యుద్ధ ప్రాతిపదికన అమరావతి నిర్మాణ పనులు

అమరావతిలో సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సీఆర్డీఏ అధికారులతో కలిసి రాజధానిలో దాదాపు రెండు గంటల పాటు పర్యటించారు.

Published : 10 Jun 2024 05:11 IST

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అనంతరం దృష్టి
నిలిచిన నిర్మాణాల పటిష్ఠతపై నిపుణుల నుంచి నివేదిక
రాజధానిలో సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సుడిగాలి పర్యటన

ఉద్దండరాయనిపాలెంలో అమరావతి శంకుస్థాపన ప్రాంత పరిశీలనకు వచ్చిన సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌తో మాట్లాడుతున్న అమరావతి రైతులు

ఈనాడు-అమరావతి, తుళ్లూరు-న్యూస్‌టుడే: అమరావతిలో సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సీఆర్డీఏ అధికారులతో కలిసి రాజధానిలో దాదాపు రెండు గంటల పాటు పర్యటించారు. ఆగిపోయిన భవన సదుపాయాలు, కట్టడాలను పరిశీలించారు. కరకట్ట రోడ్డు నుంచి మొదలుపెట్టి సీడ్‌యాక్సెస్‌ రహదారిపై ఉన్న సెంట్రల్‌ లైటింగ్‌ను పరిశీలించారు. విద్యుద్దీపాల పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ రాజధానికి భూమిపూజ జరిగిన ప్రాంతం, శంకుస్థాపన శిలాఫలకాలు, పవిత్ర మట్టి, నీరు, అమరావతి నమూనాలు ఉంచిన గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు. విజయవాడలోని సీఆర్డీఏ కీలక విభాగాలను ప్రాజెక్టు కార్యాలయంలోకి తరలించాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలభారత సర్వీసు ఉద్యోగుల భవన సముదాయాలు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల బంగ్లాలు, శాశ్వత సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ఎన్‌జీవో, నాలుగో తరగతి ఉద్యోగుల భవన సముదాయాలు, హ్యపీనెస్ట్‌ ప్రాజెక్టు, జ్యుడిషియల్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కట్టడాల పరిస్థితి గురించి సీఆర్డీఏ అధికారులను సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సీఎస్‌తో పాటు సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్, అదనపు కమిషనర్‌ సింహాచలం, సీఈలు ధనుంజయ్, ఎన్వీఆర్కే ప్రసాద్, పల్లంరాజు, ఇతర విభాగ అధికారులు పాల్గొన్నారు.

ఎన్‌జీఓల క్వార్టర్లు పరిశీలిస్తున్న నీరభ్‌కుమార్‌

కమిషనర్‌ తీరుపై సీఎస్‌కు రైతుల ఫిర్యాదు

సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ వ్యవహారశైలిపై రాజధాని రైతులు, మహిళలు సీఎస్‌కు ఫిర్యాదుచేశారు.  రెండేళ్లుగా కమిషనర్‌ అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్షిక కౌలు, ప్లాట్ల అభివృద్ధిపై తాము విజయవాడలోని ఆయనను కలిసి విన్నవించేందుకు ప్రయత్నించినా సరిగా స్పందించలేదన్నారు. అనేకసార్లు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత వార్షిక కౌలును త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు సీఎస్‌ హామీ ఇచ్చారు.

రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన స్థలంలో నమస్కరిస్తున్న సీఎస్‌


దశలవారీగా రాజధాని పనులు 

చంద్రబాబు ఆదేశాలను అనుసరించి అమరావతి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తున్నాం. తొలిదశలో పిచ్చిమొక్కలను శుభ్రం చేసే పనులను చేపట్టాం. 94 పొక్లెయిన్లతో 25 ప్రాంతాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ చేస్తున్నాం. తదుపరి దశలో ప్రతి పనినీ సమీక్షించి, ప్రమాణస్వీకారం ముగిశాక వాటిని మొదలుపెడతాం. రాజధానిలో జరిగిన చోరీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మంత్రివర్గంతో చర్చించాక రాజధాని రైతులకు వార్షికకౌలు చెల్లిస్తాం. ఆర్‌5 జోన్‌ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున నేను మాట్లాడలేను. ఐదేళ్లుగా నిర్మాణాలు నిలిచిపోవడంతో, వాటి పటిష్ఠతపై ఇంజినీరింగ్‌ నిపుణుల నుంచి నివేదికలు తీసుకుంటాం. పటిష్ఠతపై అవగాహన లేకుండా పనులు ప్రారంభించలేం.

నీరభ్‌కుమార్‌ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి


పోలవరం పనులపై నివేదిక రూపకల్పన

పోలవరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబునాయుడు ఏ క్షణంలోనైనా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చే అవకాశం ఉండటంతో జలవనరులశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత అయిదేళ్ల వైకాపా పాలనలో జరిగిన పనులకు సంబంధించి నివేదికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం, గైడ్‌ బండ్‌ కుంగడం, ఎగువ కాఫర్‌డ్యాం సీపేజ్‌కు సంబంధించిన కారణాలను నివేదికలో పొందుపరుస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు హిల్‌వ్యూపై హెలీప్యాడ్‌ పరిసరాలు, వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని