సంక్షిప్త వార్తలు(4)

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం(ఏపీఎస్‌ఏ) మాజీ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆ సంఘం ఉద్యోగులు తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు.

Updated : 11 Jun 2024 05:04 IST

చంద్రబాబును కలిసిన సచివాలయ ఉద్యోగులు

ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం(ఏపీఎస్‌ఏ) మాజీ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆ సంఘం ఉద్యోగులు తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు సోమవారం ఉండవల్లిలో ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నేతలు పాల్గొన్నారు. 


జులై 29 నుంచి ‘సుప్రీం’లో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ 

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టులో పెండింగ్‌ పడి రాజీకి అవకాశం ఉన్న కేసుల పరిష్కారానికి జులై 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. ఈ విషయమై రాష్ట్రంలోని కక్షిదారులకు సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.బబిత సోమవారం తెలిపారు. ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కక్షిదారులు లేదా వారి తరఫు న్యాయవాదులు మరిన్ని వివరాల కోసం సమీప కోర్టు ప్రాంగణాల్లోన్ని న్యాయసేవాధికార సంస్థను లేదా టోల్‌ ఫ్రీ నంబరు 15100ను సంప్రదించవచ్చని తెలిపారు.


కార్పొరేషన్‌ ఛైర్మన్ల రాజీనామాలు ఆమోదం

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్లుగా నియమితులైన వారి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ ఛైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి, ఏపీ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఛైర్మన్‌ దిలీప్‌కుమార్, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కాయల వెంకటరెడ్డిలు చేసిన రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించి, గెజిట్‌ జారీ చేసింది. 


నూతన సీఎస్‌కు ఏపీ ఐకాస శుభాకాంక్షలు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌కు ఏపీ ఐకాస ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, హృదయరాజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్‌ను సోమవారం రాష్ట్ర సచివాలయంలో కలిసి జీతాలు అందని కొన్ని శాఖల ఉద్యోగుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగులో ఉన్న వారి బకాయిల గురించి చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం దీనిపై చర్చిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని