫీజులు పెంచేసి ప్రజలపై ఆర్థికభారం మోపారని, భూముల మార్కెట్‌ విలువను ఇష్టానుసారం పెంచారని విమర్శలున్నాయి. ఎన్‌ఐసీ ఉచితంగా ఇచ్చే సాఫ్ట్‌వేర్‌ను వద్దని.. వైకాపా పెద్దల సన్నిహితుల సంస్థకు సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన బాధ్యతలు అప్పగించి, రూ.30 కోట్లు అప్పనంగా ధారపోశారు. 


వివాదాస్పద నిర్ణయాలకు చిరునామా

ఐఎఫ్‌ఎస్‌ అధికారి మధుసూదన్‌రెడ్డిని జగన్‌ కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి తొలుత రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు. ఏడాదిన్నర క్రితం ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు సీసీ కెమెరాల నిర్వహణ కోసమంటూ రూ.350 కోట్లు అప్పుగా తీసుకుని, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర అవసరాలకు మళ్లించారని విపక్షాలు ఆరోపించాయి.  కేబుల్‌ ఛార్జీల పెంపు, పెండింగ్‌ బకాయిల పేరుతో ఆపరేటర్లను తీవ్ర ఇబ్బంది పెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈయనపై వేటు పడింది.


విపక్ష నాయకులపై కక్షసాధింపే ఆయన ఎజెండా!

ఐఆర్‌ఎస్‌ అధికారి రాజేశ్వర్‌రెడ్డిని జగన్‌ డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)కి ఎండీగా నియమించారు. ‘నాడు-నేడు’ పనులను ఆ సంస్థే చూసేది. ఆయన టెండర్‌ నిబంధనల్ని ఉల్లంఘించి ప్రజాధనానికి భారీగా గండికొట్టారని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. ఆ తర్వాత రాజేశ్వర్‌రెడ్డిని.. కొత్తగా ఏర్పాటు చేసిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కి కమిషనర్‌గా నియమించారు. విపక్ష నాయకుల వ్యాపార సంస్థలపై దాడి చేసి, ఆర్థిక మూలాల్ని దెబ్బతీసేందుకే డీఆర్‌ఐను ఏర్పాటు చేశారని, రాజేశ్వర్‌రెడ్డి జగన్‌ కనుసన్నల్లో పనిచేస్తూ ఆ బాధ్యతను నెరవేర్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 


అస్మదీయ గుత్తేదారులకే అందలం!

రాజేశ్వర్‌రెడ్డిని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ నుంచి మార్చాక.. ఆ పోస్టులో రైల్వేశాఖ నుంచి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చిన దివాన్‌రెడ్డిని కూర్చోబెట్టారు. ఆయన తనకు అనుకూల గుత్తేదార్లకు ఇష్టారాజ్యంగా పనులు అప్పగించినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బడుల్లో 1.55 లక్షల ఫ్యాన్లు కొనుగోలు చేసేందుకు ఒక గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏపీఈడబ్ల్యూఐడీసీ తొలి విడతలో 3.14 లక్షల ఫ్యాన్లు తీసుకుంది. వాటిలో నాణ్యత లేదని ఉన్నతస్థాయి కంపెనీ తేల్చిచెప్పింది. 1.50 లక్షల డ్యూయల్‌ డెస్క్‌ల సరఫరా కాంట్రాక్టులోనూ నిబంధనల్ని ఉల్లంఘించినట్టు తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. గ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డులు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు వంటి వ్యవహారాల్లోనూ తీవ్రస్థాయిలో అవకతవకలు జరిగినట్లు విపక్షాలు మండిపడుతున్నాయి. 


జగన్‌ పత్రికకు రూ.వందల కోట్ల ప్రకటనలు!

సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌గా ఐదేళ్లపాటు చక్రం తిప్పిన విజయ్‌కుమార్‌రెడ్డి జగన్‌ కోటరీలో మరో కీలక అధికారి. జగన్‌ సొంత పత్రిక సాక్షితో పాటు, ప్రభుత్వానికి బాకా ఊదే పత్రికలు, టీవీ ఛానళ్లకు మాత్రమే  ప్రకటనల రూపంలో రూ.వందల కోట్లు కట్టబెట్టారని మండిపడుతున్నాయి. ఆయన సమాచార, పౌరసంబంధాలశాఖను సాక్షి పత్రిక, టీవీ ఛానళ్లలో పనిచేసేవారికి ఉపాధి కల్పన కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. 


తితిదేని సొంత సామ్రాజ్యంలా మార్చుకున్న ధర్మారెడ్డి

ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌ (ఐడీఈఎస్‌)కు చెందిన ధర్మారెడ్డి వైఎస్‌ కుటుంబానికి నమ్మిన బంటు. జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్‌కు సంబంధించిన సున్నితమైన వ్యవహారాల్లో దిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేయడంలో ఆయన దిట్ట అని విపక్షాలు చెబుతున్నాయి. అందుకే సీనియర్‌ ఐఏఎస్‌లకే ఇచ్చే తితిదే ఈవో పోస్టును ధర్మారెడ్డికి జగన్‌ కట్టబెట్టారు. దీంతో ధర్మారెడ్డి తితిదేని సొంత సామ్రాజ్యంలా మార్చుకుని  చెలరేగిపోయారు. తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డితో చేతులు కలిపి తితిదే నిధుల్ని ఇష్టానుసారం ఖర్చు చేశారన్న ఆరోపణలున్నాయి. కరుణాకర్‌రెడ్డికి కమీషన్ల కోసం నిక్షేపంలా ఉన్న భవనాల్ని కూలగొట్టి, హడావుడిగా టెండర్లు పిలిచారని.. తిరుమల కొండపై గదులు, ప్రసాదం, స్వామివారి సేవల ధరల్ని అడ్డగోలుగా పెంచేసి సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టారని విమర్శలు మూటగట్టుకున్నారు. 


జే బ్రాండ్‌ మద్యానికి.. ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌!

జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు జే బ్రాండ్ల మద్యం ద్వారా సాగించిన అప్రతిహత దోపిడీకి మాస్టర్‌ మైండ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డేనని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఐఆర్‌టీఎస్‌ అధికారైన ఆయనను జగన్‌ అధికారం చేపట్టిన మూడు నెలలకే కేంద్ర సర్వీసు నుంచి డిప్యుటేషన్‌పై తెచ్చుకుని ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా నియమించారు. తర్వాత డిస్టిలరీస్, బ్రూవరీస్‌ కమిషనర్‌గానూ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆయన వ్యవహారశైలి వివాదాస్పదం కావడంతో ఎన్నికల సంఘం ఆయనను ఇటీవల బదిలీ చేసింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని